Tuesday 24 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 80 వ భాగం



శంభువే శంకరుడు


"అజ్ఞానాం తర్గహన పతితం ఆత్మవిద్యోపదేశైః 

త్రాతుంలోకాన్ భవదావశిఖాతాప పాపచ్యమానాన్ 

ముక్త్యామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతీ 

శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా"


- మాధవ శంకర విజయం (4-60)


శంభువు, ప్రపంచంలో సంచరిస్తున్నాడని వర్తమానం కాలంలో చెప్పబడింది. గమనించండి.


స్వామి శంభువు. అమ్మవారు శాంభవి. శాంభవీ దీక్ష అనే మాటను విన్నారు కదా. శం అనగా శాశ్వత సుఖం. రెండు రకాల శుభాలున్నాయి. ఒకటి శం. రెండవది 'మయస్'. రుద్రంలో "మయోభూః", "శంభు" అనే పదాలున్నాయి. ఒకటి మామూలు సుఖమని, రెండవది శాశ్వత సుఖమని వ్యాఖ్యానకర్తలు వ్రాసేరు.


శంభువనగా శాశ్వత సుఖం పుట్టినచోటు. అనగా మోక్ష సుఖం లభించేచోటు. అందువల్ల శంభువు.


దక్షిణామూర్తి మఱ్ఱి చెట్టు క్రింద ఆసీనుడై యుంటాడు. ఎందుకు? ఒకడు మాట్లాడుతూ ఉంటే వినేవాడుండాలి కదా! తనకంటె వేరొకడు లేడని అనినపుడు బ్రహ్మజ్ఞానిగా నున్నపుడు మాట్లాడడమేమిటి? అందువల్ల మౌనం. మాట్లాడాలంటే మనస్సుండాలి కదా. మాయవల్ల ఏర్పడిన మనస్సే అతనికి లేదు. అది లేనపుడు మాటేమిటి? అఖండ మౌనంలో ఉండిపోతాడు.


No comments:

Post a Comment