Tuesday 12 September 2023

శ్రీదత్త పురాణము (256)

 


దత్తుడు ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మాలు


ధర్మకీర్తి మహారాజా ! వర్ణాశ్రమాచార యుతమైన సనాతన ధర్మం చెబుతున్నాను తెలుసుకో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు వర్ణాలువారు వున్నారు. వీరిలో మొదటి ముగ్గురికి ద్విజులు అని పేరు. తల్లి గర్భం నుండి పుట్టడం ఒక జన్మ. ఉపనయనం రెండవ జన్మ. కనుకనే వీరిని ద్విజులు అన్నారు. ఈ నాలుగు వర్ణాలవారూ స్వధర్మం తప్పకుండా జీవితాలు గడపాలి. వర్ణాశ్రమ ధర్మాలను ప్రజలు పాటించేటట్లుగా చెయ్యడం రాజుకి ప్రధమ కర్తవ్యం. స్వవర్ణ ధర్మాన్ని త్యజిస్తే వీరిని పాషండులు అంటారు. వీరిని కఠినంగా శిక్షించాలి. తనకు నిర్దేశించిన గుహ్యసూత్రాలను, కర్మలను, విప్రుడు తు.చ. తప్పకుండా పాటించాలి. అది కృతకృత్యత పాటించకపోతే పతితుడైనట్లు సర్వధర్మ బహిష్కుృతుడైనట్లు లెక్క. చతుర్వర్ణాలవారూ యుగధర్మాలను గమనించాలి. యధోచితంగా వాటికి లోబడి స్వధర్మాలను పరిష్కరించుకోవాలి. అలాగే స్మృతి విరోధం లేనంత వరకూ గ్రామాచారాలను పాటించాలి. త్రికరణ శుద్ధిగా ధర్మాచరణం చెయ్యాలి. స్వర్గ సంపాదం కాని ధర్మాన్ని, లోకం ఒప్పని ధర్మాన్ని వదిలి వెయ్యాలి.


ధర్మకీర్తి! సముద్ర యానం, కమండలు ధారణ, అన్యకన్యను వివాహం ఆడటం, దేవర న్యాయం చొప్పున వంశం నిలబెట్టుకోవడం (మరిదివల్ల పిల్లల్ని కనడం), మధుపర్క సందర్భంగా పశువధ చెయ్యడం, శ్రాద్ధాలలో మాంసం పెట్టడం, వానప్రస్తస్వీకారం, స్త్రీ పునర్వివాహం, దీర్ఘకాల బ్రహ్మచర్యం, నర - అశ్వమేధాలు చెయ్యడం, మహా ప్రస్థానగమనం, ఇవి ఈ కలియుగంలో పరిహరణీయాలని పెద్దలు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలవారు - వారి వారి దేశీయాచారాలను విధిగా పాటించాలి. లేదంటే పతితుడవుతాడు. సర్వధర్మ బహిష్కృతుడవుతాడు.


చాతుర్వర్ణాలవారికి విడివిడిగా ధర్మాలున్నాయి. వాటిని ఎరుక పరుస్తాను తెలుసుకో, బ్రాహ్మణుడు దాన ధర్మాలలో సాటి బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి. జీవన భృతికోసం యోగ్యులకు యాజ్ఞికం స్వీకరించవచ్చు. అధ్యాపనం చెయ్యవచ్చు. స్నానసంధ్యలు నిత్యమూ ఆచరించాలి. వేదాధ్యయనమూ చెయ్యాలి. ఆయుధ జీవి కాకూడదు. అగ్ని పరిగ్రహం నిత్యకృత్యం, పరద్రవ్యాన్ని మట్టితో సమంగా చూడాలి. ఎప్పుడూ లోకహితం కోరాలి. మృదువుగా సంభాషించాలి. ఋతుకాలంలోనే ధర్మపత్నితో సంగమించడం ప్రశస్తం. క్షత్రియుడు కూడా ఇలాగే ఎవ్వరికీ అహితం పలుకకూడదు. దానధర్మాలతో విప్రుల్ని సంతోషపెట్టాలి. వేదాధ్యయనం చెయ్యాలి. యజ్ఞాలతో దేవతల్ని ఆనందపరచాలి. ఆయుధ జీవి కావాలి. ధర్మబద్ధంగా భూమిని పరిపాలించాలి. దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసితీరాలి.


No comments:

Post a Comment