Tuesday, 17 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 73 వ భాగం



వేయిమందికి అన్నదానం చేసామంటే ఇన్ని సంవత్సరాలూ వారు అన్నం తినకుండా ఉన్నారంటారా? ఆ రోజు కూడా వారెక్కడో తినేవారు. అంతమందిని పిలిచి పెట్టాం, 10,15 మందికి పెట్టలేకపోవడం జరిగింది. సేవ చేయడం మంచిదా? అందరికీ సేవ చేయలేకపోవడం మంచిదా? ఆలోచించండి. ఎందుకు చెప్పానంటే ఒకనికి సాయపడినా అనేక సమస్యలు, బాధలూ తప్పవని చెప్పడానికే. చేస్తామని చేయలేకపోయాం కదా!


ఒకడందరికీ సాయం చేయలేదు. కోటీశ్వరుడైనా దానాలిస్తూ పోతే చివరకు యాచకులను పొమ్మనే పరిస్థితి ఏనాటికైనా వస్తుంది. కొంత చెడు జరిగినా మంచి పనులు చేయవలసిందే కాదనను.


మరొక ఉదాహరణ. ఒక ప్రదేశంలో మకాం వున్నాం. ఆ ఇంటి వాసాలు పుచ్చిపోయి అందుండి పెద్ద పెద్ద పురుగులు రొద చేయడం మొదలు పెట్టాయి. అందొకటి క్రిందబడి వెల్లకిలా పడింది. లేవలేదు. అక్కడున్న చీమలు దానిచుట్టూ మూగి కుడుతున్నాయి. ఆ చిమ్మట పురుగును మామూలుగా చేస్తే ఎగిరిపోతుందని, అట్లా చేస్తే అది ఎగిరిపోలేదు సరికదా, ఈ చీమలన్నిటినీ తినడం మొదలెట్టింది.


ఒక జీవికి సాయం చేద్దామంటే అనేక జీవుల హింసకు కారణమయ్యాం. ఒక ప్రాణిని రక్షించామనే అహంకారానికి దెబ్బ తగిలింది. దుర్మార్గుడైన రావణుని సంహరిస్తే పతివ్రతయైన మండోదరి, విధవ కాలేదా? ఇట్లా మంచి, చెడు ఒక దాని వెంట మరొకటి అనుసరిస్తూనే ఉంటాయి.


అవతారం బోధించేది క్రియాశూన్యాన్నే


ఏ అవతారంలోనైనా ఎక్కువ మంచి జరిగినా కొంత చెడు జరగక తప్పదు. మంచిని చేయడమే, ధర్మాన్ని స్థాపించడమే అవతారం లక్ష్యం. ఎప్పుడైతే క్రియ యుందో కొందరికి ఉపకారం, కొందరికి అపకారం తప్పవు. కాబట్టి పరమాత్మ సంకల్పించాడంటే ఎన్నో అవతారాలు మంచిని చేసాయి.


No comments:

Post a Comment