Thursday 28 September 2023

శ్రీదత్త పురాణము (271)

 


సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం వరకు ఒకే తిథి వుంటే దాన్ని అఖండ తిథి అంటారు అలాగాక ఒకటే తిథి మర్నాటికి కూడా వ్యాపిస్తే దాన్ని ఖండ తిథి అంటారు. క్షయాహంతో (తద్దినం నాడు) ఖండ తిథివస్తే అపరాల్లోనికి తిథి ఏ రోజున వుంటుందో ఆనాడే శ్రాద్ధ కర్మ చెయ్యాలి. రెండు అపరాల్లోలకూ అదే క్షయాహతిథి ఉన్నట్లయితే గడియల వృద్ధి క్షయాలనుబట్టి శ్రాద్ధ కర్మ ఎప్పుడో నిర్ణయించాలి. క్షయిస్తున్నట్లయితే పూర్వదిన అపరాష్ట్రంలోనూ, వృద్ధి పొందుతున్నట్లయితే పరదినాపరాహ్ణంలోనూ తద్దినం పెట్టాలి. క్షయాహ తిథి పూర్వదినా పరాహ్ణంలో రెండు ముహూర్తాలు వుండి మర్నాడు సాయంకాలం దాకా వుంటే పరదినా పరాహ్ణంలోనే శ్రాద్ధ విధి నిర్వహించాలని చాలా మంది నిర్ణయం. కొందరు పూర్వదినాపరాహ్ణంలోనే పెట్టాలంటారుగానీ అది అధిక సంఖ్యాకులకు సమ్మతంగా కనిపించటం లేదు.  


శ్రాద్ధానికి నియంత్రితులైన విప్రులు ఒకరినొకరు తాకకూడదు. ఒక వేళ తాకితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా విశుద్ధి పొందాక తత్కర్త వారి ఆజ్ఞను అనుసరించి మళ్ళీ వారిని శ్రాద్ధానికి నియంత్రించాలి. వైశ్వేదేవస్థానానికి ఇద్దరు, పితృదేవతల స్థానానికి ముగ్గురు బ్రహ్మణుల్ని నియంత్రించుకోవాలి. లేదంటే దానికొకరూ దీనికొకరూ నియుక్తులు కావాలి. బ్రాహ్మణులకి చతురస్యం క్షత్రియులకి త్రికోణాకారం వైశ్యులకి వర్తులం కర్తవ్యం. శూద్రులకి అభ్యుక్షణం అవసరం.


అభావం వస్తే అంటే బ్రాహ్మణులు దొరక్కపోతే సోదరుల్నిగానీ, పుత్రుల్నిగానీ, తనకు తానే గానీ, నియంత్రించుకోవచ్చు. అంతేగానీ వేదవర్జితుడైన విప్రుణ్ని మాత్రం నియంత్రించరాదు. బ్రాహ్మణుల పాదాలు కడిగి వాళ్ళు కూర్చుని ఆచమించాక నారాయణ స్మరణ చేస్తూ వారిని యధావిధిగా సమంత్రకంగా అర్చించాలి. ఆపైన బ్రాహ్మణుల మధ్య నుండి ద్వారదేశం వైపు 'అపహతా' అనే మంత్రోచ్ఛారణతో శ్రాద్ధకర్త నువ్వులు విసరాలి.


బియ్యమూ దర్భలతో విశ్వేదేవులకు, నువ్వులు దర్భలతో పితృదేవతలకూ అక్షయ్యాసనార్చనలు చెయ్యాలి. అక్షయ్యాసన సమర్పణలో షష్ఠీ విభక్తినీ, ఆ వాహనలో ద్వితీయావిభక్తినీ, అన్నదానంలో చతుర్థి విభక్తినీ మిగతా సందర్భాల్లో సంబుద్ధిని పితృదేవతల నామధేయాలకు ఉపయోగించాలి.


No comments:

Post a Comment