Sunday 24 September 2023

శ్రీదత్త పురాణము (267)

 


పంచ యజ్ఞ పరిత్యాజీ బ్రహ్మహా - అన్నారు పెద్దలు. కనుక ఏ మారక రోజూ పంచయజ్ఞాలు చెయ్యాలి. దేవ-భూత- పితృ-మనుష్య-బ్రహ్మయజ్ఞాలను పంచయజ్ఞాలు అంటారు.


ఈ పంచయజ్ఞాలు నిర్వహించి అప్పుడు అతిథి మిత్రాదులతో కలసి శుచిగా రుచిగా మౌనంగా కూర్చుని భుజించాలి. పాత్రుడైన విప్రుణ్ని ఎప్పుడూ వదలిపెట్టకూడదు. అతనితో కలసి సహపంక్తిని భోజనం చెయ్యాలి. సగం వస్త్రం ధరించి కాళ్ళుపీట మీద పెట్టుకొని గొంతు కూర్చుని అన్నాన్ని ఆవిరి ఊదుకుంటూ భోజనం చెయ్యటం అంటే - సురాపానం సేవించటంతో సమానం.


కుడుములూ ఫలాలు మొదలైన వాటిని సగం తిని మళ్ళీ వాటినే తినటం అంటే - కొరుక్కుతినటం చాలా తప్పు. ముక్కలుగా విరుచుకొనో లేదా తరుక్కునో తినాలి. అలాగే సరాసరి ఉప్పుని తినకూడదు. ఈ రెండు పనులూ చేస్తే గోమాంసం తిన్నపాపం చుట్టుకుంటుంది. అలాగే నీటిని ఆచమనం చేసేటప్పుడు ఆపోశనం చేస్తున్నప్పుడూ (జుర్రుమన్న) శబ్దం చెయ్యకూడదు. చేసినవాడు నరకానికి పోతాడు.


అన్నాన్ని ఎన్నడూ దూషించకూడదు. రుచులు మెచ్చుకుంటూ హితవైనది మితంగా భుజించాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంచుమించు మౌనంగా భుజించటం ఉత్తమం. భోజనాలయ్యాక శాస్త్ర చింతనలతో చర్చలతో అధ్యయనాలతో పగలు గడచిపోవాలి. రాత్రి కూడా ఇదే మాదిరి అతిథిని యధాశక్తిగా శయనాసన భోజనాదులతోనో కందమూల ఫలాదులతోనో గౌరవించాలి. గృహస్థుడు ఇలా సదాచారాలు పాటిస్తూ తాను తరించాలి. తన వారిని తరింపజేయాలి. ఎప్పుడైనా సదాచారం తప్పితే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.


వానప్రస్థం - సన్యాసం


తలనెరసి తనువు అలసి వృద్ధుడైన గృహస్థు తన భార్యను పుత్రుల దగ్గరుంచి లేదా వెంట తీసుకొనిగానీ అరణ్యానికి వెళ్ళాలి. ఒక పర్ణశాల ఏర్పరచుకొని కాలక్షేపం చెయ్యాలి. దీన్నే వానప్రస్థం అంటారు. మూడుపూటలా స్నానం చేస్తూ నఖ-శ్మశ్రు జటాధారియై గంధ పుష్పాలకు దూరమై బ్రహ్మచర్యం పాటిస్తూ పంచయజ్ఞలు చేస్తూ నేలమీద పరుండుతూ తపస్సు చేసుకోవాలి. పగటి పూట కేవలం ఎనమిది ముద్దలు భుజించాలి. రాత్రివేళ భోజనం చెయ్యరాదు. వన్యతైలంతో అభ్యంగస్నానాలు నిర్వర్తించుకోవాలి.


No comments:

Post a Comment