Monday 30 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 86 వ భాగం



శివుని ఇతిహాసం చెప్పేది శివరహస్యం. ఇది 50 వేల శ్లోకాలతో ఉంటుంది. దీనిని నిర్ణయ సింధువు వంటి ధర్మశాస్త్ర నిబంధన గ్రంథము ప్రామాణికమని పేర్కొంది. సుబ్రహ్మణ్యుడు, జైగీషవ్యునకుడనే ఋషికి ఉపదేశమిస్తే అతడు నైమిశారణ్యంలోని ఋషులకు అందించాడు. అట్లా లోకంలో ప్రచారమైంది. దీనిని జైగీషవ్యుడు సంకలనం చేసాడు. పరమేశ్వరుడు, అమ్మ వారికి చెప్పగా నేను నీకు చెబుతున్నానని సుబ్రహ్మణ్యుడే అన్నాడు.


ఇది 12 అధ్యాయాలతో ఉంటుంది. అంతా శివుని గురించే. తొమ్మిదవ భాగంలో శివభక్తుల గురించి ఉంటుంది. 63 నాయనార్ల చరిత్ర ఉంటుంది. మారికూవరం దగ్గర కంజనూర్లో ఒక వైష్ణవుడుండేవాడు. అతడు శైవుడై అతిహరదత్త శివాచార్యుడయ్యాడు. అతని కథ కూడా అందే ఉంది. మన శంకరుల చరిత్ర కూడా ఉంది. రాబోయే కథలను జ్ఞాన దృష్టితో పరికించి చెప్పబడిన కథలవి.


అద్వైతియైన శంకరుల గురించే కాకుండా భక్తుడైన శంకరుల గురించే యుంటుంది. వారు శివుడు, విష్ణువు, అమ్మవారు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతలపై అనేక స్తోత్రాలు చేసారు. కనుక వారు జ్ఞానులు, భక్తులూ కూడా.


అమ్మవారి గురించి సౌందర్యలహరియే వ్రాసారు. శ్రీ యంత్రాన్ని అనేక ఆలయాలలో ప్రతిష్ఠించారు. విష్ణు సహస్రనామాలకు భాష్యం వ్రాసారు. వారి మఠాలలో కొలిచేది, చంద్రమౌళీశ్వరుడినే. శివానందలహరిని శివునిపై వ్రాసేరు. అందువల్ల శివ భక్తునిగా శివరహస్యం పేర్కొంది.


కాలడిలో పుట్టుక దగ్గరనుండి కంచిలో ముక్తి పొందేవరకూ వీరి చరిత్ర అందులో ఉంది. పరమేశ్వరుడు పంచ స్ఫటిక లింగాలిచ్చినట్లు కూడా ఉంది. అద్వైత ప్రతిష్టాపనం గురించి ఇది స్పృశించదు.


No comments:

Post a Comment