Friday, 29 September 2023

శ్రీదత్త పురాణము (272)

 


దర్భల మీద పాత్రలుంచి శంనో దేవీతి మంత్రంతో ఉదకం నింపి యవోసి మంత్రంతో బియ్యం వేసి గంధపుష్పాలతో అర్చించి విశ్వే దేవాస మంత్రంతో విశ్వేదేవతలను అవాహన చెయ్యాలి. యాదివ్యా మంత్రంతో అర్ఘ్యమివ్వాలి. గంధ, వస్త్ర, భూషణ, పత్ర, పుష్ప, ధూపదీపాలతో పూజించాలి.


విశ్వేదేవుల అనుమతి తీసుకొని పితృదేవతలను అర్చించాలి. తిలదర్భలతో ఆసనం సమర్పించాక (దర్భల మీద) మూడు పాత్రలుంచి శంనోదేవీ మంత్రంతో నీళ్ళునింపి తిలోసి మంత్రంతో నువ్వులు వేసి ఉశంతీతి మంత్రంతో పితృదేవతలను ఆవాహనచేసి “యాదివ్యా”తో ఆర్ఘ్యమివ్వాలి. గంధ పత్ర వస్త్రభూషణ పుష్పధూప దీపాలతో యధాశక్తిగా అర్చించాలి. అటుపైన ఉన్న గ్రాసాన్ని అగ్నౌ కరిషేన మంత్రంతో అగ్నికరణం చెయ్యాలి. ఇక్కడ బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఈ హోమ సన్నివేశంలో అగ్ని బాహుళ్యం, విధాన బాహుళ్యం, నియమ బాహుళ్యం, సాంప్రదాయ బాహుళ్యం ఉంది గుర్తించాలి. తరువాత నియంత్రిత బ్రాహ్మణులు వాగ్యతులై భోజనాలు చెయ్యాలి. పెద్దగా నవ్వుతూ మాట్లాడుతూ పాకాదుల్ని ప్రశంసిస్తూ భుజిస్తే ఆ హవిస్సు రాక్షసమైపోతుంది. కనుక కావలసింది అడిగి వేయించుకోవటం కన్నా మాట్లాడకుండా ధృతభాజనులై భుజించాలి. అంటే భోజన పాత్ర (అరటి ఆకు) మీద ఒక వేలుంచి భోజనం చెయ్యాలి. అలా ఒక్కసారి అయినా ఉంచకుండా భుజిస్తే ఆ భోక్త శ్రాద్ధం చెడగొట్టిన పాపానికి ఒడిగట్టి నరకానికిపోతాడు.


భోజనాలు చేస్తున్నప్పుడు నియంత్రిత బ్రాహ్మణులు ఒకరినొకరు స్పృశించకూడదు. పొరపాటున తాకితే ఆ అన్నాన్ని వదలకూడదు. భుజించాలి. ప్రాయశ్చిత్తంగా నూట ఎనిమిదిమార్లు గాయత్రి జపించాలి. భోక్తలు భుజిస్తున్నంత సేపూ తత్కర్త నారాయణస్మరణం చేస్తూనో పురుషసూక్తం పఠిస్తూనో నచికేతత్రయం జపిస్తూనో ఇంకా ఇటువంటివాటితో కాలక్షేపం చెయ్యాలి. భోక్తలు లేచాక పిండప్రధానం చెయ్యాలి. పిండస్థల శుద్ధి జరపాలి. శ్రాద్ధంలో అగ్నౌకరణం బ్రాహ్మణ భోజనం పిండప్రధానం- ఇవి మూడు ముఖ్యమైనవి. బ్రాహ్మణులు భుజించిన విస్తళ్ళను కదిలించిన తరువాతనే స్వస్తి వాచనం జరపాలి. అలాకాకుండా ముందు జరిపితే అతడి పితృదేవతలు సంవత్సరం పాటు ఉచ్ఛిష్ట భోజనులు అవుతారు.


No comments:

Post a Comment