Thursday 19 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 75 వ భాగం



ఇదీ బాగానే ఉంది. చెడ్డ భావాలు, చెడ్డ పనులు చేయడం కంటే సత్కర్మలు చేయాలనుకోవడమూ మంచిదే. ఏదైనా మంచి వలన చెడు ఎదురైనా పెద్దలనడిగి తెలసికొని పరిష్కారం చేస్తాం. ఇట్లా సత్కర్మలు చేయాలనే సంకల్పం, చేయుట జరిగితే మన కర్మ భారం తగ్గుతుంది. ఏ మంచి చేయకుండా క్రియారహితులుగా ఉండడం మంచిదని ఇంతకుముందు చెప్పాను, అది విని మీలో, వేదరక్షణ, రోజూ పిడికెడు బియ్యం ఇతరులకై ఉంచడం, చెఱువులు త్రవ్వడం వంటివి నేను చెప్పినవి చేయకుండా ఉందామంటే అది సబబు కాదు. అవే కాదు, ఇంకా మంచి పనులు చేయండంటాను.


నిష్క్రియత్వం గమ్యమని చెప్పిన శంకరులు, శాస్త్రప్రకారం నడవండి, ఇతరులకు సాయం చేయండి. పంచాయతన పూజ చేయండని చెప్పారు.


కర్మల వల్ల కర్మ రహిత స్థితి


వారనేక సత్కర్మలను చేయాలని ఎందుకన్నారంటే, కర్మ రహిత స్థితిని చేరుకోవడానికే. ఎంత మంచి పనియైనా అదే అంతిమ స్థితి కాదు. కర్మ, భక్తి యోగాలు, పూజ, ధ్యానాదులు అన్నింటి లక్ష్యమూ కర్మ రహిత స్థితియే. ఏ పని చేయకుండా ఎవ్వడూ ఉండలేదు. కనుక నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవద్దని, కర్మానుష్ఠానం చేయాలని, చిత్తశుద్ధిని పొందాలని, ఋజుత్వాన్ని కలిగియుండండని అందరూ అన్నారు.


ఆత్మలో మనస్సు లీనం కావాలంటే ముందు చిత్తానికి శుద్ధి ఏర్పడాలి. సామాన్యులకు కర్మానుష్ఠానం తప్ప మరొక మార్గం లేదు. ఆత్మ సాక్షాత్కారానికి ముందు సత్కర్మానుష్ఠానం చేయవలసిందే. అందువల్లనే అన్ని గ్రంథాలూ కర్మయోగాన్ని ప్రశంసించాయి. తద్వారా కర్మ రహిత స్థితి.


No comments:

Post a Comment