Wednesday 27 September 2023

శ్రీదత్త పురాణము (270)


 

శ్రాద్ధ నియంత్రితులైన బ్రాహ్మణులకి కూడా ఇవే నియమాలు. వాళ్ళు వీటిని పాటించపోతే బ్రహ్మహత్యా మహాపాతకులవుతారు. శ్రోత్రియుడు, విష్ణుతత్పరుడు, స్వాచారనిరతుడు ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్ధ విశారదుడు, త్రిముధుత్రి సుపక్షజ్ఞుడు (ఆపస్తంభశాఖా సూక్తిద్వయం పార్ధం జానాతి యః - అని పద మంజరీటీక. ధర్మశాస్త్రజ్ఞుడు అని తాత్పర్యం) సర్వభూతదయాపరుడు. దేవపూజారతుడు, స్మృతి తత్వ విశారదుడు, వేదాంత తత్వసంపన్నుడు, సర్వలోకహితాకారెడ్డి, కృతజ్ఞుడు, గుణపంపన్నుడు, గురుశుశ్రూషణాపరుడు, పరోపదేశ నిరతుడు, అధ్యాపనతత్పరుడు, అయిన విప్రుణ్ని ఎంచుకొని శ్రాద్ధానికి నియంత్రించుకోవాలి.


శ్రాద్ధవిమంత్రణికి పనికిరాని వారు ఎవరంటే- న్యూనావయవులు, అధికావయవులు, కాయస్థులు (లేఖన జీవులు), రోగగ్రస్తులు, కుష్ఠి, కునఖి, లంబకర్ణుడు, క్షతావ్రతుడు, నక్షత్ర పాఠజీవి, శవదాహకుడు, కువాది పరివేత్త (అన్నగారికంటే ముందు తానై పెళ్ళి చేసుకున్నవాడు), దేవలకుడు, ఖలుడు, నిందకుడు, అమర్షణుడు, ధూర్తుడు, గ్రామ యాజకుడు, అసచ్ఛాస్రాభినిరతుడు, పరాన్నరతుడు, వృషలీపతి, వృషలీపుత్రుడు, కుండుడు, గోళకుడు, ఆయాజ్యి యాజికుడు (అర్హత లేనివారితో క్రతువులు చేయించేవాడు) దంభాచారుడు, వృధాముండుడు, అన్యస్త్రీ ధనతత్పరుడు, విష్ణుభక్తి విహీనుడు, శివభక్తిదూరుడు, వేద విక్రయి, వ్రతవిక్రయి, గాయకులు, కావ్యకర్తలు, వైద్యులు, శస్త్రోపజీవులు, వేదనిందకులు, దైవనిందకులు, రాజసేవకులు, కృతఘ్నులు, జూదరులు, నిత్యప్రయాణులు, సర్వద్యూతపరాయణులు, మిధ్యాభివాదులు, గ్రామారణ్య ప్రవాహకులు, అతికాముకులు, వాంతకులు, రసవిక్రయులు, కూటసాక్షులు వీరు పనికిరారు. కుతపకాలంలో తద్దినం పెట్టాలి. అది పితృదేవతలకు అక్షయమవుతుంది. పగటి సమయాన్ని పదిహేను భాగాలు చేస్తే అందులో ఎనిమిదో భాగం కుతపకాలం అవుతుంది. అప్పటికి రవికిరణాల వేడి కొంతమందగిస్తుంది.


సృష్టికర్త పితృదేవతలకు ఇచ్చిన కాలం అపరాహ్ణమే కనుక ఆ సమయంలోనే వారికి పిండ ప్రదానాదికం చెయ్యాలి. అకాలంలో ఇచ్చిన కవ్యం వారికి అందదు. రాక్షసులు దాన్ని కాజేస్తారు. కనుక దాన్ని రాక్షస కవ్యప్రధానం అంటారు. అంచేత కుతపకాలానికి బాగా ముందేగానీ సాయంకాలంగానీ ఇచ్చే కవ్యం రాక్షసమవుతుంది. తత్కర్త తద్భోక్త నరకానికి పోతారు.  


No comments:

Post a Comment