Sunday 10 September 2023

శ్రీదత్త పురాణము (254)

 


తండ్రీ ! యమధర్మరాజు తన భటులకు జారీ చేసిన ఆజ్ఞలను విన్నాను. నాలో గొప్ప అనుతాపం బయలుదేరింది. చేసిన పాపకృత్యాలన్నీ కళ్ళఎదుట మెదిలి పశ్చాత్తాపంజెందాను. అపుకోలేని దుఃఖంతో వలవలా ఏడ్చాను. యమధర్మరాజు ఓదార్చాడు. దుఃఖపడకు ఏకాదశీ వ్రతంవల్లా ఈ అనుతాపం వల్లా సద్ధర్మశ్రవణంవల్లా నువ్వు పాపరహితుడవేకాదు. మహాపుణ్యాత్ముడవయ్యావు అంటూండగానే నాకు నారాయణ రూపం వచ్చేసింది. సహస్ర - సూర్యసంకాశుణ్ని అయిపోయాను. యమధర్మరాజు మళ్ళీనాకు సాష్టాంగపడ్డాడు. యమదూతలందరూ సాగిలపడి మ్రొక్కారు. అంతలోకి నూరు దివ్య విమానాలు వచ్చాయి. ఒకదానిలో కూర్చోపెట్టి వైకుంఠానికి సాగనంపారు. అక్కడ దివ్యభోగాలు అనుభవిస్తూ దివ్య విమానాల్లో సంచరిస్తూ కొన్నివేల సంవత్సరాలు గడిపాను. అటుపైన ఇంద్రలోకానికి పంపారు. అక్కడా అందరి దేవతల నమస్కారాలు అందుకుంటూ ఇంద్రభోగాలు అనుభవిస్తూ మరికొన్ని వేలసంవత్సరాలు ఆనందించి ఏకాదశి పుణ్యఫలం నిల్వలు కరిగిపోవడంతో భూగోళానికి తిరిగి వచ్చాను. మీ యింట బిడ్డనై జన్మించాను. జాతిస్మరుణ్ని కనుక పూర్వజన్మ వృత్తాంతం గుర్తుంది. యమధర్మరాజు ప్రభోదించిన మేరకు ఆ బాల్యమూ హరిభక్తిని ఆచరిస్తున్నాను. ఏకదశీ వ్రతాలు ఉపవాసాలతో జాగరణలు చేస్తున్నాను. అనుకోకుండా ఉపవాసం వుండి జాగారం చేస్తేనే ఇంత ఫలం నాకు దక్కిందంటే ఇక కావాలనీ భక్తితో ఏకాదశీ వ్రతం చేసేవారికి దక్కేఫలం గురించి ఏమి చెప్పను, ఎంతని చెప్పను.


అంచేత తండ్రీ ! అప్పటి నుండి ఈ నేను ఏకాదశీ వ్రతాలు చేస్తున్నాను. అహరహమూ విష్ణు పూజలు చేస్తున్నాను. నా ఆకాంక్ష - పరమపద ప్రాప్తి - పరమానందదాయకమైన ఆ విష్ణులోకం చేరుకోవాలంటే భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రతం చెయ్యడ మొక్కటే సులువైన మార్గం. ఈ కధ విన్నవారు చదివినవారూ కూడా సర్వపాప విముక్తులై జన్మాంతంలో విష్ణులోకం చేరుకుంటారు.


నాయనా భద్రశీలా ! నిన్ను పుత్రుడిగా పొంది మా జన్మలు ధన్యమయ్యాయి. మా వంశం తరించింది. నీ వల్ల హరి భక్తి మహిమ తెలుసుకోగలిగాను. ఏకాదశీ వ్రత మహిమ గుర్తించగలిగాను. తండ్రి నన్న మాటేగానీ నాకు తెలీని రహస్యాలు ఎన్నో బోధించావు. నిజానికి నువ్వే నా తండ్రివి, నా గురువువి. నాయనా ! ధర్మకీర్తిగా నువ్వు రాజ్యం చేస్తున్న రోజుల్లో దత్తస్వామి శిక్షణపొందాను అన్నావు. వేదశాస్త్రాలు, ధర్మాధర్మాలు ఆచారవ్యవహారాలు, ఆ యోగీంద్రుడు నీకు బోధించాడన్నావు. ఆ బోధలు వినాలని వుంది. జాతిస్మరుడువి కనుక నీకు అన్ని విషయాలు గుర్తుండి వుంటాయి. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని క్లుప్తంగానైనా ఎరుకపరిస్తే ధన్యుణ్ని అవుతాను.


No comments:

Post a Comment