Wednesday 6 September 2023

శ్రీదత్త పురాణము (250)

 


ఏకాదశీ జాగరణ తరువాత ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తికి పుష్పమంటపం నిర్మించాలి. దీనికి సమర్పించే ఒక్కొక్క పువ్వూ ఒక్కొక్క అశ్వమేధ ఫలం ఇస్తుంది. ఇలాంటి విశ్వాసాలతో విశుద్ధ భావాలతో ఏకాదశి ఉపవాసం - జాగరణం చేస్తే నిమిష నిమిషానికీ చేకూరే పుణ్యం తీర్ధకోటికి సాటి వస్తుంది. ద్వాదశినాటి ఉదయం స్నానసంధ్యాదులు ముగించి షోడశోపచారాలతో శ్రీహరిని అర్చించాలి. ఏకాదశినాడు స్వామికి పంచామృతస్నానం, ద్వాదశి నాడు క్షీరాభిషేకం జరపాలి. ఈ రెండూ చేసిన భక్తుడు హరి సారూప్యం పొందుతాడు. కేశవా! అజ్ఞాన తిమిరాంధుణ్ని నేను ఈ వ్రతంలో నువ్వు ప్రసన్నుడవై సుముఖడవై జ్ఞాన దృష్టిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ నారాయణుడికి సాగిలి మ్రొక్కాలి.


చక్రికి ఇలా విజ్ఞాపన చేసి ద్వాదశినాటి మధ్యాహ్నం బ్రాహ్మణ సంతర్పణ జరపాలి. భూరిదక్షిణలతో తాంబూల నూతన వస్త్రప్రదానాలతో సంతృప్తి పరచాలి. అటుపైని తాను తనకు నిత్య విధులైన పంచయజ్ఞాలు ముగించి బంధుమిత్రులతో కలిసి మౌనంగా నారాయణ పరాయణుడై భుజించాలి. ఇలా చేసిన హరి భక్తుడికి ఏకాదశీ వ్రత ఫలంగా పునరావృత్తి రహితమైన విష్ణులోక నివాసం లభించి తీరుతుంది.


ఈ వ్రత దీక్షతో ఉన్నంతసేపూ - వృషులులతో వేదనిందకులతో వృషలీపతులతో అయాజ్యయాజకులతో కుండాశులతో (అక్రమసంతానం) గోళకులతో (విధవాసంతానం) దేవలకాశులతో (స్థావర పూజలతో జీవించేవాళ్ళు) భిషక్కులతో కావ్యకర్తలతో దేవద్విజ విరోధులతో పరాన్న లోలుపులతో పరస్త్రీ నిరతులతో మాట్లాడకూడదు. మర్యాదకోసం మాటమాత్రంగానైనా పలకరించకూడదు. (వాజ్ఞ్మత్రేణాపి వార్చయేత్). ఇట్లాంటి నియమాలు పాటించి నిగ్రహం కలవాడై సర్వహితం కోరుతూ ఏకాదశీ వ్రతం పరిసమాప్తం చేస్తే పరమపదం కైవసమవుతుంది. సారాంశంగా ఒక్కమాట - గంగకు సాటివచ్చే తీర్ధం లేదు. తల్లికి సాటివచ్చే గురువులేడు, శ్రీహరికి సాటివచ్చే దేవదేవుడు లేడు, (ఏకాదశీ) ఉపవాసానికి సాటివచ్చే తపస్సులేదు. వేద సమమైన శాస్త్రం, శాంతిసమమైన సుఖం, సత్యసమయమైన వెలుగు, ఉపనాస సమమైన తపస్సులేవు. తల్లికి సరితూగే కర్పరి, కీర్తికి సరితూగే ధనం, జ్ఞానానికి సరితూగే భావం, ఉపవాసానికి సరితూగే తపస్సు లేవంటే లేవు.


నాస్తి గంగాసమం తీర్థం వాస్తే మాతృసమో గురుః|

నాస్తి విష్ణుసమో దేవః తపో నానశనాత్పరమ్ || 

నాస్తి వేదసమం శాస్త్రం నాస్తి శాంతిసమం దుఖం | 

నాస్తి సత్యసమం జ్యోతిః తపోనావశవాత్పరమ్ || 

నాస్తి క్షమాసమా మాతా నాస్తికీర్తి సమం ధనమ్ | 

నాస్తి జ్ఞానసమో భావః తపోనానశనాత్పరమ్ ||


No comments:

Post a Comment