Thursday 26 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 82 వ భాగం




దక్షిణామూర్తి అనుగ్రహంతో అట్టివారు చరిస్తూ ఉంటారు. రామకృష్ణ అవతారాలు గడిచినా భక్తులను నేటికీ వారు అనుగ్రహించడం లేదా? ఎట్లా? అనుగ్రహం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంటుంది. భక్తి పెంపొందినకొలదీ అనుగ్రహం, మానవ రూపాన్నెత్తుతుంది. కనుక శంకరులు అనుగ్రహ శక్తితో నేటికీ ఉన్నారు .


శంభువనగా, సుఖం ఈయన వలన కలుగునని అర్థం. సుఖ రూపియై యుండువాడు. ఆయన ఉత్పత్తి చేస్తాడు. పంపిణీదారుడు కాదు. దానికి తగ్గ ప్రతినిధులుంటారు. మిల్లుల్లో తయారైన వస్తువులు, వాటికి పంపిణీదారులు వివిధ ప్రదేశాల్లో లేకపోతే తయారైన చోటే అవి నిలవ యుండిపోతాయి. కనుక శంభువు, శంకరుడు కావాలి. అనగా ఈ పదానికి సుఖమును చేస్తాడని. ఆయన నానా ప్రదేశాలు తిరగాలి. గంగ, గంగోత్రిలో పుట్టి నానా ప్రదేశాలు తిరిగి చివరకు ఇంట్లోని గొట్టాల ద్వారా మన దగ్గరకు వస్తోంది. అట్లా జ్ఞానాన్ని శంకరులందించారు. దక్షిణామూర్తిని సమీపించలేము, అతడే ప్రజల దగ్గరకు శంకరులుగా వచ్చాడు.


అవతార విషయమై ఆధారాలు


శంకర విజయంలో శంకరుడే, శంకరాచార్యులుగా అవతరించినట్లుంది. ఆ వ్రాసినవారు శంకర భక్తులై అట్లా వ్రాసియుండవచ్చు అని శంకిస్తారు. దానికంటే ఇతరమైన ఆధారాలను చూపిద్దాం.


వేదం కంటె మించిన ప్రమాణ గ్రంథం లేదు కదా! అయితే అక్కడ పరోక్షంగా ఆధారం చూపబడింది. ఇది యజుర్వేదంలోని నమక మంత్రాలలో ఉంది. అట్లే ఋగ్వేదంలోనూ ఆధారముంది. వాటికంటే ముందుగా, 18వ శతాబ్దంలో 95 సంవత్సరాలు జీవించిన భాస్కర రాయల మాటలను చెబుతాను. ఆయన పేరునకు తగ్గట్లు విద్వత్ సూర్యుడే. మంత్ర శాస్త్ర రహస్యాలను లోకానికి అందించినవాడు. దేవీ భక్తుడు. లలితా సహస్రనామంపై ఆయన వ్రాసిన వ్యాఖ్య ప్రసిద్ధమైనది. వారే శంకరులను నుతిస్తూ శ్లోకాలు వ్రాసేరు. 

No comments:

Post a Comment