యుద్ధాహ్వాన సూచకంగా శంఖం పూరించాడు. ఆ ధ్వనికి మహోదరనగరం కంపించింది. హుండుడు కళవళ పడ్డాడు. ఎవడో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు ఆయు పుత్రుడు, వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలిట, నీకు మరణం తప్పదట - తిరిగివచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండుడు ఉలిక్కిపడ్డాడు. ఆయు పుత్రుణ్ని నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకుని తినేశాను గదా ! మరి వీడెక్కడివాడు ? అనుకుంటూనే భార్యను మేకలను సూదకుణ్నీ పిలిచి గద్దించి ఆరాతీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడు దగ్గర సకల విద్యలూ నేర్చి ఈ ఆయుపుత్రుడు నామీదకి వచ్చాడన్నమాట. హుండుడికి అర్థం అయ్యింది. తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించనప్పుడు అన్నీ అనుకూలించనట్టే ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే జరగవలసిందేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండిధైర్యంతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ని ఎదిరించాడు.
వశిష్టుడు నేర్చిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శాస్త్రాలు, సుదర్శన చక్రంలా పయనించగలిగిన దివ్యరథం - వీటితో నహుషుడు ఒక్కడే అయినా మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికెలో మట్టుపెట్టాడు. హుండాసురుడితో తలబడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్చాదితుడైన బాలభానుడిలా కనిపించాడు. దేవతలూ ఋసులూ నిసన్న వదనులయ్యారు. నహుషుడొక్కసారి గురుదేవుల్ని తలుచుకున్నాడు. విశిష్టాస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి హుండాసురుని రెండు బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోథంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులుకడుతున్నా లక్ష్యపెట్టక నహుషుణ్ని కబళించాలని విరుచుకుపడ్డాడు. ముందుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణమాలస్యం చెయ్యకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రీశక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్ఞ్యలన సన్నిభంగా వెళ్ళి వాడి గుండెకు తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగేట్టు భీషణంగా మూలిగి మెలికలు తిరుగుతూ హుండుడు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకూ, కొండలకూ పలాయనం చిత్తగించారు. దేవతలూ ఋషులూ మునులూ హర్షధ్వానాలు చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగనలు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నరాదులు బృందగానాలు చేశారు.
అశోక సుందరిని వెంటబెట్టుకొని రంభ వచ్చింది. తపఃకృశాంగి, కారాగారవాస పరిప్రశాంత, అశోకసుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకుంది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని, నీకోసం నే చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది - అంటూ చేరువకు వచ్చి పాదాభివందనం చేసింది. కృశాంగీ ! నా కోసమే నువ్వు తపస్సు చేస్తున్నావని విన్నాను. ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడతాను రండి, మీరిద్దరూ రథం అధిరోహించండి. వశిష్టాశ్రమానికి వెడదాం అన్నాడు నహుషుడు. అన్నట్టుగానే రధం కదిలింది. క్షణంలో వశిష్టాశ్రమాన నిలిచింది. ముగ్గురూ దిగి వెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగ పడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి నీరగాధ మనస్సుకి గిలిగింతలు పెట్టింది. కౌగలించుకుని వత్సా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తానన్నాడు. ముహుర్తం నిశ్చయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుంటే వైదికంగా ఆశోకసుందరీ నహుషులకు సకలదేవతలూ సాక్షిగా వివాహం జరిపించాడు. సదస్యమయ్యింది. పసుపుబట్టలతోనే వెళ్ళి తల్లితండ్రులకు నమస్కరించి ఆశీస్సులు పొంది ఆనందింపజెయ్యండి అని చెప్పి నవదంపతులను అదే రథంమీద రాజధానికి పంపించాడు.
No comments:
Post a Comment