Monday, 25 September 2023

శ్రీదత్త పురాణము (268)

 


శంఖ చక్ర గదాపాణియైన నారాయణున్ని నిత్యమూ ధ్యానిస్తూ వుండాలి. చంద్రాయణా దికవ్రతాలు ఆచరించాలి. శీతావాదుల్ని ఓర్చుకోవాలి. అగ్నికార్యం విడువరాదు.


వానప్రస్థం సాగిస్తుండగా అన్ని వస్తువుల మీదా ఒక్కొక్కటిగా మనస్సులో వైరాగ్యం పుట్టుకవస్తుంది. తనంత తాను అది ఏర్పడినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి. అలాకాకుండా (ఏదో కారణంగా హఠాత్తుగా సన్యాసం స్వీకరించినందువల్ల లేదా) మరోలా స్వీకరించిన సన్యాసం వల్ల మనిషి కడపటికి పతితుడూ భ్రష్టుడూ అవుతాడు.


సన్యాసి ఎప్పుడూ- వేదాంతాభ్యాస నిరతుడై శాంతుడై దాంతుడై జితేంద్రియుడై నిర్ద్వంద్యుడై నిరహంకారుడై నిర్మముడై కాలం గడపాలి. కామక్రోధాదుల్ని వదిలించుకున్నవాడై శమ దమాదిగుణాలకు ఆటపట్టుగా ఉండాలి. (ఇంచుమించు) నగ్నంగా కానీ చిరిగిపోయిన పాతగుడ్డ గోచీతోగానీ కాలక్షేపం చెయ్యాలి. శత్రుమిత్రుల పట్లా మానవమానాల పట్ల సమబుద్ధితో వుండాలి. గ్రామాల్లో అయితే ఏకరాత్రం. పట్టణాల్లో అయితే మూడురాత్రులూ నివసించవచ్చు. నిత్యమూ ఒక ఇంటిలో భిక్ష చెయ్యకూడదు. భిక్షాటనతో నాలుగు మెతుకులు సంపాదించుకోవటం ఉత్తమం. వివాదరహితులైన వివ్రుల ఇళ్ళల్లోనే బిక్షాటన చెయ్యాలి. నిత్యం త్రిషవణ స్నానాలు చేస్తూ నారాయణ ధ్యానపరాయణుడై ప్రణవాన్ని జపిస్తూ ప్రణవసహితంగా నారాయణమ్మరణ) విజితేంద్రియుడై వియతాత్ముడై జీవితం గడపాలి, ఒకే ఇంటనిత్యమూ భుజిస్తే లేదా ఒకే రకం ఆహారాన్ని రోజూ తీసుకుంటే యతిశ్వరుడు సైతం ఒక్కొక్కప్పుడు రాగలంపటుడవుతావు. నూరుప్రాయచ్ఛిత్తాలు చేసుకున్నా అటువంటి వాడికి నిష్కృతిలేదు.


సన్యాసి తన ఆశ్రమ చిహ్నాలను కావాలని ఏనాడూ కప్పిపుచ్చుకోకూడదు. అలా చేసినవానికి ప్రాయచ్ఛిత్తమే లేదు.


ఆత్మవిచారంతో నారాయణ నామస్మరణతో నిర్ద్వంద్వ నిర్మలశాంత మాయాతీత అమత్సర అన్యయ పరిపూర్ణ సదా ఆనందైక విగ్రహ జ్ఞానస్వరూప అమలసనాతన అవికార అనాద్యంత జగచైతన్యకారణ నిర్గుణ పరంజ్యోతిర్మయ నామధేయాలతో విరాజిల్లే ఆ పరాత్పరుణ్ని ఆ పరమాత్మను ధ్యానిస్తూ సన్యాసి కాలం గడపాలి.


No comments:

Post a Comment