Saturday 7 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 63 వ భాగం



నిష్క్రియునకు దయయా?


దక్షిణామూర్తి, మౌనంగా మర్రిచెట్టు క్రింద ధ్యానంలో ఉంటాడు. ఆయన చూడడు, మాట్లాడడు కాని ఆయన మనస్సు దయతో పొంగుతోంది. అద్వైతంలో మనస్సే లేదు. మనస్సు పోతేనే ఆత్మ ప్రకాశిస్తుందని ఉంటుంది. అయితే దయతో, అయ్యో మానవులిట్లా అయిపోతున్నారేమిటని జాలిపడ్డాడు. (నవ్వుతూ అన్నారు స్వామి). అయితే అద్వైతమూర్తి ఎట్లా కాగలడతడు? మనపై దయ చూపించాడంటున్నాం. అయితే మనస్సుండాలి కదా!


ఘోషాస్త్రీ కనబడదు. వినబడదు కూడా. అయితే పిల్లవాడొక గోతిలో పడిపోతున్నపుడు బైటకు వచ్చి కేకలు వేస్తూ రక్షించదా? దక్షిణామూర్తికి అట్టి పరిస్థితి ఏర్పడింది. అతడు నిష్క్రియుడైనా దయతో వీక్షించాడు.


ప్రజలు బుద్ధితో వాదవివాదాలు చేసికొంటున్నారు. చేతులు కలబడడం వల్లనే కాదు, సంకల్పాల వల్లనూ సంఘర్షణలు వస్తాయి. ఇపుడు మనస్సును సక్రమ మార్గంలో పెట్టాలని చివరకు క్రియా రహిత స్థితిని పొందునట్లు చేయాలి.


మనస్సులోని ద్వైతాన్ని తొలగించడం అద్వైతం


సంకల్పాలను లేకుండా మనస్సును నిర్మూలించుటయే అద్వైతం. మనకంటే భిన్నమైనది ఒకటుందని మనస్సు వల్లనే కల్గుతోంది. స్వప్నంలో మరొకటి కనబడదు. మనస్సు అణిగియుండడం వల్ల అట్లా జరిగింది. అందువల్ల ప్రశాంతంగా ఉంటున్నాం. మరొక వ్యక్తి కనబడితే శాంతికి భంగం. అతనికేదో ఉపకారం చేయాలని ఒక మాటు, మరొక సందర్భంలో ఒకర్ని చూస్తే ఈర్ష్యా ద్వేషాలు కల్గుతున్నాయి. ఒకనిమీద ప్రేమ చూపిస్తే మనసులో సంతోషం, ద్వేషం చూపిస్తే అవతల వ్యక్తికి కీడు కంటె మనకపకారం కల్గుతోంది.


No comments:

Post a Comment