Wednesday, 25 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 81 వ భాగం



అన్ని నదులకూ ఒక మూలం ఉంటుంది. అది ఒక సన్నని త్రోవలా ఉంటుంది. అక్కడ నీరు నిలవగా ఉంటుంది. గంగోత్రికి ఉత్తరాన అట్లా ఉంటుంది. గంగ, ఆవు ముఖంలా ఉండే గోముఖి అనే రాతి తొర్రలో నుండి ప్రవహిస్తుంది. కావేరీ నది కూడా మూలమైన తలకావేరీలో సహ్యాద్రి కనుమలలోని కొడగులో అట్లాగే ఉంటుంది.


ఆ సన్నని త్రోవనుండి నీరు ప్రవహిస్తే ప్రజలకు లాభం లేదు. కానీ రొద చేసుకుంటూ పోతున్న నదీ ప్రవాహం ప్రజల అవసరాలు తీరుస్తుంది. దక్షిణామూర్తి కూడా శబ్దం చేయని సన్నని త్రోవలోని నీరులాగా ఉంటాడు. నదీ మూలాన్ని కొందరే గుర్తిస్తున్నట్లుగా సనకాదులే అతణ్ణి సమీపించగలరు. మామూలు జనులు సమీపించలేరు.


2500 సంవత్సరాల వెనుక ఉన్నవారు, అట్టివారి ఉపదేశాలు వినక, గురూపదేశాలు వింటున్న కాలమది. వారు అజ్ఞానమనే అరణ్యంలో చిక్కుకొన్నారని శ్లోకంలోని 'అజ్ఞానంతర్గహన పతితం' మాటకు తాత్పర్యం. అంతేకాదు, ఆ అరణ్యంలో దావాగ్ని కూడా ఉంది. ఇక చెప్పేదేముంది? . అజ్ఞానమనే అరణ్యంలో చిక్కుకున్నారు. సంసారమనే దావాగ్ని మధ్యలో ఉన్నారు. అందుకే 'భవదావశిఖాతాప పాపచ్చమానాన్' అక్కడ జ్ఞాన తీర్థంలో, దక్షిణామూర్తి సేద తీరుతున్నాడు. ఈ దావాగ్ని చల్లారాలంటే ఆ నీరు విడుదల కావాలి ! భగీరథుడు, గంగను తీసుకొని వచ్చినట్లు ఆ గంగను ఎవరైనా తీసుకుని రాగలరా? ఇప్పుడు తనంతట తానే రావాలి. దయయే కారణం కావాలి.


అందుకే లోకాలను విడిచాడు. 'ముక్త్యామౌనం'. ఆ చిన్ని గుంట నదిలా మారింది. అది జ్ఞాన గంగగా మారింది. శంభువు శంకరుడయ్యాడు, శాశ్వత సుఖాన్నిచ్చేవాడయ్యాడు. కదలనివాడు, కదిలే శంకరుడయ్యాడు. దక్షిణామూర్తి, మూలవిరాట్టయితే శంకరులు, ఉత్సవమూర్తిగా అయ్యారన్నమాట. ఎప్పుడో కదిలాడని కాదు. కదులుతూ ఉన్నాడని 'చరతి' అని వాడబడింది. ఎప్పుడో శంకరులుగా అవతరించిన వారిప్పటికీ వర్తమాన కాలంలో కూడా చరిస్తున్నారని చెప్పబడింది.


No comments:

Post a Comment