Saturday, 9 September 2023

శ్రీదత్త పురాణము (253)

 


దూతలారా ! మీకందరకూ ఒక హితం చెబుతున్నాను. శ్రద్ధగా వినండి. ధర్మపరాయుణులై జీవితాలు గడిపి అసువులు బాసిన వారిని ఎవరినీ నా దగ్గరకు తేకండి. విష్ణుభక్తి పరాయణులనూ, వారి బంధుమిత్రులను, దైవంపట్ల కృతజ్ఞతా భావంతో జీవించేవారిని ఏకాదశి వ్రత పరుల్నీ జితేంద్రియుల్ని నారాయణా ! అచ్యుతా! అని భవార్తి - శమనం కోసం హరినామస్మరణ బిడియ పడకుండా బిగ్గరగా చేసే వారినీ విడిచిపెట్టండి. వీళ్ళజోలికి మీరు వెళ్ళవద్దు. దూరం తొలగి వచ్చెయ్యండి. వీళ్ళకి నేను వేసే శిక్ష ఏమీలేదు.


స్వాచారపరులూ, గురుసేవకులూ, సత్పాత్ర దాన నిరతులూ, పాషండ సాంగత్యదూరులూ, సత్సంగలోలుపులు, హరిహర సమబుద్ధిమంతులు, ఉపకార శీలురు, బ్రాహ్మణభక్తి కలవారు వీరిజోలికి మీరు పోవద్దు. వీరిని ఎప్పుడూ - నా సన్నిధికి తేవద్దు.


తల్లితండ్రుల్ని ఏడిపించుకొని తినేవాళ్ళని, లోకకంటకుల్నీ, బ్రహ్మద్వేషుల్ని, దేవుడి సొమ్ము దిగమ్రింగేవాళ్ళని, జననాశకారుల్ని - ఇలాంటి అపరాధుల్ని పట్టితీసుకురండి. నా సమక్షంలో నిలబెట్టండి తగిన శిక్షలు విధిస్తాను. ఏకాదశీ వ్రతపరాజ్ఞ్ముఖుల్ని, ఉగ్రశీలురూ, లోకాపవాదనిరతులూ, పరదూషణపరాయణులూ, గ్రామ వినాశకులూ, ఉత్తముల్ని నిందించేవారూ బ్రాహ్మణుడి సొమ్ము కాజేసిన వారూ, వీళ్ళని బంధించి తీసికొనిరండి వీళ్ళతో మనకు - పని. నోరారా హరినామం జపించని వారూ, హరికి నమస్కరించనివారూ, హరికోవెలలకు వెళ్ళని వారూ - వీళ్ళని వెదికి వెదికి పట్టుకుని రండి. ఇటువంటి మహాపాప ప్రశస్తులు మనకు కావాలి.


No comments:

Post a Comment