Saturday 21 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 77 వ భాగం

 


మోక్షం కోసం దిగులు పడడం లేదు, అది వస్తే రానీ, సేవ చేయడం నా వంతని అనడం కూడా అహంకార సూచకమే. 

 

సరే నీవు మంచి చేస్తున్నావు. ఈశ్వరుడు నీకొక మనస్సు నిచ్చి మాయతో బద్ధుణ్ణి చేసాడు. అంతటితో ఆగకుండా సాధన మార్గాన్ని ఉపదేశించాడు. కర్మబంధాల నుండి విముక్తిని పొందే మార్గాన్నీ నీకుపదేశించాడు. అట్లా ఉన్నప్పుడు నేనీ కర్మలోనే ఉండి, అనగా ఈ కారాగారంలోనే ఉండి ఇందున్నవారికి సాయం చేస్తానని అనడం ఏమిటి? అతని ఆజ్ఞను పాటించవద్దా? నీవు చేసే పని అంతా కర్మబద్ధులకే అని గుర్తుంచుకో. కారాగారంనుండి విడుదల చేయటం నీవల్ల కాదు. అది వాని చేతిలో ఉంది. ప్రతివాడూ ప్రయత్నిస్తే అతడు తాళాలు తెరుస్తాడు. నీవు చేసేదంతా సంసారంలో కొట్టుమిట్టాడుతున్నవారికే. అందులో ఉన్నవారికి సాయం చేసి తృప్తి పొందుతానంటే, జ్ఞాన మార్గాన్ని పట్టుకోనంటే, అఖండానందం అక్కర్లేదనుకుంటే అది ఎంత మూర్ఖత్వమో ఆలోచించు. తెలియకుండానే నీలో అహంకారం గూడు కట్టుకొని యుంది సుమా!

 

అప్పుడీశ్వరుడేం చేస్తాడు? ఇట్లా సేవ చేసినా చిత్తశుద్ధి ఏర్పడితే చాలని అనుకుంటాడు. చేసేది నిజమైన సాయం కాకపోయినా కర్మయోగమైనా చేస్తున్నాడని ఊరుకుంటాడు. నా సృష్టి గురించి నేను చూసుకుంటాను. నన్నొక సాధనంగా వాడుకొని నిన్ను బాగు చేయడానికి ఉపయోగిస్తా. ఇతరులకు సాయం, నీవల్లనే జరగదులే అని భావిస్తాడు.

 

ఈశ్వరునికి లేని బాధ నీకెందుకు? అతడు నీకిచ్చిన మనస్సును శుభ్ర పరచులేకపోతున్నావు. ఎవరికో సాయం చేద్దామని అనుకుంటున్నావు. చిత్తం అటూ ఇటూ తిరకుండా మంచి కర్మలను చేయవలసిందే. ఆత్మవిచారానికి అనువుగా నున్నపుడు కూడా నేను కర్మనే చేస్తాను, లోకాన్ని ఉద్దరిస్తానని అనడం ఏమిటి? ఏదో జరిగిపోయిందని ఊహించుకుంటున్నావు.

No comments:

Post a Comment