Monday 4 September 2023

శ్రీదత్త పురాణము (248)

 


అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఇందుమత్యాయు దంపతులకు శుభవార్త అందించింది. మీ కొడుకు కోడలు దివ్యరథం మీద వస్తున్నారని ఉప్పు అందించింది. అంతటి శుభవార్త అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహూకరించాడు ఆయువు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్నీ నారద వచనాలనూ గుర్తు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఇన్ని సంవత్సరాలు దత్తారాధన ఇప్పటికి ఫలిస్తోందని దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అంతలోకి దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతల కోలాహలం. గంధర్వాప్సరసల గీతనృత్యవాద్య ఘోష, మందార పుష్పవృష్టి, దేవవర్చస్వీ మహాబాహువూ నహుషుడూ ధర్మపత్నీ సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లి తండ్రులకు పాదాభివందనం చేశారు. తండ్రీ కొడుకులూ అత్తా కోడళ్ళూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. 


రాజధానిలో వీధివీధికీ ఇంటింటికీ ఈ శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తాను రూపుగట్టింది. అది రాజ్యమంతటా గుబాళించింది.


తండ్రి! కుంజలా వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్థనుడు చెప్పిన దత్తమహిమ ఇది. నహుషవృత్తాంతమిది. ఇది చెప్పి గోవిందుడు అదృశ్యుడయ్యాడు. ఈ రోజు నేను కన్నదీ విన్నదీ వింత ఇది - అని ముగించాడు పక్షియువకుడు కపింజలుడు.


సూతమహర్షీ! మహాప్రాజ్ఞా! మా జన్మలు చరితార్థమయ్యాయి. మా స్వాధ్యాయ తపోయజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రమూ మధురాతిమధురమూ అయిన దత్తకథామృతాన్ని శృతిపుటాలతో ఆస్వాదించగలిగాము. జన్మజరామృత్యువేదనలను మరచిపోగలము. విన్నకొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇక చాలు అనిపించడంలేదు. అంచేత ఓ మహాబుద్ధీ! ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలనూ వ్రతదాన విధులనూ పాప ప్రాయశ్చిత్తాలకు కాలనిర్ణయాలనూ శ్రాద్ధాదిక కర్మవిధానాలనూ గంగామాహాత్మ్యాదులనూ మాకు వినిపించి సంతృప్తి పరచవలసిందిగా కోరుతున్నాం.


శౌనకాది మునులారా ! మీరు అడిగినట్టే దీపకుడు సైతం తన గురువు గారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతడికి బోధించిన ఈ అంశాలను మీరు ఆలకించండి.


వత్సా ! దీపకా దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను సనత్కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నీకు నేను చెబుతున్నాను. శ్రద్ధగా విని గ్రహించు. విష్ణుభక్తి పరాయణుడైన నారదుడు మేరుశృంగంమీద సనత్కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు.


No comments:

Post a Comment