తండ్రీ ! పూర్వజన్మలో నొకసారి సహ్యాద్రికి వెళ్ళాను. అక్కడ ఆశ్రమం నిర్మించుకొన్న అత్రిపుత్రుణ్ని దర్శించాను. మధుమత్తుడై పాడుతున్నాడు. ఆడుతున్నాడు. కుడిచేతిలో మధు చషకం. ఎడమచేతి క్రింద జగదేకసుందరి, ఎరుపెక్కిన కన్నులు. తడబడుతున్న మాటలు, మద్యమాంసాల కంపుకి జోరుగా ముసురుతున్న ఈగలు అల్లంత దూరం నుండి చూసి అక్కడే సాష్టాంగపడి లేచి సాంజలిబంధంగా ఒకింత ముందుకి వంగి నిలబడ్డాను. చేతిలో మధుపాత్ర నా పైకి విసిరాడు. వెంటనే ఒకపాటి చేతి కర్ర కూడా విసిరాడు. ఆ పైన ఒక ఇటుకరాయి విసిరాడు. దెబ్బలు తగులకుండా తప్పించుకొని నిలబడ్డాను. నన్ను భయపెడుతూ తరమడానికి వచ్చాడు. నేను చలించలేదు. అలాగే నమస్కరించి నిలబడ్డాను. దత్తాత్రేయుడు వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆనాడే నేను స్వామి పరివారంలో సభ్యుణ్ని అయ్యాను. నిత్యము సేవలు చేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఏనాడూ నన్ను పలుకరించని స్వామి నా వైపు చూపులన్నా నిగిడించనిస్వామి ఓనాడు నన్ను కరుణించారు.
కరుణామృత ధారల్ని కురిసే చూపుల్ని నాపైకి ప్రసరింపజేసారు. ఎందుకోసం వచ్చావు ? ఏమి కావాలని వచ్చావు? అని మృదువుగా అడిగారు. ప్రభూ! ధర్మ స్వరూపం తెలుసుకోవాలని ఆశగా వచ్చాను అభ్యర్ధనగా అన్నాను. - ధర్మకీర్తి! తెలుసుకోగానే సరా ఆచరించవద్దూ సరే అయితే చెబుతాను విను అని ఒకవింతైన చిరునవ్వునవ్వి ధర్మాలనూ ధర్మసూక్ష్మాలనూ ఎన్నింటినో ఉపదేశించాడు దత్తప్రభువు. అన్నింటినీ అవగతం చేసుకొని స్వామికి కృతజ్ఞతగా నమస్కరించి అనుమతి తీసికొని రాజధాని చేరుకున్నాను. ధర్మబద్ధంగా పరిపాలన సాగించాను. ఏ జన్మ పాపమో దుష్ట సాంగత్యానికిలోనై ధర్మం తప్పి పాపాలు మూటగట్టుకున్నాను. చివరకు మళ్ళీ దత్త స్వామి కృపవల్లనే మరణవేళ సత్సాంగత్యం లభించింది. యముడి ధర్మప్రభోదాలు వినగలిగాను. విష్ణుభక్తుణ్ని కాగలిగాను. సరే దత్త స్వామి చేసిన ధర్మప్రభోదాలు చెప్పనున్నావుగదా శ్రద్ధగా ఆలకించు. దత్తదేవుడు ఆ జన్మలో నన్ను సంభోదించి చెప్పిన ధర్మాలు యధాతధంగా వినిపిస్తాను.
No comments:
Post a Comment