Monday 16 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 72 వ భాగం



క్రొత్తగా ఆలయమెందుకు? పాఠశాలలు, వైద్యాలయాలు కట్టవచ్చు కదా "అని ప్రశ్నిస్తారు. మానవ సేవ చేయడం మంచిదే. దానిని చేయండని శాస్త్రాలూ చెబుతున్నాయి. రోగులకు మందీయడం మంచిదే. కాని ఒక దుర్మార్గుణ్ణి కాపాడితే వాడు సంఘానికి చేటు తీసుకు రావడం లేదా?


మంచిని నిరాకరిస్తున్నానని, చెడును ఎక్కువగా చూపిస్తున్నానని భావించకండి. ఏదో మంచి చేద్దాం, చివరికిట్లా చేటు వచ్చిందని అనడం వినడం లేదా?


గాంధీగారు కొన్ని నెలల్లో చంపబడతారనగా దేశం విభజింపబడి లక్షలాది ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇందుకా స్వరాజ్యం తెచ్చిందని బాధ పడలేదా?


ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాం. కాలం గడిచిన కొద్దీ క్రొత్త సమస్యలు పుట్టుకుని వస్తాయి. ఒక రోగాన్ని కుదర్చడం కోసం ఒక మందు వాడతాం. కుదిరినట్లుంటుంది. కొన్ని మందుల వల్ల అసలు రోగం కంటే క్రొత్త రోగాలు వస్తున్నాయి.


ఒక మాటు అన్నదానం ఏర్పాటు చేసాం. పెద్ద పెద్ద అన్నరాసులు ఖర్చయిపోయాయి. ప్రజలు తృప్తి పడ్డారు. మాకూ తృప్తి కలిగింది. తృప్తి పడ్డాం అంటే మేము చేసాం అనే అహంకారం, అందులో దాగి యుంది. అంతా ముగించిన వెనుక ఎండలో మాడి చాలాదూరం నుండి పది పదిహేనుమంది వచ్చారు. అన్నం లేదు. అన్నీ ఖాళీ పాత్రలు. అనాటి వారి నిరుత్సాహాన్ని చూస్తే బాధ కలిగింది. పై తృప్తి ఆవిరైపోయింది. వారికి ఏవో పళ్లు, డబ్బు ఇచ్చి పంపవలసి వచ్చింది.


No comments:

Post a Comment