దీని తరువాత వ్యుప్తకేశ పదముంది. ఈ పదం, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, జాలరి వంటి కులాల పదాల మధ్యలో రాదు. ఈ రెండు పదాలు విడిగా చెప్పబడ్డాయని, ఏక వచనాంతములని అన్నాను. వ్యుప్తకేశునిగా అనగా సన్న్యాసిగా ఉంటాడు. 24 శివమూర్తులలో తలగొరుగుకొన్న మూర్తి కనబడడు. అన్ని మూర్తులు జటాధారులై యుంటాయి. అతడే అవతారంలో అట్లా ఉన్నాడంటే కేవలం శంకరాచార్యులు అవతారంలోనే. అట్లా అభినవ శంకరులు వ్యాఖ్యానించారు.
ఆ ఆధారం ఒక్కటీ సరిపోతుందా? పురాణాల ఆధారాలను చూపిస్తాను. ఇతిహాస పురాణ జ్ఞానం లేకుండా వేద మంత్రాలు అర్థం కావు. అన్నిటినీ కలిపి చదివిన వానిని బహుశ్రుతుడని అంటారు. వీటిని జోడించంకుండా వేదానికి అర్థం చెబితే వేదం, భయపడుతుందనే శ్లోకం ఉంది.
"ఇతిహాసపురాణాభ్యాం వేదం సముప బృంహయేత్
బిభేతి అల్ప శ్రుతాత్ వేదో మా మయం ప్రతరిష్యతి”
ఏమిటా భయం? ఇష్టం వచ్చినట్లు మా మంత్రాలకు అర్థం చెబుతున్నాడని వేదం భయపడుతుందట. కనుక వ్యాఖ్యానకర్త వ్యుప్తకేశుడెవరని పురాణాలను శోధించాడు. తాను చెప్పే మాటలకు పురాణాధారం చూపించాలి కదా!
శివ రహస్యం అనే గ్రంథంలో వ్యుప్తకేశుడనగా శంకరులనే ఉంది. ఇక శ్రుతిలో ఉన్నదానిని విష్ణు ధర్మోత్తర పురాణం బలపరిచిందని తెలుస్తోంది.
No comments:
Post a Comment