Monday 2 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 59 వ భాగం



శక్తిని అంతర్గతం చేసుకొని దక్షిణామూర్తి


పరమేశ్వరుడనేక రూపాలలో ఉంటాడు. అవి కళ్యాణ సుందరమూర్తి, సోమస్కంద మూర్తి, నటరాజమూర్తి, భైరవమూర్తి మొదలైనవి. ఇందులో ఏది అవతారానికి కారణం? కలిలో సన్న్యాస గురువు అవతరించాలి కనుక శక్తితో కూడిన సోమస్కందాది మూర్తులు వీలుపడవు. ఎందుకంటే పక్కనే అమ్మవారుండాలి కదా! ఇక భైరవమూర్తి వచ్చాడంటే భయంకరంగా ఉంటాడు. అటువంటివాడు, శాంతమైన పలుకులతో ఉపదేశం ఎలా ఇస్తాడు?


కనుక దక్షిణామూర్తి, అవతార కారకుడు కావాలి. అతడు, అమ్మవారితో కలిసి యుండడు. అయితే బాలా త్రిపుర సుందరిగానో, కన్యాకుమారిగానో, దుర్గగానో అమ్మవారు వచ్చినా అయ్యవారు ప్రక్కన ఉన్నట్లు కనబడరు. శివశక్తులు విడదీయరానివి కనుక విడిగానున్నట్లు భావించకూడదు. నిర్గుణ సగుణ బ్రహ్మమే అసలైన శివశక్తి స్వరూపము. ప్రపంచంలో లీలార్ధమై దంపతులుగా ఒకమారు, విడిగానున్నట్లు ఒక మారు కన్పిస్తారు.


పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వచ్చినా, నిష్క్రియుడైనా, క్రియా స్వరూపిణి యైన అమ్మవారు లోపలే ఉంటుంది. ఆమెను మనం చూడలేం. అట్టి శక్తి లేకపోతే శంకరులుగా అవతరించి దేశాన్ని ముమ్మారు పర్యటించి, అనేక గ్రంథాలు వ్రాసి, వాదాలలో పాల్గొని అందర్నీ అనుగ్రహించడం కుదురుతుందా?


శుభమును చేయువాడే శంకరుడు. కనుక నిష్క్రియుడెట్లా అవతరించాడు? అన్ని శక్తులకు పరాశక్తియే మూలం. అనగా క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తులకు మూలం. ఇట్టి పరాశక్తి, దక్షిణామూర్తిలో సూక్ష్మాకారంతో ఉంటుంది.


No comments:

Post a Comment