Saturday, 30 September 2023

శ్రీదత్త పురాణము (273)

 


ద్రవ్యాభావానికి తోడు ద్విజాభావం కూడా తటస్థపడితే ఇంత అన్నం వండి పైతృకసూత్రంతో హోమం చేస్తే సరిపోతుంది. అగ్నియే దొరక్కపోతే (అగ్న్యాభావం) నిపుహస్తంలో హోమం చెయ్యవచ్చు. అత్యంత ద్రవ్యశూన్యుడైతే (అన్నం కూడా వండలేనంత) ఆవుకి ఇంత గడ్డి వేసి స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. అది కూడా చెయ్యలేని మహాదరిద్రుడే అయితే నిర్జనారణ్యంలోకి పోయి దరిద్రుణ్ని నేను మహాపాపిని అని నిందించుకుంటూ బిగ్గరగా ఏడవాలి.


తిథి అయిన మర్నాడు తత్కర్త తప్పకుండా పితృతర్పణాలు చెయ్యాలి. చెయ్యకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుట్టుంది. వంశ నాశనమవుతుంది.


శ్రద్ధతో ఇలా పితృదేవతలనూ విశ్వేదేవతలనూ తిధినాడు అర్చించేవారికి వంశ విచ్ఛేదం ఉండదు. తామరతంపరగా వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదేవతలని పూజించటం అంటే విష్ణుమూర్తిని పూజించటమే. జగన్నాధుడు సంతుష్టుడయితే సర్వదేవతలూ సంతుష్టులయినట్లే ఈ స్థావరజంగమాత్మకమైన సకల సృష్టి విష్ణుమయం. విష్ణుమయం కానిది ఏదీ లేదు. విశ్వాధారుడు, విశ్వభూతాత్మకుడు అనౌపమ్య స్వభావుడు హవ్యభుక్కు పరబ్రహ్మాభిధేయుడు- ఆ జనార్ధనుడు. కనుక భోక్త విష్ణువు. కర్త విష్ణువు. కారయిత విష్ణువు.


శౌనకాది మహామునులారా! సాక్షాత్తూ దత్తాత్రేయుడు ధర్మకీర్తికి భోదించిన ఈ ఉత్తమ శ్రాద్ధవిధిని ఆచరించటమే కాదు. స్రాద్ధ సమయంలో ఈ భాగాన్ని పఠిస్తే పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కర్తకు వంశాభివృద్ధి సంతానాభివృద్ధి జరుగుతుంది- అని సూతమహర్షి ఫలశ్రుతి పలికాడు.


సనత్కుమారా! వింటున్నావుగా, దత్తాత్రేయుడు శ్రాద్ధయోగ్య పదార్థాలేమిటి వర్ణించవలసినవి ఏమిటి తొలినాట ఈ విధిని ఎవరు ఆచరించారు మొదలైన ప్రశ్నలు వేస్తే భీష్ముడు కురుక్షేత్రంలో శరతల్పంమీద ఉండి ధర్మరాజుకి చెప్పిన అత్రి - నిమి సంవాదాన్ని వినిపించాడు. దత్తుడు కొడుకు నిమికి పుత్రవియోగం కలిగిందనీ, ఆ దుఃఖాన్ని తీర్చుకోడానికి ముమ్మొదటగా ఈ విధిని రూపొందించాడనీ, దానికి అత్రి మహాముని సమ్మతి తెలియజేసాడని శ్రాద్ధవిధిలో విశ్వదేవతలకూ పితృదేవతలకూ అగ్నికీ సోముడికీ ఇంకా సంబంధిత దేవతలకూ భాగాలు కల్పించాడనీ వర్ణనీయాలను నిర్దారించాడని వివరించాడు.


Friday, 29 September 2023

శ్రీదత్త పురాణము (272)

 


దర్భల మీద పాత్రలుంచి శంనో దేవీతి మంత్రంతో ఉదకం నింపి యవోసి మంత్రంతో బియ్యం వేసి గంధపుష్పాలతో అర్చించి విశ్వే దేవాస మంత్రంతో విశ్వేదేవతలను అవాహన చెయ్యాలి. యాదివ్యా మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. గంధ, వస్త్ర, భూషణ, పత్ర, పుష్ప, ధూపదీపాలతో పూజించాలి.


విశ్వేదేవుల అనుమతి తీసుకొని పితృదేవతలను అర్చించాలి. తిలదర్భలతో ఆసనం సమర్పించాక (దర్భల మీద) మూడు పాత్రలుంచి శంనోదేవీ మంత్రంతో నీళ్ళునింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉశంతీతి మంత్రంతో పితృదేవతలను ఆవాహనచేసి “యాదివ్యా”తో ఆర్ఘ్యమివ్వాలి. గంధ పత్ర వస్త్రభూషణ పుష్పధూప దీపాలతో యధాశక్తిగా అర్చించాలి. అటుపైన ఉన్న గ్రాసాన్ని అగ్నౌ కరిషేన మంత్రంతో అగ్నికరణం చెయ్యాలి. ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్ని బాహుళ్యం, విధాన బాహుళ్యం, నియమ బాహుళ్యం, సాంప్రదాయ బాహుళ్యం ఉంది గుర్తించాలి. తరువాత నియంత్రిత బ్రాహ్మణులు వాగ్యతులై భోజనాలు చెయ్యాలి. పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ పాకాదుల్ని ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిస్సు రాక్షసమైపోతుంది. కనుక కావలసింది అడిగి వేయించుకోవటం కన్నా మాట్లాడకుండా ధృతభాజనులై భుజించాలి. అంటే భోజన పాత్ర (అరటి ఆకు) మీద ఒక వేలుంచి భోజనం చెయ్యాలి. అలా ఒక్కసారి అయినా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టిన పాపానికి ఒడిగట్టి నరకానికిపోతాడు.


భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించకూడదు. పొరపాటున తాకితే ఆ అన్నాన్ని వదలకూడదు. భుజించాలి. ప్రాయశ్చిత్తంగా నూట ఎనిమిదిమార్లు గాయత్రి జపించాలి. భోక్తలు భుజిస్తున్నంత సేపూ తత్కర్త నారాయణస్మరణం చేస్తూనో పురుషసూక్తం పఠిస్తూనో నచికేతత్రయం జపిస్తూనో ఇంకా ఇటువంటివాటితో కాలక్షేపం చెయ్యాలి. భోక్తలు లేచాక పిండప్రధానం చెయ్యాలి. పిండస్థల శుద్ధి జరపాలి. శ్రాద్ధంలో అగ్నౌకరణం బ్రాహ్మణ భోజనం పిండప్రధానం- ఇవి మూడు ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భుజించిన విస్తళ్ళను కదిలించిన తరువాతనే స్వస్తి వాచనం జరపాలి. అలాకాకుండా ముందు జరిపితే అతడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉచ్ఛిష్ట భోజనులు అవుతారు.


Thursday, 28 September 2023

శ్రీదత్త పురాణము (271)

 


సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం వరకు ఒకే తిథి వుంటే దాన్ని అఖండ తిథి అంటారు అలాగాక ఒకటే తిథి మర్నాటికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండ తిథి అంటారు. క్షయాహంతో (తద్దినం నాడు) ఖండ తిథివస్తే అపరాల్లోనికి తిథి ఏ రోజున వుంటుందో ఆనాడే శ్రాద్ధ కర్మ చెయ్యాలి. రెండు అపరాల్లోలకూ అదే క్షయాహతిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలనుబట్టి శ్రాద్ధ కర్మ ఎప్పుడో నిర్ణయించాలి. క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాష్ట్రంలోనూ, వృద్ధి పొందుతున్నట్లయితే పరదినాపరాహ్ణంలోనూ తద్దినం పెట్టాలి. క్షయాహ తిథి పూర్వదినా పరాహ్ణంలో రెండు ముహూర్తాలు వుండి మర్నాడు సాయంకాలం దాకా వుంటే పరదినా పరాహ్ణంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలా మంది నిర్ణయం. కొందరు పూర్వదినాపరాహ్ణంలోనే పెట్టాలంటారుగానీ అది అధిక సంఖ్యాకులకు సమ్మతంగా కనిపించటం లేదు.  


శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒక వేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా విశుద్ధి పొందాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్ళీ వారిని శ్రాద్ధానికి నియంత్రించాలి. వైశ్వేదేవస్థానానికి ఇద్దరు, పితృదేవతల స్థానానికి ముగ్గురు బ్రహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దానికొకరూ దీనికొకరూ నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకి చతురస్యం క్షత్రియులకి త్రికోణాకారం వైశ్యులకి వర్తులం కర్తవ్యం. శూద్రులకి అభ్యుక్షణం అవసరం.


అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరుల్నిగానీ, పుత్రుల్నిగానీ, తనకు తానే గానీ, నియంత్రించుకోవచ్చు. అంతేగానీ వేదవర్జితుడైన విప్రుణ్ని మాత్రం నియంత్రించరాదు. బ్రాహ్మణుల పాదాలు కడిగి వాళ్ళు కూర్చుని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యధావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆపైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు 'అపహతా' అనే మంత్రోచ్ఛారణతో శ్రాద్ధకర్త నువ్వులు విసరాలి.


బియ్యమూ దర్భలతో విశ్వేదేవులకు, నువ్వులు దర్భలతో పితృదేవతలకూ అక్షయ్యాసనార్చనలు చెయ్యాలి. అక్షయ్యాసన సమర్పణలో షష్ఠీ విభక్తినీ, ఆ వాహనలో ద్వితీయావిభక్తినీ, అన్నదానంలో చతుర్థి విభక్తినీ మిగతా సందర్భాల్లో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకు ఉపయోగించాలి.


Wednesday, 27 September 2023

శ్రీదత్త పురాణము (270)


 

శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకి కూడా ఇవే నియమాలు. వాళ్ళు వీటిని పాటించపోతే బ్రహ్మహత్యా మహాపాతకులవుతారు. శ్రోత్రియుడు, విష్ణుతత్పరుడు, స్వాచారనిరతుడు ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్ధ విశారదుడు, త్రిముధుత్రి సుపక్షజ్ఞుడు (ఆపస్తంభశాఖా సూక్తిద్వయం పార్ధం జానాతి యః - అని పద మంజరీటీక. ధర్మశాస్త్రజ్ఞుడు అని తాత్పర్యం) సర్వభూతదయాపరుడు. దేవపూజారతుడు, స్మృతి తత్వ విశారదుడు, వేదాంత తత్వసంపన్నుడు, సర్వలోకహితాకారెడ్డి, కృతజ్ఞుడు, గుణపంపన్నుడు, గురుశుశ్రూషణాపరుడు, పరోపదేశ నిరతుడు, అధ్యాపనతత్పరుడు, అయిన విప్రుణ్ని ఎంచుకొని శ్రాద్ధానికి నియంత్రించుకోవాలి.


శ్రాద్ధవిమంత్రణికి పనికిరాని వారు ఎవరంటే- న్యూనావయవులు, అధికావయవులు, కాయస్థులు (లేఖన జీవులు), రోగగ్రస్తులు, కుష్ఠి, కునఖి, లంబకర్ణుడు, క్షతావ్రతుడు, నక్షత్ర పాఠజీవి, శవదాహకుడు, కువాది పరివేత్త (అన్నగారికంటే ముందు తానై పెళ్ళి చేసుకున్నవాడు), దేవలకుడు, ఖలుడు, నిందకుడు, అమర్షణుడు, ధూర్తుడు, గ్రామ యాజకుడు, అసచ్ఛాస్రాభినిరతుడు, పరాన్నరతుడు, వృషలీపతి, వృషలీపుత్రుడు, కుండుడు, గోళకుడు, ఆయాజ్యి యాజికుడు (అర్హత లేనివారితో క్రతువులు చేయించేవాడు) దంభాచారుడు, వృధాముండుడు, అన్యస్త్రీ ధనతత్పరుడు, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తిదూరుడు, వేద విక్రయి, వ్రతవిక్రయి, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు, శస్త్రోపజీవులు, వేదనిందకులు, దైవనిందకులు, రాజసేవకులు, కృతఘ్నులు, జూదరులు, నిత్యప్రయాణులు, సర్వద్యూతపరాయణులు, మిధ్యాభివాదులు, గ్రామారణ్య ప్రవాహకులు, అతికాముకులు, వాంతకులు, రసవిక్రయులు, కూటసాక్షులు వీరు పనికిరారు. కుతపకాలంలో తద్దినం పెట్టాలి. అది పితృదేవతలకు అక్షయమవుతుంది. పగటి సమయాన్ని పదిహేను భాగాలు చేస్తే అందులో ఎనిమిదో భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికి రవికిరణాల వేడి కొంతమందగిస్తుంది.


సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపరాహ్ణమే కనుక ఆ సమయంలోనే వారికి పిండ ప్రదానాదికం చెయ్యాలి. అకాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు. రాక్షసులు దాన్ని కాజేస్తారు. కనుక దాన్ని రాక్షస కవ్యప్రధానం అంటారు. అంచేత కుతపకాలానికి బాగా ముందేగానీ సాయంకాలంగానీ ఇచ్చే కవ్యం రాక్షసమవుతుంది. తత్కర్త తద్భోక్త నరకానికి పోతారు.  


Tuesday, 26 September 2023

శ్రీదత్త పురాణము (269)

 


ఉపనిషత్తులను పఠిస్తూ వేదాంతార్థాలను యోచన చెయ్యాలి. జితేంద్రియుడై సుగతి తత్పరుడై ఎల్లవేళలా సహస్రశీర్షుడైన ఆ పరమాత్మను ధ్యానించాలి. అప్పుడే కోరుకున్న ముక్తిని పొందగల్గుతాడు. ధర్మకీర్తి! బ్రహ్మచర్యం మొదలుకొని సన్యాసం వరకు ఒక్కొక్క ఆశ్రమాన్నీ గడుస్తూ వచ్చిన ద్విజుడు దుఃఖరహితుడై పునర్జన్మలేని ముక్తి పొందుతాడు.


కుమారా! దత్తాత్రేయుడు క్రిందటి జన్మలో నీకు చాలా రహస్యాలు బోధించాడు. ధన్యుడవయ్యావు. వాటిని నాకు వివరించినన్నూ ధన్యుణ్ని చేసావు. సంతోషం ఇంకా ఏమైనా చెప్పేవి వుంటే అవి కూడా నాకు వివరించు- అని తండ్రి గాలవుడు కోరాడు. అప్పుడు తనయుడైన భద్రశీలుడు గత జన్మలో ధర్మకీర్తిగా తానున్నప్పుడు దత్తదేవుడు తెలియపరచిన శ్రాద్ధ విధులను కూడా తండ్రికి వినిపించాడు. సనత్కుమారా! వాటిని సైతం ఆలకించు అని నారదుడు ఇలా కొనసాగించాడు.


శౌనకాది మునులారా! దీపక వేదధర్మ సంభాషణగా సాగుతున్న కలి-బ్రహ్మ సంవాదం వింటున్నారుగా స్రాద్ధ విధులు ఆలకించండి అని సూతుడు అందుకున్నాడు.


శ్రాద్ధ విధులు


శ్రాద్ధ కర్త క్షయావహానికి (తద్దినానికి) ముందు రోజు రాత్రి భోజనం చెయ్యకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మర్నాటి శ్రాద్ధకర్మకు అవసరమైన బ్రాహ్మణుల్ని ఆ రోజే నియంత్రించుకోవాలి. ఆ రాత్రికి నేల మీదనే పరుండాలి. తద్దినం నాడు తత్కర్తలు దంతధావన - తాంబూల - తైలాభ్యంగ స్నాన - రతి - ఔషధీ పరాన్న భోజనాలను వర్జించాలి.


Monday, 25 September 2023

శ్రీదత్త పురాణము (268)

 


శంఖ చక్ర గదాపాణియైన నారాయణున్ని నిత్యమూ ధ్యానిస్తూ వుండాలి. చంద్రాయణా దికవ్రతాలు ఆచరించాలి. శీతావాదుల్ని ఓర్చుకోవాలి. అగ్నికార్యం విడువరాదు.


వానప్రస్థం సాగిస్తుండగా అన్ని వస్తువుల మీదా ఒక్కొక్కటిగా మనస్సులో వైరాగ్యం పుట్టుకవస్తుంది. తనంత తాను అది ఏర్పడినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలాకాకుండా (ఏదో కారణంగా హఠాత్తుగా సన్యాసం స్వీకరించినందువల్ల లేదా) మరోలా స్వీకరించిన సన్యాసం వల్ల మనిషి కడపటికి పతితుడూ భ్రష్టుడూ అవుతాడు.


సన్యాసి ఎప్పుడూ- వేదాంతాభ్యాస నిరతుడై శాంతుడై దాంతుడై జితేంద్రియుడై నిర్ద్వంద్యుడై నిరహంకారుడై నిర్మముడై కాలం గడపాలి. కామక్రోధాదుల్ని వదిలించుకున్నవాడై శమ దమాదిగుణాలకు ఆటపట్టుగా ఉండాలి. (ఇంచుమించు) నగ్నంగా కానీ చిరిగిపోయిన పాతగుడ్డ గోచీతోగానీ కాలక్షేపం చెయ్యాలి. శత్రుమిత్రుల పట్లా మానవమానాల పట్ల సమబుద్ధితో వుండాలి. గ్రామాల్లో అయితే ఏకరాత్రం. పట్టణాల్లో అయితే మూడురాత్రులూ నివసించవచ్చు. నిత్యమూ ఒక ఇంటిలో భిక్ష చెయ్యకూడదు. భిక్షాటనతో నాలుగు మెతుకులు సంపాదించుకోవటం ఉత్తమం. వివాదరహితులైన వివ్రుల ఇళ్ళల్లోనే బిక్షాటన చెయ్యాలి. నిత్యం త్రిషవణ స్నానాలు చేస్తూ నారాయణ ధ్యానపరాయణుడై ప్రణవాన్ని జపిస్తూ ప్రణవసహితంగా నారాయణమ్మరణ) విజితేంద్రియుడై వియతాత్ముడై జీవితం గడపాలి, ఒకే ఇంటనిత్యమూ భుజిస్తే లేదా ఒకే రకం ఆహారాన్ని రోజూ తీసుకుంటే యతిశ్వరుడు సైతం ఒక్కొక్కప్పుడు రాగలంపటుడవుతావు. నూరుప్రాయచ్ఛిత్తాలు చేసుకున్నా అటువంటి వాడికి నిష్కృతిలేదు.


సన్యాసి తన ఆశ్రమ చిహ్నాలను కావాలని ఏనాడూ కప్పిపుచ్చుకోకూడదు. అలా చేసినవానికి ప్రాయచ్ఛిత్తమే లేదు.


ఆత్మవిచారంతో నారాయణ నామస్మరణతో నిర్ద్వంద్వ నిర్మలశాంత మాయాతీత అమత్సర అన్యయ పరిపూర్ణ సదా ఆనందైక విగ్రహ జ్ఞానస్వరూప అమలసనాతన అవికార అనాద్యంత జగచైతన్యకారణ నిర్గుణ పరంజ్యోతిర్మయ నామధేయాలతో విరాజిల్లే ఆ పరాత్పరుణ్ని ఆ పరమాత్మను ధ్యానిస్తూ సన్యాసి కాలం గడపాలి.


Sunday, 24 September 2023

శ్రీదత్త పురాణము (267)

 


పంచ యజ్ఞ పరిత్యాజీ బ్రహ్మహా - అన్నారు పెద్దలు. కనుక ఏ మారక రోజూ పంచయజ్ఞాలు చెయ్యాలి. దేవ-భూత- పితృ-మనుష్య-బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలు అంటారు.


ఈ పంచయజ్ఞాలు నిర్వహించి అప్పుడు అతిథి మిత్రాదులతో కలసి శుచిగా రుచిగా మౌనంగా కూర్చుని భుజించాలి. పాత్రుడైన విప్రుణ్ని ఎప్పుడూ వదలిపెట్టకూడదు. అతనితో కలసి సహపంక్తిని భోజనం చెయ్యాలి. సగం వస్త్రం ధరించి కాళ్ళుపీట మీద పెట్టుకొని గొంతు కూర్చుని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చెయ్యటం అంటే - సురాపానం సేవించటంతో సమానం.


కుడుములూ ఫలాలు మొదలైన వాటిని సగం తిని మళ్ళీ వాటినే తినటం అంటే - కొరుక్కుతినటం చాలా తప్పు. ముక్కలుగా విరుచుకొనో లేదా తరుక్కునో తినాలి. అలాగే సరాసరి ఉప్పుని తినకూడదు. ఈ రెండు పనులూ చేస్తే గోమాంసం తిన్నపాపం చుట్టుకుంటుంది. అలాగే నీటిని ఆచమనం చేసేటప్పుడు ఆపోశనం చేస్తున్నప్పుడూ (జుర్రుమన్న) శబ్దం చెయ్యకూడదు. చేసినవాడు నరకానికి పోతాడు.


అన్నాన్ని ఎన్నడూ దూషించకూడదు. రుచులు మెచ్చుకుంటూ హితవైనది మితంగా భుజించాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భుజించటం ఉత్తమం. భోజనాలయ్యాక శాస్త్ర చింతనలతో చర్చలతో అధ్యయనాలతో పగలు గడచిపోవాలి. రాత్రి కూడా ఇదే మాదిరి అతిథిని యధాశక్తిగా శయనాసన భోజనాదులతోనో కందమూల ఫలాదులతోనో గౌరవించాలి. గృహస్థుడు ఇలా సదాచారాలు పాటిస్తూ తాను తరించాలి. తన వారిని తరింపజేయాలి. ఎప్పుడైనా సదాచారం తప్పితే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.


వానప్రస్థం - సన్యాసం


తలనెరసి తనువు అలసి వృద్ధుడైన గృహస్థు తన భార్యను పుత్రుల దగ్గరుంచి లేదా వెంట తీసుకొనిగానీ అరణ్యానికి వెళ్ళాలి. ఒక పర్ణశాల ఏర్పరచుకొని కాలక్షేపం చెయ్యాలి. దీన్నే వానప్రస్థం అంటారు. మూడుపూటలా స్నానం చేస్తూ నఖ-శ్మశ్రు జటాధారియై గంధ పుష్పాలకు దూరమై బ్రహ్మచర్యం పాటిస్తూ పంచయజ్ఞలు చేస్తూ నేలమీద పరుండుతూ తపస్సు చేసుకోవాలి. పగటి పూట కేవలం ఎనమిది ముద్దలు భుజించాలి. రాత్రివేళ భోజనం చెయ్యరాదు. వన్యతైలంతో అభ్యంగస్నానాలు నిర్వర్తించుకోవాలి.


Saturday, 23 September 2023

శ్రీదత్త పురాణము (266)

 


స్త్రీలకూ ఉపవీతులకూ గంధలేపక్షయావధిగా ఈ శౌదం చెప్పబడింది. మిగతా వ్రతులందరికి యువతులకు మల్లేనే విధవలకు సైతం ఇదే శౌచం. ఇలా శౌచవిధి పూర్తి చేసుకుని తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ ముమ్మారు కూర్చుని ఆచమనం చేయాలి. దుర్గంధమూ నురుగూ లేని నీళ్ళు మాత్రమే ఉపయోగించాలి. రెండుసార్లు చెక్కిళ్ళు పెదవులూ తడిచేత్తో తుడుచుకోవాలి. తర్జన్యంగుష్టాలతో నాసికనూ అంగుష్టానామికాలతో కళ్ళనీ కనిష్టాంగుష్టాలతో నాభిని అరచేత్తో గుండెనీ అంగుష్టాగ్రాలతో శరస్సుని అంగుళీకాగ్రంతో భుజాలనూ స్పృశించాలి. అటుపైన స్నాన-మార్జన-జలతర్పణాలు ఆచరించాలి. ఆ పైది సంధ్యోపాసన. సూర్యుడికి ఆర్ఘ్యప్రధానం. ప్రాతఃసంద్యలో నిలబడి సూర్యదర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. సాయంసంధ్యలో కూర్చుని నక్షత్ర దర్శనమయ్యేదాకా గాయత్రిని జపించాలి.


మధ్యాహ్నం కూడా సంధ్యోపాసన చేసి ఆర్ఘ్యం విడిచిపెట్టాలి. కూర్చుని కానీ నిల్చునికానీ గాయత్రిని జపించాలి. ప్రాతర్మధ్యాహ్నాలలో గృహస్థు స్నానం చెయ్యాలి. దర్భలు చేతబట్టి బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది కలిగి లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మల్ని సకాలంలో చెయ్యలేకపోతే రాత్రి తొలిజాములో ఆరంభించి యధాక్రమంగా అన్నీ చేసుకోవాలి. ఏ ఇబ్బందీలేకపోయినా సంధ్యవార్చని విప్రుడు పాషండుడుగా పరిగణింపబడతాడు. వాడు సర్వధర్మ బహిష్కృతుడు. కూట యుక్తి విశారదుడై సంధ్యాది సత్కర్మాచరణాన్ని పరిత్యజించినవాడు మహాపాతకుల్లో కెల్లా మహాపాతకి. నేను సంద్యాది సత్కర్మల్ని విడిచిపెట్టానోచ్- అని ప్రకటించుకొనే ద్విజుడు ఆ చంద్రతారకంగా ఘోరనరకాలు అనుభవిస్తాడు.


సంధ్యోపాసన అయ్యాక దేవతార్చనం వైశ్వదేవం యధావిధిగా చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చిన అతిథుల్ని మధుర వాక్కులతో ఆహ్వానించి కందమూలఫలగృహాన్న దానాలతో సంతృప్తిపరచాలి. వట్టి చేతులతో తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మన ఇంటవదలి మన పుణ్యాలను పట్టుకపోతున్నాడని అర్ధం చేసుకో.


అతడి గోత్ర నామాలు ఏమిటో మనకు తెలియవు. పొరుగూరు నుండి వచ్చాడు. అటువంటివాణ్ని పండితులు అతిథి అన్నారు. విష్ణువులా భావించి అతడ్ని పూజించమన్నారు. స్వగ్రామవాసి, విష్ణుభక్తుడు శ్రోత్రియుడు- దిక్కులేని వాడు- ఇటువంటి విప్రుణ్ని నిత్యమూ అర్చించి అన్నోదకాలతో సంతృప్తిపరిస్తే దేవతలు అనుగ్రహిస్తారు. పితృదేవతలు తరిస్తారు.


Friday, 22 September 2023

శ్రీదత్త పురాణము (265)

 

శౌచసదాచారాలు


ధర్మకీర్తీ! సద్ర్బాహ్మణుడు నిద్రలేచింది మొదలు ఏయే శౌచసదాచారాలు పాటించాలో వివరిస్తాను తెలుసుకో. బ్రాహ్మీముహూర్తంలో వామనస్తుతిపరత్వంగా నిద్రలేవాలి. పురుషార్ధాలకు అవిరుద్ధంగా వుండే ప్రవృత్తుల గురించి యోచన చెయ్యాలి. జుట్టు (శిఖ) ముడివేసుకోవాలి. ఉత్తరీయాన్ని శిరస్సున కప్పుకోవాలి. యజ్ఞోపవీతాన్ని కుడిచెవికి తగిలించుకోవాలి. ఒక కర్రను జలపాత్రనూ పట్టుకోవాలి. బహిఃప్రదేశానికి వెళ్ళాలి. నేల కనబడకుండా గడ్డి పరవాలి. పగటివేళ కానీ ఉభయ సంధ్యల్లో కానీ ఉత్తరముఖంగా కూర్చోవాలి. రాత్రిళ్ళు అయితే దక్షిణముఖంగా కూర్చోవాలి. మౌనంగా మలమూత్ర విసర్జన చేయాలి. బాటలో, గోష్ఠంలో, నది ఒడ్డున, నూతికి దగ్గరలో, చెరువుల చెంత, నీళ్ళల్లో, చెట్లనీడన, అడవిలో, అగ్ని చేరువలో, దేవాలయాల దగ్గర, ఉద్యానవనాల్లో, దున్నిన పొలంలో, నాలుగుదారుల కూడలిలో, గురు, గో, బ్రాహ్మణ, స్త్రీ సన్నిధిలో ఊక-పొట్టు నిండిన స్థలాల్లో కపాలాల్లో ఇంకా ఇటువంటి చోట్ల మలమూత్ర విసర్జనలు చేయరాదు.


బ్రాహ్మణుడు ప్రయత్నపూర్వకంగా శౌచం పాటించాలి. శౌచ మూలాః ద్విజాంః అన్నారు. ఇది లేకపోయాక ఎంతటి సత్కర్మలన్నా వ్యర్ధం.


ఈ శౌచం-బాహ్యము, ఆభ్యంతరము అని రెండు విధాలు, మట్టితో, నీటితో చేసుకొనేది బహిశ్శుద్ధి, భావశుద్ధినే ఆభ్యంతర శౌచము అంటారు.


మలమూత్ర విసర్జనలు అయ్యాక మర్మాంగం చేతబట్టుకొని లేచి మరొకచోట కూర్చుని మృత్రిక(మట్టి)తో నీటితో దుర్గంధం వదిలే వరకు ప్రక్షాళన చేసుకోవాలి. శౌచానికి ఉపయోగించే మట్టిని అనుచ్ఛిష్ట ప్రదేశాల నుంచే తీసుకోవాలి. ఎలుకలు త్రవ్విందో, నాగటితో లేచిందో, వాపీకూపతటాకాదులకు సంబంధించిందో కాకూడదు ఈ బాహ్యమృత్తిక. నీటిలో నుండి తీసుకొన్న తడిమట్టి శ్రేష్టం. మర్మంగానికి ఒకసారి అపానంలో అయిదుసార్లు కుడిచేతికి ఏడుమార్లు ఎడమచేతికి పదిమార్లు పాదాలకు మూడేసి సార్లు మట్టిపులుముకొని ప్రక్షాళన చేసుకోవాలి. ఈ శౌచం గృహస్థులకు రెట్టింపు, బ్రహ్మచారులకు మూడు రెట్లు వానప్రస్థులకు, సన్యాసులకు నాలుగు రెట్లు - అధికం. స్వగ్రామంలో అయితే పూర్ణశౌచం పాటించాలి. మార్గమధ్యంలో అర్థశాస్త్రం పాటిస్తే చాలు, రోగాతురుడైనప్పుడుగానీ ఆపత్కాలంలోగాని ఈ శౌచనియమం లేదు.


Thursday, 21 September 2023

శ్రీదత్త పురాణము (264)

 

చేటలగాలి ప్రేతధూమం శూద్రాన్నం వృషలీపతితో స్నేహం - ఇవ్వి ఎంతమాత్రం పనికిరావు. తలంటుపోసుకున్నాక మిగిలిన నూనెను ఒంటికి పులుముకోకూడదు. (శిరోభ్యంగా వశిష్టేన నాంగం న వేపమేత్). అశుచిగా ఉండి తాంబూలం వెయ్యరాదు. నిద్రించేవాణ్ని అనవసరంగా లేపకూడదు. అపరిశుద్ధుడై అగ్నికార్యంగానీ మజ్జిగగానీ కుడిచెయ్యి స్పర్శ లేకుండా ఒక్క ఎడమ చేతితోనే తాగరాదు. గురువుగారి నీడనూ ఆజ్ఞనూ అతిక్రమించకూడదు. (నచాక్రమేత్ గురో: చాయాం తదాజ్ఞాం చ మునీశ్వరాః), యోగి-విప్ర-యతి-వ్రతులను నిందించకూడదు. బ్రాహ్మణులు ఒకరి మర్మాలను మరొకరు చెప్పుకోకూడదు. ఎవరికీ చెప్పకూడదు. (పరస్పర మర్మాణి కదాచిన్న పదేత్ ద్విజాః), దర్శ పౌర్ణ మాసయాగాలను యథావిధిగా చెయ్యాలి. సాయంప్రాతరౌపాసాలను మానకూడదు. ఔపాసన మానితే సురాపానం చేసిన దోషం అంటుకుంటుంది. రెండు అయనాలతో విషువత్పుణ్య సమయాల్లో నాలుగు యుగాదుల్లో, మన్వాదుల్లో, అష్టకాల్లో, దర్శంతో ప్రేతపక్షంలో (మహాలయం) తిదినాడూ కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు శ్రోత్రియుడు అతిథిగా వచ్చినప్పుడూ సూర్యచంద్రగ్రహణ సమయాల్లో పుణ్యక్షేత్రాల్లో తీర్థాల్లో తప్పకుండా పితృదేవతలకు శ్రాద్ధవిధులు ఆచరించాలి. ఊర్ద్వ పుండ్రాలు ధరించకుండా చేసిన యజ్ఞం, దానం, తపస్సు, హోమం, స్వాధ్యాయం, పితృతర్పణం వృధా అవుతుందని కొందరి అభిప్రాయం. మరికొందరు ఊర్ధ్వపుండ్రానీ తులసినీ శ్రాద్ధ విధుల్లో అంగీకరించకూడదు. కాబట్టి శ్రేయోభిలాషులు వృద్ధాచారం ఏమిటో తెలుసుకొని దాన్ని పాటించటం మంచిది. స్మృతులు చెబుతున్న ఇలాంటి సదాచారాలను అందరూ తప్పకుండా పాటించాలి. సదాచారపరులను విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. విష్ణువే ప్రసమ్ముడైతే అసాధ్యమేముందిక


శౌనకాదిమునులారా! దత్తాత్రేయుడు ధర్మకీర్తికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలను భద్రశీలుడు (కిందటి జన్మలో ధర్మకీర్తి) తన తండ్రి గాలవుడికి చెబుతున్నట్టుగా నారదుడు సనత్కుమారుడికి ఉపదేశించగా వాటిని వేదధర్ముడు తన శిష్యుడు దీపకుడికి వివరిస్తున్నాడు. మొత్తం ఇదంతా బ్రహ్మదేవుడు కలిపురుషుడి సందేహాలను తీరుస్తున్న ఘట్టం. దత్తదేవుడి ఆజ్ఞతో నేను మీరు చెబుతున్నాను. స్వామివారు ధర్మకీర్తికి చెప్పిన శౌచసదాచారాలు మరికొన్ని ఉన్నాయి. ఆలకించండి.


Wednesday, 20 September 2023

శ్రీదత్త పురాణము (263)

 


విద్యావంతుడు బుద్ధిమంతుడు ఆచారపరుడు అయిన వరుణ్ని పిలిచి కన్యాదాత నూతన వస్త్రాదుల్ని అలంకరించి పూజించి పిల్లనిచ్చి పెళ్ళిచేస్తే అది బ్రాహ్మవివాహం. జ్యోతిష్టోమాది యజ్ఞాలను యధావిధిగా చేయించిన ఋత్విక్కుకి కన్యాదానం చేస్తే అది దైవవివాహం. ధర్మార్థంగా వరుడి నుంచి రెండు గోవుల్ని పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్ళిచేస్తే అది అర్హవివాహం. మీరిద్దరూ కలిసి గృహస్థ ధర్మాలు నిర్వహించండి అని ఒడబరిచి వధూవరులకు వివాహం జరిపిస్తే అది ప్రాజాపత్య వివాహం. ధనం ఇచ్చి కన్యను (కొనుక్కుని) వివాహమాడితే అది అసురం, వధూవరులు తమంతతాముగా చేసుకొనే వివాహం - గాంధర్వ వివాహం. బలాత్కారంగా కన్యను అపహరించి తీసుకుపోయి వివాహమాడితే అది రాక్షస వివాహం. నిద్రపోతున్న కన్యనో మధ్యపాన వివశగా ఉన్నదానినో కేవల సంభోగేచ్ఛతో స్వాధీనం చేసుకోవడం పైశాచ వివాహం. ఇది అన్నింటిలోకీ అధమాధమ పద్ధతి అని మహర్షులు నిరసించారు.  

గృహస్థాచారం


గృహస్థు కనీసం రెండు యజ్ఞోపవీతాలు ధరించాలి. ఉత్తరీయం వదలకూడదు. సువర్ణకుండలాలు ధౌత వస్త్రద్వయం ధరించాలి. పరిమళద్రవ్యాల అనులేపనం పుష్పమాలికల ధారణ ఉండాలి. కేశాలనూ నఖాలనూ అందంగా కత్తిరించుకుని శుచిగా ఉండాలి. వేణుదండం ఉదకంతో కూడిన కమండలువు, తలపాగా గొడుగు పాదుకలు చెప్పులు ఉపయోగించాలి. అలంకరించుకుని ప్రియదర్శనుడుగా ఉండాలి. నిత్యం స్వాధ్యాయం అధ్యాపనం ఏమరకూడదు. స్వాచారం విడువకూడదు. పరాన్నం భుజించకూడదు. పరివాదాలకు దిగకూడదు. పాదం మీద పాదం వేసి తోముకోకూడదు. ఉచ్చిష్టాన్ని దాటకూడదు. ఒకేసారి రెండు చేతులతోనూ బుర్రబరుక్కోకూడదు. దేవాలయాల్లోకి అపసవ్యంగా ప్రవేశింపకూడదు. దేవతార్చన ఆచమనం స్నానం వ్రతం శ్రాద్ధంలాంటి కర్మల్ని ఆచరిస్తునప్పుడు ముక్తకేశడూ ఏకవస్త్రధారీకాకూడదు. దుష్ప్రయానాలను అధిరోహించకూడదు. శుష్క వాదాలు చెయ్యకూడదు. పరకాంతలను స్పృశించరాదు. ఆశించరాదు. పొందరాదు. పిసినారితనం పనికిరాదు. కొండేలు చెప్పే బుద్ధి ఉండకూడదు. చతుష్పథంలో విప్రులకూ రావిచెట్టులకూ అపసవ్యంగా వెళ్ళకూడదు. అసూయనూ పగటి నిద్రనూ వదిలెయ్యాలి. ఇతరుల పాపాలను ప్రస్తావిచండంగానీ సొంతపుణ్యకార్యాలను ప్రశంసించడంగానీ చెయ్యకూడదు. తన ఆయుర్ధాయాన్నీ నక్షత్రాన్నీ మానాన్నీ గోప్యంగా ఉంచుకోవాలి. దుర్జనులతో జతకట్టకూడదు. అశాస్త్రం వినకూడదు. ఆసవ ద్యూత - గీతాదుల పట్ల ఆసక్తిని చంపుకోవాలి. రక్తంతో తడిగా ఉన్న ఎముకనూ, మద్యాన్ని, ఉచ్చిష్టాన్ని, పతితుడైన మనిషినీ, సర్పాన్ని, వైద్యుణ్ణి తాకినట్టయితే సచేలస్నానం చెయ్యాలి. చితినీ చితకాష్టాన్నీ (బలిపశువుని కట్టిన) యూప స్తంభాన్నీ చండాలుణ్నీ దేవలుణ్ని తాకితే సచేలస్నానం చెయ్యాలి. దీపపు నీడ, మంచంమీద, కేశవస్త్ర నఖోదకం, అజం మార్జాలం రేణువు - ఇవి మన పూర్వసంచిత పుణ్యాలను నశింపచేస్తాయి.


Tuesday, 19 September 2023

శ్రీదత్త పురాణము (262)

 




వివాహ సంస్కారం


గురుకులంలో ఉండి గురు శుశ్రూష చేస్తూ బ్రహ్మచర్య దీక్షతో వేదాధ్యయనం ముగించుకున్నాక గురువుల అనుమతితో అగ్ని పరిగ్రహం చెయ్యాలి. అటుపైని వేదాంగాలైనా శాస్త్రాలనూ, ధర్మశాస్త్రాలనూ అధ్యయనం చెయ్యాలి. ఆటుపైన పుష్కలంగా గురుదక్షిణ చెల్లించి ఆశీరనుమతులు స్వీకరించి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. రూపలక్షణ సంపన్న సుగుణ సత్కులోధ్భవ సుశీల ధర్మచారిణి అయిన కన్యను వివాహం చేసుకోవాలి. తల్లి వైపు మంచి అయితే అయిదుతరాలూ తండ్రివైపు నుంచి అయితే ఏడుతరాలు దాటితే ఆయా వంశాల్లో నుంచి కన్యను వివాహం చేసుకోవచ్చు. లేకపోతే గురుభార్య సంగమం దోషం చుట్టుకుంటుంది. రోగిణి వృత్తాక్షి సరోగకుల సంభవ అతికేశ - అకేశ - వాచాల - కాయస్థ - వామన - దీర్ఘదేహ - విరూపిణి- న్యూనాధికాంగి - ఉన్మత్త - పిశున - వృధాహాస్యముఖి - కృశించినది - స్థూల దంతిక - కనుబొమ్మలు కలిసిపోయినది (లగ్నభ్రువు) కృష్ణముఖి స్థూలశరీరిణి ఉష్ణశరీరిణి ఘర్ఘర నాదిని అతికృష్ణ రక్తపర్ణ ధూర్తురాలు - స్థూల గుల్ప - దీర్ఘ జంఘ పురుషాకృతి కలది - శ్శశ్రుముఖి (మీసాలున్నది) - సదారోదన శీల - పాండువర్ణ - కుత్సిత - కాసశ్వాసాది సంయుక్త నిద్రాశీల - అన్యధా భాషిణి - లోకద్వేష పరాయణ పరాపవాదనిరత - తస్కర - దీర్ఘనాసిక - కితవ (జూదరి) - అతిరోమశ గర్విత కు (టెల) వృత్తి ఇటువంటి కన్యలని (సుఖంగా సంసారం చేసుకోవాలన్నప్పుడు) వివాహమాడకూడదు. చిన్నప్పుడు గుణం తెలియక వివాహం చేసుకున్నా పెద్దయ్యాక ఆవిడలో దుర్గుణాలూ విపరీత బుద్దులూ కనిపిస్తే వదిలిపెట్టేయ్యాలి, భర్తపట్ల, సంతానం పట్లా ఎప్పుడూ నిష్టురంగా ఉంటూ పరులకు అనుకూలంగా ప్రవర్తించే ఇల్లాలిని విడిచిపెట్టెయ్యాలి.


నాయనా, ధర్మకీర్తి ! ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి. వీటిలో పూర్వపరం ఉత్తమోత్తమాలు మొదటిది కుదరకపోతే రెండోది, రెండోదీ కాకపోతే అలా ఈ విధానాలకు చెల్లుబాటు. బ్రాహ్మం, దైవం, అర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచమని ఎనిమిది వివాహ పద్ధతుల్ని చెప్పారు మన మహర్షులు.


వీటిలో బ్రాహ్మణులు బ్రాహ్మపధ్ధతి వివాహమే చేసుకోవాలి. దైవమైనా ఫర్వాలేదు. అర్షం కూడా అంగీకార్యమేనని చాలామంది అభిప్రాయం. తక్కిన ప్రాజాపత్యాది పద్ధతులైదూ విప్రులకు పనికిరావు. మొదటి ఉత్తమ పద్ధతులు కుదరనప్పుడు అగతికంగా అనంతర పద్ధతులకి దిగవచ్చు, కానీ అది దిగజారడమే (అభావేషుతు పూర్వేషు కుర్యాదేవ అవరాన్ బుదః)


Monday, 18 September 2023

శ్రీదత్త పురాణము (261)

 


కృతయుగం ప్రారంభమైన కార్తిక శుద్ధనవమి, త్రేతాయుగారంభం వైశాఖ శుక్ల తృతీయ, ద్వాపరారంభం మాఘపూర్ణిమ, కలియుగాది భాద్రపద బహుళ త్రయోదశి - ఇవ్వి అనధ్యయనాలు, ఇలాగే స్వాయంభువమన్వాది దివసాలు కూడా అనధ్యయనాలు. అవి ఏవి అంటే- కార్తిక శుద్ధ ద్వాదశి (స్వాయంభువ మనువు), ఆశ్వయుజ శుద్ధ నవమి (స్వారోచిష మనువు), చైత్ర శుద్ధ తృతీయ (ఉత్తమ మనువు), భాద్రపద శుద్ధ తృతీయ (తామసమనువు), పుష్యశుద్ధ ఏకాదశి (రైవత మనువు), ఆషాఢ శుద్ధ దశమి ( చాక్షుశమనువు), మాఘశుద్ధ సప్తమి (వైవస్వత మనువు), మాఘమావాస్య (సూర్యసావర్ణ మనువు), కార్తిక కృష్ణాష్టమి (ఇంద్రసావర్ణి), ఫాల్గుణామావాస్య (బ్రహ్మసావర్ణి), శ్రావణామావాస్య (అగ్నిసావర్ణి), ఆషాఢ పూర్ణిమ (రుద్రసావర్ణి), చైత్ర పూర్ణిమ (రౌచ్యమనువు), జ్యేష్ట పూర్ణిను (భౌచ్యమనువు) ఈ తిథులు అనధ్యయనాలు. ఈ యుగాదుల్లో మన్నాదుల్లో విప్రులు శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. ఇవికాక ఇంకా కొన్ని అనధ్యయ దివసాలు ఉన్నాయి. శ్రాద్ధ భోక్తగా నియంత్రితుడైనప్పుడు, సూర్యచంద్ర గ్రహణాల్లోనూ ఉత్తరాయన దక్షిణాయన దివసాల్లోనూ శవయాత్రలో పాల్గొన్న రోజున, జాతాశావంగానీ మృతాశౌచంగానీ వచ్చిన రోజుల్లోనూ, సర్పాదులు కనిపించిన రోజున, భూకంపం వచ్చినప్పుడు - వేదాధ్యయనం చెయ్యకూడదు. అనధ్యయన దివసాల్లో అధ్యయనం చేస్తే అతడి ప్రజ్ఞనూ యశస్సునూ సంపదనూ ఆయుష్షునూ బలాన్ని ఆరోగ్యాన్ని అన్నింటినీ యముడు స్వయంగా కత్తిరిస్తాడు. పైగా బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది. అటువంటివాణ్ని అందరూ వెలివెయ్యాలి, పలకరించకూడదు.


కుండగోళకులకి జడులకీ వారి సంతతికి ఉపనయనం జరిపించవచ్చునని కొందరి మతం, సరే. ఉపనయనం అయ్యాక వేదాధ్యయనమునకు ఉపక్రమించాలి. వేదం చెప్పుకోకుండా ఏ శాస్త్రాలు చదివినా వ్యర్ధమనీ నరకపాత హేతువనీ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అతడి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వేదాన్ని అభ్యసించని విప్రుల సర్వకర్మలూ వ్యర్ధాలే. వేదము అంటే శబ్దబ్రహ్మమయుడైన విష్ణు స్వరూపం. అందుకని విప్రుడు వేదాధ్యయనం చేసి తీరాలి. వేదాధ్యాయికి సకలాభీష్టాలు తమంతతాముగా సిద్ధిస్తాయి.


Sunday, 17 September 2023

శ్రీదత్త పురాణము (260)

 


అనధ్యయనాలు


కాళ్ళు కడుక్కుని ఆచమించి వచ్చి గురువు గారి పాదాలు స్పృశించి నమస్కరించి అభిముఖంగా కూర్చుని వేదశాస్త్రాధ్యయనం సాగించాలి.


వేదాధ్యయనం చెయ్యకూడని రోజుల్ని అనధ్యయనాలంటారు. మార్గశీర్షం బహుళ సప్తమి, పుష్యమాసం బహుళాష్టమి, మాఘమాసం బహుళనవమి, ఫాల్గుణం బహుళ దశమి, భాద్రపదం బహుళైకాదశి - వీటిని అష్టకాలంటారు. ఈ తిధుల్లో వేదాధ్యయనం చెయ్యకూడదు. ప్రతినెలా అష్టమి చతుర్దశి పూర్ణిమ అమావాస్యలూ మకర కర్కాటక రవి సంక్రాంతులూ - వీటిని పంచపర్వాలంటారు. ఇవి కూడా అనధ్యయన దివసాలే. ఇంకా ఇలాగే ప్రతీపాడ్యమి, భాద్రపద కృష్ణపక్షంలో మహాభరణి (ఆషాడం), ఉత్థాన ద్వాదశీ (కార్తికం), ఆషాడ - కార్తిక - ఫాల్గుణాల్లో శుక్ల పక్ష ద్వితీయులు, మాఘశుద్ధ సప్తమి, అశ్వయుజ శుద్ధ నవమి - ఈ తిథులు వేదాధ్యయనానికి అనర్థాలు. అంటే అనధ్యయన దివసాలు. శ్రోత్రియ మరణం గ్రామ దహనం సూర్యమండలానికి (పరివేషం) గుడిచుట్టిన రోజు ఎవరైనా శ్రోత్రియుడు అతిధిగా ఆశ్రమానికి వచ్చిన రోజు (దీన్నే శిష్టానధ్యయనం అంటారు).


కలహం జరిగిన రోజు బ్రాహ్మణుడు వధింపబడ్డ రోజు సంధ్యాసమయంలో మేఘం గర్జించిన రోజు అకాల వర్షం పడిన రోజున - ఉల్కా అశనిపాతాలు జరిగినప్పుడు - విప్రుడు అవమానింపబడిన వేళ - సంధ్యావందన సమయాలు - ఇవి కూడా అనధ్యయనాలు.


Saturday, 16 September 2023

శ్రీదత్త పురాణము (259)

 


నమస్కారవిధి


జ్ఞాన తపో వయో వృద్ధులకు బ్రహ్మచారి అభివాదన శీలియై ఉండాలి. వేదశాస్త్రాదుల్ని ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించే గురువుకు ముందుగా నమస్కరించాలి. బ్రాహ్మణుడు తన పేరుకి చివర శర్మపదం తగిలించి గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి. క్షత్రియాదులకి ఎప్పుడూ నమస్కరించకూడదు. నాస్తికుడికీ భిన్నమర్యాదుడికీ (బహుశ మతాంతరుడు) కృతఘ్నుడికి గ్రామయాజకుడికీ చోరుడికీ జూదగాడికి (కితపుడు) ఉన్మత్తుడికీ, శర-ధూర్త-పాషండులకీ, అశుచికీ నమస్కరించకూడదు. అభ్యంగనస్నానం చేస్తున్న వాడికీ, జపం చేస్తున్నవాడికీ, నక్షత్రజీవికీ, పరుగెత్తుతున్నవాడికీ, పాపాత్ముడికీ, స్నానం చెయ్యని వాడికీ, సమత్కు శాదులు సేకరిస్తున్నవాడికీ, దండలు గుచ్చుతున్నవాడికి, నీళ్ళకుండ మోసి తెస్తున్నవాడికి, భోజనం చేస్తున్న వాడికి, వివాదశీలికి, దిగంబరుడికీ, వాంతి చేసుకుంటున్న వాడికీ, నీళ్ళమధ్యలో ఉన్నవాడికీ, భిక్షాన్నధారికీ, విద్రిస్తున్న వ్యక్తికీ నమస్కరించకూడదు. భర్తను - చంపిన దానికి, పుష్పవతికీ, జారిణికీ, బాలింతకు, గర్భపాతినికి, కృతఘ్నికీ, చండిక్కీ (కోపిష్ఠి) - నమస్కరించకూడదు. సభలో యజ్ఞశాలలో దేవాలయంలో ఎవరు ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేస్తే చేసినవారి పురాకృత పుణ్యమంతా నశించిపోతుంది.


పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్ధంలో స్వాధ్యాయ సమయంలో ఎవరూ ఎవరికీ ప్రత్యేకంగా నమస్కరించకూడదు. శ్రాద్ధం వ్రతం దానం దేవతాభ్యర్చనం యజ్ఞం తర్పణం వీటిని చేస్తున్న వ్యక్తికి చేస్తున్న వేళ నమస్కరించకూడదు. నువ్వు ఎవరికైనా నమస్కరిస్తే అతడు ప్రతి నమస్కారం చెయ్యకపోతే మరింక ఆ వ్యక్తికి ఎప్పుడూ నమస్కరించకూడదని కఠిన నియమం. కనక నమస్కరించదగిన వారికే అయినా సమయం సందర్భం చూసి మరీ నమస్కరించాలి.


శ్రీదత్త పురాణము (258)

 


గుహ్య సూత్రోక్త ప్రకారంగా 3-5-6-7-8 సంవత్సరాల వయస్సులో బిడ్డడికి చౌల సంస్కారం చెయ్యాలి. దైవయోగం వల్ల ఈ గర్భాదానాది సంస్కారాలకు కాలాతిక్రమణం జరిగితే పాదకృచ్ఛ ప్రాయశ్చిత్తం చౌలానికి కాలాతి క్రమణం జరిగితే అర్థకృచ్ఛ ప్రాయశ్చిత్తం చెయ్యాలి.


గర్భాష్టమంలో గానీ ఎనిమిదేళ్ళ వయస్సున గానీ పుత్రుడికి ఉపనయనం చెయ్యాలి. అధమ పక్షం పదహారేళ్ళ లోపులో జందెం వెయ్యాలి. క్షత్రియుడికి పదకొండో యేట ప్రశస్తం. అధను పక్షం ఇరవైరెండేళ్ళు దాటేలోగా, వైశ్యుడికి గర్భద్వాదశంలో ఉపనయనం ఉత్తమపద్ధతి. అధము పక్షం ఇరవైనాలుగేళ్ళ వయస్సు దాటేలోగా చెయ్యడం మంచిది. బ్రాహ్మణవటువు కాషాయాంబరం క్షత్రియ వటువు మాంజిప్టెంబరం, వైశ్యవటువు హరిద్రాంబరంధరించాలి.


ఉపనయనానంతరం ఈ వటువులు గురుకులంలో నివసిస్తూ గురుశుశ్రూష చేస్తూ వేదాధ్యయనం సాగించాలి. తెల్లవారు జామునే స్నానం చెయ్యడం గురువు గారికి సమిత్కుశ ఫలాదుల్ని అడవి నుండి తెచ్చి అందించడం వీరి నిత్యకృత్యం, యజ్ఞోపవీత ఆజిన దండాలను ధరించి ఉండాలి. వీటిలో ఏది ఎప్పుడు తెగినా, విరిగినా, వెంటనే సమంత్రకంగా కొత్తది ధరించి పాతదాన్ని వీటిలో వదిలిపెట్టాలి. బ్రహ్మచారులు భిక్షాన్నంతోనే జీవించాలి. శ్రోత్రియుల ఇళ్ళల్లోనే బిక్షాటన చెయ్యాలి, భవతి భిక్షాందేహి అని బ్రాహ్మణవటవు, భిక్షాం భవతి దేహి అని క్షత్రియవటువు, భిక్షాందేహి భవతి అని వైశ్యవటువు భిక్షను అభ్యర్ధించాలి. సంబుద్ధి ఆది - మధ్య అంతాలలో క్రమంగా రావాలి. ఉభయ సంధ్యల్లో అగ్ని కార్యం చెయ్యాలి. అటుపైన భిక్షాన్నం తెచ్చుకొని గురువు గారికి నివేదించి వారి అనుజ్ఞతో మౌనంగా భుజించాలి. మధువు - స్త్రీ - మాంసం లవణం - తాంబూలం - దంత ధావనం - ఎంగిలి తినడం - (ఉచ్ఛిష్ట భోజనం) - పగటి నిద్ర - (దివాస్వాపం) - గొడుగు - పాదుకలు - చందన గంధాది పరిమళద్రవ్యాలు - జలకేళి - ద్యూతం - గీతనృత్యవాద్యాదులు - పరివాదం- ఉపతాపం - విప్రలాపం - అంజనం- పాషండ జన సంయోగం - శూద్ర సంగం - వీటిని పరిహరించాలి.

Friday, 15 September 2023

శ్రీదత్త పురాణము (257)



పశుపాలన వాణిజ్యం కృషి వేదాధ్యయనం ఇవీ ప్రధానంగా వైశ్యవర్ణ ధర్మాలు - యజ్ఞాలతో దేవతల్ని దానధర్మాలతో విప్రుల్ని సంతృప్తి పరచాలి. శూద్రులు - క్రయవిక్రయాలలో ఆర్జించిన లాభాలతో గానీ శిల్ప విద్యలతో సంపాదించిన ధనంతో గాని దానధర్మాలు యజ్ఞయాగాలు నిర్వహించాలి. ద్విజులకు అన్నింటా సహకరించడం వీరికర్తవ్యం. ఋతుకాలంలో ధర్మపత్నిని కలవడం ప్రశస్తం. లోకహితం కోరడం, మంగళప్రదంగా ప్రియంగా మృదువుగా మాట్లాడటం. అనాయాసీత్వం (అట్టే శ్రమలేకుండా నిపుణంగా పనులు చెయ్యడం) మహోత్సాహిత్వం నిగర్విత్వం సహనగుణం (తితిక్ష) - ఇవన్నీ అన్ని వర్ణాల వారికీ సాధారణ ధర్మాలు.


తమ వర్ణాశ్రమాలకూ తగినకర్మలను అనుష్టించడం ద్వారా అందరూ ముక్తికి అర్హులవుతారు. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియాచారాన్ని క్షత్రియుడు వైశ్యాచారాన్ని ఆశ్రయించవచ్చు. ఇదీ ఆపద్ధర్మం మాత్రమే. వర్ణాలు లాగానే ఆశ్రమాలు కూడా నాలుగే, అయిదవదిలేదు. బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం. కర్మయోగరతులై నిస్పహులై శాంతమనస్కులై స్వకర్మ పరినిష్ఠుతులై అన్ని ఆశ్రమాలవారూ పునరావృత్తి రహితమైన ముక్తిని పొందగలుగుతారు. వీటిలో స్వకర్మను పరిత్యజించి పరకర్మను ఆశ్రయించినవాడు పాషండుడు అనబడతాడు. అతడే సర్వధర్మ బహిష్కృతుడు.


షోడశ సంస్కారాలు


అన్ని వర్గాల వారికి గర్భాదానాది సంస్కారాలు పదహారు ఉన్నాయి. అని కూడా తెలుసుకోవడం అవసరమే. గర్భాదానం పుంసవనం జాతకర్మనామకరణం - - సీమంతం - జాతకర్మ - నామకరణం - అన్నప్రాశనం -ప్రజాపత్యం - సౌమ్యం - ఆగ్నేయం వైశ్వదేవం గోదావం సమావర్తనం వివాహం అంత్యకర్మం ఇనీ - - - - షోడశసంస్కారాలు. వీటిలో గర్భాదానం పురుషుడికి సమంత్రకంగా స్త్రీకి అమంత్రకంగా చెయ్యాల్సిన సంస్కారం. తొలిచూలు గర్భిణికి 4-6-7-8 మాసాలలో సీమంత సంస్కారం చెయ్యాలి. పుత్రోదయం కాగానే తండ్రి కట్టుబట్టలతో సహా స్నానం చెయ్యాలి. స్వస్తి వాచన పూర్వకంగా నాందీ శ్రాద్ధం ఆచరించాలి. బంగారంతో గానీ, ధాన్యంతో గానీ జాతశ్రాద్ధం చెయ్యాలి. అన్నంతో మాత్రం చేయరాదు. సూతకమయ్యాక యధావిధిగా మౌనంగా తండ్రి బిడ్డకు నామకరణం చెయ్యాలి. అర్థవేది (అతి ప్రకటితమైన అర్థం కలది) అర్థహీనం, అతి గుర్వక్షరాన్వితం విషమాక్షర సహితం - అయిన పేరును పెట్టకూడదు.

Tuesday, 12 September 2023

శ్రీదత్త పురాణము (256)

 


దత్తుడు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు


ధర్మకీర్తి మహారాజా ! వర్ణాశ్రమాచార యుతమైన సనాతన ధర్మం చెబుతున్నాను తెలుసుకో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణాలువారు వున్నారు. వీరిలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు. తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ. ఉపనయనం రెండవ జన్మ. కనుకనే వీరిని ద్విజులు అన్నారు. ఈ నాలుగు వర్ణాలవారూ స్వధర్మం తప్పకుండా జీవితాలు గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించేటట్లుగా చెయ్యడం రాజుకి ప్రధమ కర్తవ్యం. స్వవర్ణ ధర్మాన్ని త్యజిస్తే వీరిని పాషండులు అంటారు. వీరిని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించిన గుహ్యసూత్రాలను, కర్మలను, విప్రుడు తు.చ. తప్పకుండా పాటించాలి. అది కృతకృత్యత పాటించకపోతే పతితుడైనట్లు సర్వధర్మ బహిష్కుృతుడైనట్లు లెక్క. చతుర్వర్ణాలవారూ యుగధర్మాలను గమనించాలి. యధోచితంగా వాటికి లోబడి స్వధర్మాలను పరిష్కరించుకోవాలి. అలాగే స్మృతి విరోధం లేనంత వరకూ గ్రామాచారాలను పాటించాలి. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణం చెయ్యాలి. స్వర్గ సంపాదం కాని ధర్మాన్ని, లోకం ఒప్పని ధర్మాన్ని వదిలి వెయ్యాలి.


ధర్మకీర్తి! సముద్ర యానం, కమండలు ధారణ, అన్యకన్యను వివాహం ఆడటం, దేవర న్యాయం చొప్పున వంశం నిలబెట్టుకోవడం (మరిదివల్ల పిల్లల్ని కనడం), మధుపర్క సందర్భంగా పశువధ చెయ్యడం, శ్రాద్ధాలలో మాంసం పెట్టడం, వానప్రస్తస్వీకారం, స్త్రీ పునర్వివాహం, దీర్ఘకాల బ్రహ్మచర్యం, నర - అశ్వమేధాలు చెయ్యడం, మహా ప్రస్థానగమనం, ఇవి ఈ కలియుగంలో పరిహరణీయాలని పెద్దలు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలవారు - వారి వారి దేశీయాచారాలను విధిగా పాటించాలి. లేదంటే పతితుడవుతాడు. సర్వధర్మ బహిష్కృతుడవుతాడు.


చాతుర్వర్ణాలవారికి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని ఎరుక పరుస్తాను తెలుసుకో, బ్రాహ్మణుడు దాన ధర్మాలలో సాటి బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. జీవన భృతికోసం యోగ్యులకు యాజ్ఞికం స్వీకరించవచ్చు. అధ్యాపనం చెయ్యవచ్చు. స్నానసంధ్యలు నిత్యమూ ఆచరించాలి. వేదాధ్యయనమూ చెయ్యాలి. ఆయుధ జీవి కాకూడదు. అగ్ని పరిగ్రహం నిత్యకృత్యం, పరద్రవ్యాన్ని మట్టితో సమంగా చూడాలి. ఎప్పుడూ లోకహితం కోరాలి. మృదువుగా సంభాషించాలి. ఋతుకాలంలోనే ధర్మపత్నితో సంగమించడం ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవ్వరికీ అహితం పలుకకూడదు. దానధర్మాలతో విప్రుల్ని సంతోషపెట్టాలి. వేదాధ్యయనం చెయ్యాలి. యజ్ఞాలతో దేవతల్ని ఆనందపరచాలి. ఆయుధ జీవి కావాలి. ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసితీరాలి.


Monday, 11 September 2023

శ్రీదత్త పురాణము (255)

 


తండ్రీ ! పూర్వజన్మలో నొకసారి సహ్యాద్రికి వెళ్ళాను. అక్కడ ఆశ్రమం నిర్మించుకొన్న అత్రిపుత్రుణ్ని దర్శించాను. మధుమత్తుడై పాడుతున్నాడు. ఆడుతున్నాడు. కుడిచేతిలో మధు చషకం. ఎడమచేతి క్రింద జగదేకసుందరి, ఎరుపెక్కిన కన్నులు. తడబడుతున్న మాటలు, మద్యమాంసాల కంపుకి జోరుగా ముసురుతున్న ఈగలు అల్లంత దూరం నుండి చూసి అక్కడే సాష్టాంగపడి లేచి సాంజలిబంధంగా ఒకింత ముందుకి వంగి నిలబడ్డాను. చేతిలో మధుపాత్ర నా పైకి విసిరాడు. వెంటనే ఒకపాటి చేతి కర్ర కూడా విసిరాడు. ఆ పైన ఒక ఇటుకరాయి విసిరాడు. దెబ్బలు తగులకుండా తప్పించుకొని నిలబడ్డాను. నన్ను భయపెడుతూ తరమడానికి వచ్చాడు. నేను చలించలేదు. అలాగే నమస్కరించి నిలబడ్డాను. దత్తాత్రేయుడు వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆనాడే నేను స్వామి పరివారంలో సభ్యుణ్ని అయ్యాను. నిత్యము సేవలు చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఏనాడూ నన్ను పలుకరించని స్వామి నా వైపు చూపులన్నా నిగిడించనిస్వామి ఓనాడు నన్ను కరుణించారు.


కరుణామృత ధారల్ని కురిసే చూపుల్ని నాపైకి ప్రసరింపజేసారు. ఎందుకోసం వచ్చావు ? ఏమి కావాలని వచ్చావు? అని మృదువుగా అడిగారు. ప్రభూ! ధర్మ స్వరూపం తెలుసుకోవాలని ఆశగా వచ్చాను అభ్యర్ధనగా అన్నాను. - ధర్మకీర్తి! తెలుసుకోగానే సరా ఆచరించవద్దూ సరే అయితే చెబుతాను విను అని ఒకవింతైన చిరునవ్వునవ్వి ధర్మాలనూ ధర్మసూక్ష్మాలనూ ఎన్నింటినో ఉపదేశించాడు దత్తప్రభువు. అన్నింటినీ అవగతం చేసుకొని స్వామికి కృతజ్ఞతగా నమస్కరించి అనుమతి తీసికొని రాజధాని చేరుకున్నాను. ధర్మబద్ధంగా పరిపాలన సాగించాను. ఏ జన్మ పాపమో దుష్ట సాంగత్యానికిలోనై ధర్మం తప్పి పాపాలు మూటగట్టుకున్నాను. చివరకు మళ్ళీ దత్త స్వామి కృపవల్లనే మరణవేళ సత్సాంగత్యం లభించింది. యముడి ధర్మప్రభోదాలు వినగలిగాను. విష్ణుభక్తుణ్ని కాగలిగాను. సరే దత్త స్వామి చేసిన ధర్మప్రభోదాలు చెప్పనున్నావుగదా శ్రద్ధగా ఆలకించు. దత్తదేవుడు ఆ జన్మలో నన్ను సంభోదించి చెప్పిన ధర్మాలు యధాతధంగా వినిపిస్తాను.


Sunday, 10 September 2023

శ్రీదత్త పురాణము (254)

 


తండ్రీ ! యమధర్మరాజు తన భటులకు జారీ చేసిన ఆజ్ఞలను విన్నాను. నాలో గొప్ప అనుతాపం బయలుదేరింది. చేసిన పాపకృత్యాలన్నీ కళ్ళఎదుట మెదిలి పశ్చాత్తాపంజెందాను. అపుకోలేని దుఃఖంతో వలవలా ఏడ్చాను. యమధర్మరాజు ఓదార్చాడు. దుఃఖపడకు ఏకాదశీ వ్రతంవల్లా ఈ అనుతాపం వల్లా సద్ధర్మశ్రవణంవల్లా నువ్వు పాపరహితుడవేకాదు. మహాపుణ్యాత్ముడవయ్యావు అంటూండగానే నాకు నారాయణ రూపం వచ్చేసింది. సహస్ర - సూర్యసంకాశుణ్ని అయిపోయాను. యమధర్మరాజు మళ్ళీనాకు సాష్టాంగపడ్డాడు. యమదూతలందరూ సాగిలపడి మ్రొక్కారు. అంతలోకి నూరు దివ్య విమానాలు వచ్చాయి. ఒకదానిలో కూర్చోపెట్టి వైకుంఠానికి సాగనంపారు. అక్కడ దివ్యభోగాలు అనుభవిస్తూ దివ్య విమానాల్లో సంచరిస్తూ కొన్నివేల సంవత్సరాలు గడిపాను. అటుపైన ఇంద్రలోకానికి పంపారు. అక్కడా అందరి దేవతల నమస్కారాలు అందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవిస్తూ మరికొన్ని వేలసంవత్సరాలు ఆనందించి ఏకాదశి పుణ్యఫలం నిల్వలు కరిగిపోవడంతో భూగోళానికి తిరిగి వచ్చాను. మీ యింట బిడ్డనై జన్మించాను. జాతిస్మరుణ్ని కనుక పూర్వజన్మ వృత్తాంతం గుర్తుంది. యమధర్మరాజు ప్రభోదించిన మేరకు ఆ బాల్యమూ హరిభక్తిని ఆచరిస్తున్నాను. ఏకదశీ వ్రతాలు ఉపవాసాలతో జాగరణలు చేస్తున్నాను. అనుకోకుండా ఉపవాసం వుండి జాగారం చేస్తేనే ఇంత ఫలం నాకు దక్కిందంటే ఇక కావాలనీ భక్తితో ఏకాదశీ వ్రతం చేసేవారికి దక్కేఫలం గురించి ఏమి చెప్పను, ఎంతని చెప్పను.


అంచేత తండ్రీ ! అప్పటి నుండి ఈ నేను ఏకాదశీ వ్రతాలు చేస్తున్నాను. అహరహమూ విష్ణు పూజలు చేస్తున్నాను. నా ఆకాంక్ష - పరమపద ప్రాప్తి - పరమానందదాయకమైన ఆ విష్ణులోకం చేరుకోవాలంటే భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతం చెయ్యడ మొక్కటే సులువైన మార్గం. ఈ కధ విన్నవారు చదివినవారూ కూడా సర్వపాప విముక్తులై జన్మాంతంలో విష్ణులోకం చేరుకుంటారు.


నాయనా భద్రశీలా ! నిన్ను పుత్రుడిగా పొంది మా జన్మలు ధన్యమయ్యాయి. మా వంశం తరించింది. నీ వల్ల హరి భక్తి మహిమ తెలుసుకోగలిగాను. ఏకాదశీ వ్రత మహిమ గుర్తించగలిగాను. తండ్రి నన్న మాటేగానీ నాకు తెలీని రహస్యాలు ఎన్నో బోధించావు. నిజానికి నువ్వే నా తండ్రివి, నా గురువువి. నాయనా ! ధర్మకీర్తిగా నువ్వు రాజ్యం చేస్తున్న రోజుల్లో దత్తస్వామి శిక్షణపొందాను అన్నావు. వేదశాస్త్రాలు, ధర్మాధర్మాలు ఆచారవ్యవహారాలు, ఆ యోగీంద్రుడు నీకు బోధించాడన్నావు. ఆ బోధలు వినాలని వుంది. జాతిస్మరుడువి కనుక నీకు అన్ని విషయాలు గుర్తుండి వుంటాయి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని క్లుప్తంగానైనా ఎరుకపరిస్తే ధన్యుణ్ని అవుతాను.


Saturday, 9 September 2023

శ్రీదత్త పురాణము (253)

 


దూతలారా ! మీకందరకూ ఒక హితం చెబుతున్నాను. శ్రద్ధగా వినండి. ధర్మపరాయుణులై జీవితాలు గడిపి అసువులు బాసిన వారిని ఎవరినీ నా దగ్గరకు తేకండి. విష్ణుభక్తి పరాయణులనూ, వారి బంధుమిత్రులను, దైవంపట్ల కృతజ్ఞతా భావంతో జీవించేవారిని ఏకాదశి వ్రత పరుల్నీ జితేంద్రియుల్ని నారాయణా ! అచ్యుతా! అని భవార్తి - శమనం కోసం హరినామస్మరణ బిడియ పడకుండా బిగ్గరగా చేసే వారినీ విడిచిపెట్టండి. వీళ్ళజోలికి మీరు వెళ్ళవద్దు. దూరం తొలగి వచ్చెయ్యండి. వీళ్ళకి నేను వేసే శిక్ష ఏమీలేదు.


స్వాచారపరులూ, గురుసేవకులూ, సత్పాత్ర దాన నిరతులూ, పాషండ సాంగత్యదూరులూ, సత్సంగలోలుపులు, హరిహర సమబుద్ధిమంతులు, ఉపకార శీలురు, బ్రాహ్మణభక్తి కలవారు వీరిజోలికి మీరు పోవద్దు. వీరిని ఎప్పుడూ - నా సన్నిధికి తేవద్దు.


తల్లితండ్రుల్ని ఏడిపించుకొని తినేవాళ్ళని, లోకకంటకుల్నీ, బ్రహ్మద్వేషుల్ని, దేవుడి సొమ్ము దిగమ్రింగేవాళ్ళని, జననాశకారుల్ని - ఇలాంటి అపరాధుల్ని పట్టితీసుకురండి. నా సమక్షంలో నిలబెట్టండి తగిన శిక్షలు విధిస్తాను. ఏకాదశీ వ్రతపరాజ్ఞ్ముఖుల్ని, ఉగ్రశీలురూ, లోకాపవాదనిరతులూ, పరదూషణపరాయణులూ, గ్రామ వినాశకులూ, ఉత్తముల్ని నిందించేవారూ బ్రాహ్మణుడి సొమ్ము కాజేసిన వారూ, వీళ్ళని బంధించి తీసికొనిరండి వీళ్ళతో మనకు - పని. నోరారా హరినామం జపించని వారూ, హరికి నమస్కరించనివారూ, హరికోవెలలకు వెళ్ళని వారూ - వీళ్ళని వెదికి వెదికి పట్టుకుని రండి. ఇటువంటి మహాపాప ప్రశస్తులు మనకు కావాలి.


Friday, 8 September 2023

శ్రీదత్త పురాణము (252)

 


రాజ్యం ఆకంటకంగా ధనధాన్యసమృద్ధులతో తులతూగుతోంది. ఆ కీర్తి, ఆ భోగాలూ - రెండూ కలిసి లక్ష్మీ మదం గట్టిగా తలకెక్కింది. పాషండుల సలహాలు వింటూ అధర్మాలు అనేకం చేసాను. పూర్వ సంచితాలైన పుణ్యాలన్నింటినీ పోగొట్టుకొన్నాను. కూడనియుక్తులు చెబుతూ వితండవాదాలు చేస్తూ రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులూ సమస్త ధర్మకార్యాలనూ నోములు, వ్రతాలూ, జపాలూ అన్నింటినీ విలుపుదల చేసాను. నేను అధర్మ మార్గం పడితే నా ప్రజలు అంతకన్నా ముందుకు వెళ్ళారు. ఎన్నెన్నో ఘోరాలు చేసారు. వారుచేసిన పాపకృత్యాలలో పరిపాలకుడుగా నా భాగం నాకూ దక్కుతూ వచ్చింది. ఇలా రకరకాలుగా పాపం ప్రోగుచేసుకున్నాను.


ఒకనాడు - పదిమంది స్నేహితులతో కలిసి మృగయా వినోదం కొరకు అడవికి వెళ్ళాను. క్రూరమృగాలను వేటాడి అలసిపోయాను. సాయంకాలం అయ్యేసరికి రేవా నదీతీరం చేరుకున్నాను. అలసి గుర్రాన్ని ఒడ్డున నిలిపి హాయిగా నదిలో స్నానం చేసాను. వేటలో పడి ఉదయం నుండీ ఏమి తినలేదు కనుక నీళ్ళతో కడుపు నింపుకున్నాను. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. నెమ్మదిగా చీకట్లు క్రమ్ముకున్నాయి. సేదతీర్చుకొని జలక్రీడ ముగించి గట్టుకి చేరుకున్నాను. అల్లంత దూరాన మనుజులు అలకిడి అయ్యింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. ఎవరో సమీప గ్రామస్థులు రేవానదీతీరంలో గుట్టుగా ఏకాదశీ వ్రతం ఆచరిస్తున్నారు. నేను కూడా వారిలో ఒకడివై కూర్చుండిపోయాను. వారితో పాటు ఆ రాత్రంతా జాగారం చేసాను. గుర్రపు స్వారీ, రోజంతా వేట, తిండీతిప్పలు లేకపోవడం జాగరణం అన్నీ కలసి అలసటలో ప్రాణాలు ఎగిరిపోయాయి.


భీకరా కారులూ యమభటులు ప్రత్యక్షమయ్యారు. నన్ను యమపాశాలతో బంధించి యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడు ఒక్కక్షణం ఆలోచించాడు. ధర్మరాజా ! ఈ ధర్మకీర్తి తొలినాళ్ళల్లో ధర్మాత్ముడు. శ్రీ దత్తాత్రేయ గురువర్యుని దర్శనం, స్పర్శనం, సంభాషణం వల్ల ధర్మశాస్త్రాలన్నీ ఎరిగి ధర్మబద్ధంగా జీవించిన వ్యక్తి. ఆ తర్వాత కొన్నాళ్లకు సాంగత్య దోషాలవల్ల అధర్మాత్ముడుగా మారాడు. ఇతడు చెయ్యని పాపం లేదు. కానీ దత్త స్వామి కృపవల్ల నిన్న ఏకాదశీ వ్రతం ఆచరించాడు. నిరాహారుడై హరిపూజలో పాల్గొన్నాడు. జాగరణం చేసాడు. ప్రాణాలు వదిలేసాడు. తెలిసి చేసినా తెలియకజేసినా పాప ఫలం తప్పనట్లుగానే పుణ్యఫలమూ తప్పదు. కనుక ఈ వ్రతంలో ఇతడి పాప సముద్రాలన్నీ ఇంకిపోయాయి. పుణ్యఫలమే మిగిలివుంది.


చిత్రగుప్తుడు ఇలా చెప్పేసరికి తండ్రీ! యమధర్మరాజు సింహాసనం నుండి దిగివచ్చి నాకు సాష్టాంగపడ్డాడు. షోడశోపచారాలు చేసాడు. యమభటుల్ని అందర్ని పిలచి ఇలా ప్రకటించాడు.


Thursday, 7 September 2023

శ్రీదత్త పురాణము (251)

 


భద్రశీల గాధ


సనత్కుమారా ! ఈ విషయంలో పురాతనమైన ఇతిహాసం ఒకటి ఉంది. చెబుతాను ఆలకించు. పూర్వకాలంలో గాలవుడు అనే ముని వున్నాడు. నర్మదాతీరంలో కందమూల ఫలాలూ సమిత్కుశ పుష్పాదులూ సమృద్ధిగా దొరికే ఒక సుందరారణ్యంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. శాంతి - దాంతులు కలవాడు. సత్యపరాయణుడు. జితేంద్రియుడై తపస్సు కొనసాగిస్తున్నాడు. ఆ అరణ్య సౌందర్యం పక్షిమృగాలకోలాహలం సిద్ధచారణ గంధర్వ యక్ష విద్యాధరాదుల్ని సహితం ఆకర్షిస్తూ వుండేది. వారు వచ్చి అక్కడ సంచేరించేవారు. ఈ తపోనిధి గాలవునికి భద్రశీలుడు అనే కుమారుడుండేవాడు. చాలా అందగాడు. పేరుకి తగ్గట్లే శీలసంపన్నుడు జాతి స్మరుడు. నారాయణభక్తి పరాయణుడు. అతడు బాలుడుగా వున్నప్పుడే ఆటలూపాటలు శ్రీ హరిపరంగా సాగించేవాడు మట్టితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని అర్చించడం బాల్యక్రీడగా జరిపేవాడు. అర్చన ముగిసాక సకలజగత్తులకు సకల శుభాలు కల్పించమని ప్రార్థిస్తూ స్వామికి ననుస్కరించేవాడు. ఉన్నట్లుండి ఒక్కొక్కరోజున ఈ రోజు ఏకాదశి అని ఉపవాస దీక్ష స్వీకరించేవాడు. రాత్రి జాగారం చేసేవాడు. బాల్యం నుండీ ఇలా హరి భక్తి తత్పరుడైన బిడ్డడిని చూసి తల్లి తండ్రులు ఎంతగానో మురిసిపోయేవారు. ఒకనాడు తండ్రిగాలవుడు భద్రశీలుడ్ని ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతూ -


నాయనా ! మహాయోగులకు సైతం దుర్లభమైన నీ భక్తి నీ ప్రవర్తనా నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి. పేరుకి తగినట్లుగా వున్నావు. నిత్యమూ నువ్వు చేసే హరి పూజలూ సర్వభూతహితమూ, ఏకదశీ వ్రతాలూ, నిర్మమంగా శాంతచిత్తంతో చేసే హరి నామ స్మరణలూ, ఇవన్నీ నీ ఈడు పిల్లల్లో ఉన్నవి, విన్నవి, కన్నవికావు. నీకసలు ఈ విష్ణుభక్తి ఇంత - చిన్నవయస్సులోనే ఎలా ఏర్పడింది ? నా ఆలోచనకు అందడం లేదు. నీకేమైనా తెలిస్తే చెప్పు! విని సంతోషిస్తాను అన్నాడు. 


తండ్రీ ! జాత స్మరుణ్ని కనుక క్రిందటి జన్మలో యమధర్మరాజు చెప్పిన మాటలు నాకు జ్ఞాపకం వున్నాయి. నువ్వు అడిగావు కనుక అన్నీ వివరంగా చెబుతాను విను. నేను క్రిందటి జన్మలో సోమవంశంలో పుట్టిన మహారాజుని. అప్పుడు నాపేరు ధర్మకీర్తి. దత్తాత్రేయుడి శిక్షణలో ఆయావేదశాస్త్రాలు తెలుసుకొని ధర్మబద్ధంగా తొమ్మిదివేల సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించాను. కీర్తి గడించాను. ధర్మకీర్తి అనే పేరుని చరితార్థం చేసుకున్నాను. ప్రజలంతా నన్ను దైవంతో సమానంగా చూసేవారు.


Wednesday, 6 September 2023

శ్రీదత్త పురాణము (250)

 


ఏకాదశీ జాగరణ తరువాత ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తికి పుష్పమంటపం నిర్మించాలి. దీనికి సమర్పించే ఒక్కొక్క పువ్వూ ఒక్కొక్క అశ్వమేధ ఫలం ఇస్తుంది. ఇలాంటి విశ్వాసాలతో విశుద్ధ భావాలతో ఏకాదశి ఉపవాసం - జాగరణం చేస్తే నిమిష నిమిషానికీ చేకూరే పుణ్యం తీర్ధకోటికి సాటి వస్తుంది. ద్వాదశినాటి ఉదయం స్నానసంధ్యాదులు ముగించి షోడశోపచారాలతో శ్రీహరిని అర్చించాలి. ఏకాదశినాడు స్వామికి పంచామృతస్నానం, ద్వాదశి నాడు క్షీరాభిషేకం జరపాలి. ఈ రెండూ చేసిన భక్తుడు హరి సారూప్యం పొందుతాడు. కేశవా! అజ్ఞాన తిమిరాంధుణ్ని నేను ఈ వ్రతంలో నువ్వు ప్రసన్నుడవై సుముఖడవై జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ నారాయణుడికి సాగిలి మ్రొక్కాలి.


చక్రికి ఇలా విజ్ఞాపన చేసి ద్వాదశినాటి మధ్యాహ్నం బ్రాహ్మణ సంతర్పణ జరపాలి. భూరిదక్షిణలతో తాంబూల నూతన వస్త్రప్రదానాలతో సంతృప్తి పరచాలి. అటుపైని తాను తనకు నిత్య విధులైన పంచయజ్ఞాలు ముగించి బంధుమిత్రులతో కలిసి మౌనంగా నారాయణ పరాయణుడై భుజించాలి. ఇలా చేసిన హరి భక్తుడికి ఏకాదశీ వ్రత ఫలంగా పునరావృత్తి రహితమైన విష్ణులోక నివాసం లభించి తీరుతుంది.


ఈ వ్రత దీక్షతో ఉన్నంతసేపూ - వృషులులతో వేదనిందకులతో వృషలీపతులతో అయాజ్యయాజకులతో కుండాశులతో (అక్రమసంతానం) గోళకులతో (విధవాసంతానం) దేవలకాశులతో (స్థావర పూజలతో జీవించేవాళ్ళు) భిషక్కులతో కావ్యకర్తలతో దేవద్విజ విరోధులతో పరాన్న లోలుపులతో పరస్త్రీ నిరతులతో మాట్లాడకూడదు. మర్యాదకోసం మాటమాత్రంగానైనా పలకరించకూడదు. (వాజ్ఞ్మత్రేణాపి వార్చయేత్). ఇట్లాంటి నియమాలు పాటించి నిగ్రహం కలవాడై సర్వహితం కోరుతూ ఏకాదశీ వ్రతం పరిసమాప్తం చేస్తే పరమపదం కైవసమవుతుంది. సారాంశంగా ఒక్కమాట - గంగకు సాటివచ్చే తీర్ధం లేదు. తల్లికి సాటివచ్చే గురువులేడు, శ్రీహరికి సాటివచ్చే దేవదేవుడు లేడు, (ఏకాదశీ) ఉపవాసానికి సాటివచ్చే తపస్సులేదు. వేద సమమైన శాస్త్రం, శాంతిసమమైన సుఖం, సత్యసమయమైన వెలుగు, ఉపనాస సమమైన తపస్సులేవు. తల్లికి సరితూగే కర్పరి, కీర్తికి సరితూగే ధనం, జ్ఞానానికి సరితూగే భావం, ఉపవాసానికి సరితూగే తపస్సు లేవంటే లేవు.


నాస్తి గంగాసమం తీర్థం వాస్తే మాతృసమో గురుః|

నాస్తి విష్ణుసమో దేవః తపో నానశనాత్పరమ్ || 

నాస్తి వేదసమం శాస్త్రం నాస్తి శాంతిసమం దుఖం | 

నాస్తి సత్యసమం జ్యోతిః తపోనావశవాత్పరమ్ || 

నాస్తి క్షమాసమా మాతా నాస్తికీర్తి సమం ధనమ్ | 

నాస్తి జ్ఞానసమో భావః తపోనానశనాత్పరమ్ ||


Tuesday, 5 September 2023

శ్రీదత్త పురాణము (249)

 


ఏకాదశీ వ్రతం


సనత్కుమారా! సర్వపాప వినాశకంగా సర్వపుణ్యదాయకంగా ముల్లోకాలలోనూ ప్రసిద్ధికెక్కిన మరొక వ్రతం మీకు చెబుతున్నాను. దీన్ని చాతుర్వర్ణాల వారూ స్త్రీ పురుషులూ అందరూ చేసుకోవచ్చును. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం, భక్తితో చేస్తే ముక్తి లభించి తీరుతుంది. దీనిపేరు ఏకాదశీవ్రతం, కృష్ణ పక్షంలో గానీ శుక్ల పక్షంలోగానీ ఏకాదశినాడు ఉపవాసం ఉండాలి, భుజించడం మహాపాపం. నరక హేతువు. ఉపవాస ఫలం పూర్తిగా దక్కాలి అంటే దశమినాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలూ, ద్వాదశినాటి రాత్రి మొత్తం నాలుగు భోజనాలు మానెయ్యాలి. ఏకాదశినాడు భోజనం చెయ్యడమంటే సర్వపాపాలనూ కావాలని ఏరికోరి భుజించడమన్నమాట. అంచేత ఏకాదశినాడు రెండుపూటలా నిరాహారులై ఉండాలి. బ్రహ్మహత్యమహాపాతకంతో సాటివచ్చే సర్వపాపాలూ ఏకాదశినాడు అన్నాన్ని ఆశ్రయిస్తాయి. అంచేత ఆరోజు భుజించినవాడికి అవి సంక్రమిస్తాయి. ఇక అతడికి నిష్కృతి ఎలా చెప్పు ?


పాపాలు చేసిన వారుగానీ చెయ్యని వారుగానీ ఏకాదశినాడు నిరాహారులుగా ఉంటే పరమపదం చేరుకుంటారు. ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం కనక భవబంధాలను తెగతెంచుకోవాలనుకునేవారు తప్పకుండా ఏకాదశీ వ్రతం ఆచరించాలి. దశమిరోజున తెల్లవారు జామునే లేచి దంతధావనాదులు ముగించి తలారా స్నానం చేసి నియతేంద్రియుడై భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ రాత్రికి నారాయణ సన్నిధిలోనే నిద్రించాలి. ఏకాదశి నాటి ఉదయమూ అల్లాగే లేచి స్నానాదికం ముగించుకుని జనార్ధనుణ్ని గంధపుష్పాదులతో షోడశోపచార విధి పూర్వకంగా అర్చించాలి అటుపైని ఇలా చెప్పుకోవాలి పుండరీకాక్షా! ఏకాదశినాడు ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తాను, అచ్యుతాశరణు శరణు.


ఈ మంత్రం పఠించి దేవదేవుడైన చక్రిపట్ల భక్తిభావంతో సంతుష్టాత్ముడై ఉపవాసం స్వామివారికి సమర్పించాలి. ఆ రాత్రి స్వామి సన్నిధిలోనే జాగరణం ఉండాలి. గీతవాద్యనృత్య పురాణ శ్రవణాదులతో కాలక్షేపం చెయ్యాలి, గీతం - వాద్యం నృత్యం పురాణపఠనం వేదపఠనం ధూపం దీపం - నైవేద్యం - పుష్ప గంధానులేపనం ఫలం - అర్ఘ్యం ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారం- ఆర్తకం - వీటిని భక్తిశ్రద్ధలతో ఇంద్రియ - - నిగ్రహంతో త్రికరణశుద్ధిగా జాగరూకుడై ఆ రాత్రి జాముజాముకీ ఆచరించాలి. ఉపవాసం ఎంతముఖ్యమో జాగారం అంత ముఖ్యం. విష్ణుమూర్తికి షడ్వింశతి గుణాధికంగా సంతృప్తి కలిగిస్తుంది. ఈ రెండింటినీ భక్తితో చేసిన వారికి మరి పునర్జన్మలేదు. ఈ వ్రతంలో విత్తకార్యం ఎంతమాత్రమూ పనికిరాదు. ధనవంతుడు లోభించి క్లుప్తంగా ఈ వ్రతం చేస్తే ఆ దురాత్ముడు విష్ణుమూర్తిని మోసగించినట్టు, దానికి తగిన శాస్తి జరుగుతుంది. కలిభుజంగ దుష్టులై మాయాపాశవిమోహితులై కొందరు పాపాత్ములు ఏకాదశినాడు నిద్రిస్తారు. వాళ్ళు ఏమి నష్టపోతున్నారో ఎంత నష్టపోతున్నారో తేల్చిచెప్పడం కష్టం. జీవితం ఆధ్రువం కాబట్టి ఒకసారి జారవిడుచుకున్న ఏకాదశిని కూడదీసుకోవడం అసంభవం. పౌరాణికుడు దొరక్కపోతే గీతానృత్యాదులతో జాగారం చెయ్యాలి. దొరికితే పురాణ పఠనం చెయ్యడమే అత్యుత్తమం. ఇలా జాగరణం చేసిన హరిభక్తుల పితృదేవతలు వైకుంఠవాసులవుతారు. జన్మాంతంలో తామూ వైకుంఠధామం చేరుకుంటారు. షష్ఠి సహస్రవర్షాలు ఆశ్వేతద్వీపంలోనే నివసిస్తారు. తాను కాళ్ళతో రేపిన దుమ్ములో ఎన్ని కణాలుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఏకాదశీ జాగరికి వైకుంఠవాసమనీ కనకనే ఆ రోజున ఎంతదూరమైనా నడిచి మాధవాలయానికి వెళ్ళాలనీ పెద్దలు చెబుతారు.


Monday, 4 September 2023

శ్రీదత్త పురాణము (248)

 


అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఇందుమత్యాయు దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు కోడలు దివ్యరథం మీద వస్తున్నారని ఉప్పు అందించింది. అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహూకరించాడు ఆయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్నీ నారద వచనాలనూ గుర్తు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఇన్ని సంవత్సరాలు దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతల కోలాహలం. గంధర్వాప్సరసల గీతనృత్యవాద్య ఘోష, మందార పుష్పవృష్టి, దేవవర్చస్వీ మహాబాహువూ నహుషుడూ ధర్మపత్నీ సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లి తండ్రులకు పాదాభివందనం చేశారు. తండ్రీ కొడుకులూ అత్తా కోడళ్ళూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. 


రాజధానిలో వీధివీధికీ ఇంటింటికీ ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది. అది రాజ్యమంతటా గుబాళించింది.


తండ్రి! కుంజలా వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్థనుడు చెప్పిన దత్తమహిమ ఇది. నహుషవృత్తాంతమిది. ఇది చెప్పి గోవిందుడు అదృశ్యుడయ్యాడు. ఈ రోజు నేను కన్నదీ విన్నదీ వింత ఇది - అని ముగించాడు పక్షియువకుడు కపింజలుడు.


సూతమహర్షీ! మహాప్రాజ్ఞా! మా జన్మలు చరితార్థమయ్యాయి. మా స్వాధ్యాయ తపోయజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రమూ మధురాతిమధురమూ అయిన దత్తకథామృతాన్ని శృతిపుటాలతో ఆస్వాదించగలిగాము. జన్మజరామృత్యువేదనలను మరచిపోగలము. విన్నకొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇక చాలు అనిపించడంలేదు. అంచేత ఓ మహాబుద్ధీ! ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలనూ వ్రతదాన విధులనూ పాప ప్రాయశ్చిత్తాలకు కాలనిర్ణయాలనూ శ్రాద్ధాదిక కర్మవిధానాలనూ గంగామాహాత్మ్యాదులనూ మాకు వినిపించి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాం.


శౌనకాది మునులారా ! మీరు అడిగినట్టే దీపకుడు సైతం తన గురువు గారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి.


వత్సా ! దీపకా దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను సనత్కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నీకు నేను చెబుతున్నాను. శ్రద్ధగా విని గ్రహించు. విష్ణుభక్తి పరాయణుడైన నారదుడు మేరుశృంగంమీద సనత్కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు.


Sunday, 3 September 2023

శ్రీదత్త పురాణము (247)

 


యుద్ధాహ్వాన సూచకంగా శంఖం పూరించాడు. ధ్వనికి మహోదరనగరం కంపించింది. హుండుడు కళవళ పడ్డాడు. ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయు పుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలిట, నీకు మరణం తప్పదట - తిరిగివచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండుడు ఉలిక్కిపడ్డాడు. ఆయు పుత్రుణ్ని నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకుని తినేశాను గదా ! మరి వీడెక్కడివాడు ? అనుకుంటూనే భార్యను మేకలను సూదకుణ్నీ పిలిచి గద్దించి ఆరాతీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడు దగ్గర సకల విద్యలూ నేర్చి ఆయుపుత్రుడు నామీదకి వచ్చాడన్నమాట. హుండుడికి అర్థం అయ్యింది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించనప్పుడు అన్నీ అనుకూలించనట్టే ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండిధైర్యంతో హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ని ఎదిరించాడు.

 

వశిష్టుడు నేర్చిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శాస్త్రాలు, సుదర్శన చక్రంలా పయనించగలిగిన దివ్యరథం - వీటితో నహుషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికెలో మట్టుపెట్టాడు. హుండాసురుడితో తలబడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్చాదితుడైన బాలభానుడిలా కనిపించాడు. దేవతలూ ఋసులూ నిసన్న వదనులయ్యారు. నహుషుడొక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నాడు. విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి హుండాసురుని రెండు బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోథంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులుకడుతున్నా లక్ష్యపెట్టక నహుషుణ్ని కబళించాలని విరుచుకుపడ్డాడు. ముందుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణమాలస్యం చెయ్యకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రీశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్ఞ్యలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకు తగిలింది. దెబ్బకు కొండ గుహలు మారుమోగేట్టు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండుడు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకూ, కొండలకూ పలాయనం చిత్తగించారు. దేవతలూ ఋషులూ మునులూ హర్షధ్వానాలు చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగనలు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నరాదులు బృందగానాలు చేశారు.

 

అశోక సుందరిని వెంటబెట్టుకొని రంభ వచ్చింది. తపఃకృశాంగి, కారాగారవాస పరిప్రశాంత, అశోకసుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని, నీకోసం నే చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది - అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది. కృశాంగీ ! నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను. ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి. వశిష్టాశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు. అన్నట్టుగానే రధం కదిలింది. క్షణంలో వశిష్టాశ్రమాన నిలిచింది. ముగ్గురూ దిగి వెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగ పడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి నీరగాధ మనస్సుకి గిలిగింతలు పెట్టింది. కౌగలించుకుని వత్సా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తానన్నాడు. ముహుర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే వైదికంగా ఆశోకసుందరీ నహుషులకు సకలదేవతలూ సాక్షిగా వివాహం జరిపించాడు. సదస్యమయ్యింది. పసుపుబట్టలతోనే వెళ్ళి తల్లితండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపజెయ్యండి అని చెప్పి నవదంపతులను అదే రథంమీద రాజధానికి పంపించాడు.