శివసాయుజ్యం పొందిన వారి భక్తి గురించే యుంటుంది. భక్తిని, జ్ఞానానికి అంగంగా శంకరులు భావించారు. కేవలం భక్తికే పట్టం గట్టలేదు. అయినా నాయనార్ల సరసన వీరి చరిత్ర ఉండడం వల్ల దీని ప్రామాణ్యాన్ని పేర్కొంటున్నాం. ఆపైన వీరిని ఈశ్వరావతారంగా భావించింది.
తొమ్మిదవ భాగంలో పదునొకండవ అధ్యాయంలో ఒక ఉత్తమ బ్రాహ్మణుడు నా అంశతో చచలగ్రామంలో (కాలడిలో) పుట్టబోతున్నాడని శంకరుడు, అమ్మవారితో చెప్పినట్లుంది.
"కేరళే చలచల గ్రామే, విప్రపత్న్యాం మదంశజః
భవిష్యతి మహాదేవి శంకరాభ్యో ద్విజోత్తమః" ఇక కూర్మ పురాణంలో శంకరావతారం:
"కరిష్యత్యవతారం స్వం శంకరో నీలలోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భూతానాం హితకామ్యయా" అనగా లోకహితం కోసం నీలలోహితుడు (శివుడు) పుట్టబోతున్నాడని అర్ధం. శివుణ్ణి ఎఱ్ఱవానిగా, తెల్లనివానిగా వర్ణనలున్నాయి. వేదాలలో రాగి, అరుణ, నీలలోహిత వర్ణాలతో నున్నట్లుంటుంది. ఎర్రని శివుడు, నీలమైన అమ్మవారిని ఎడమవైపు ధరించి యుంటాడు. హరి హరమూర్తిగా నున్నపుడు నీలలోహితుడు. కృష్ణ పింగలం అని కీర్తించినపుడు ఆయన ఎరుపు, విష్ణువు (కృష్ణ) నలుపు. పింగలుడనగా ఎర్రని శివుడు.
శ్రాత స్మార్త కర్మల ప్రతిష్టాపనకై పుడతాడని అన్నాడు. ఇక లింగ పురాణంలో, కలిలో వేదవిద్యలడుగంటుతాయని, వాటిని నిందిస్తారని, రుద్రుడు శంకరులై పుట్టి కలి దోషాన్ని పోగొడతాడని యుంది:
"కలౌ రుద్రో మహాదేవః శంకరో నీలలోహితః"
No comments:
Post a Comment