గుహ్య సూత్రోక్త ప్రకారంగా 3-5-6-7-8 సంవత్సరాల వయస్సులో బిడ్డడికి చౌల సంస్కారం చెయ్యాలి. దైవయోగం వల్ల ఈ గర్భాదానాది సంస్కారాలకు కాలాతిక్రమణం జరిగితే పాదకృచ్ఛ ప్రాయశ్చిత్తం చౌలానికి కాలాతి క్రమణం జరిగితే అర్థకృచ్ఛ ప్రాయశ్చిత్తం చెయ్యాలి.
గర్భాష్టమంలో గానీ ఎనిమిదేళ్ళ వయస్సున గానీ పుత్రుడికి ఉపనయనం చెయ్యాలి. అధమ పక్షం పదహారేళ్ళ లోపులో జందెం వెయ్యాలి. క్షత్రియుడికి పదకొండో యేట ప్రశస్తం. అధను పక్షం ఇరవైరెండేళ్ళు దాటేలోగా, వైశ్యుడికి గర్భద్వాదశంలో ఉపనయనం ఉత్తమపద్ధతి. అధము పక్షం ఇరవైనాలుగేళ్ళ వయస్సు దాటేలోగా చెయ్యడం మంచిది. బ్రాహ్మణవటువు కాషాయాంబరం క్షత్రియ వటువు మాంజిప్టెంబరం, వైశ్యవటువు హరిద్రాంబరంధరించాలి.
ఉపనయనానంతరం ఈ వటువులు గురుకులంలో నివసిస్తూ గురుశుశ్రూష చేస్తూ వేదాధ్యయనం సాగించాలి. తెల్లవారు జామునే స్నానం చెయ్యడం గురువు గారికి సమిత్కుశ ఫలాదుల్ని అడవి నుండి తెచ్చి అందించడం వీరి నిత్యకృత్యం, యజ్ఞోపవీత ఆజిన దండాలను ధరించి ఉండాలి. వీటిలో ఏది ఎప్పుడు తెగినా, విరిగినా, వెంటనే సమంత్రకంగా కొత్తది ధరించి పాతదాన్ని వీటిలో వదిలిపెట్టాలి. బ్రహ్మచారులు భిక్షాన్నంతోనే జీవించాలి. శ్రోత్రియుల ఇళ్ళల్లోనే బిక్షాటన చెయ్యాలి, భవతి భిక్షాందేహి అని బ్రాహ్మణవటవు, భిక్షాం భవతి దేహి అని క్షత్రియవటువు, భిక్షాందేహి భవతి అని వైశ్యవటువు భిక్షను అభ్యర్ధించాలి. సంబుద్ధి ఆది - మధ్య అంతాలలో క్రమంగా రావాలి. ఉభయ సంధ్యల్లో అగ్ని కార్యం చెయ్యాలి. అటుపైన భిక్షాన్నం తెచ్చుకొని గురువు గారికి నివేదించి వారి అనుజ్ఞతో మౌనంగా భుజించాలి. మధువు - స్త్రీ - మాంసం లవణం - తాంబూలం - దంత ధావనం - ఎంగిలి తినడం - (ఉచ్ఛిష్ట భోజనం) - పగటి నిద్ర - (దివాస్వాపం) - గొడుగు - పాదుకలు - చందన గంధాది పరిమళద్రవ్యాలు - జలకేళి - ద్యూతం - గీతనృత్యవాద్యాదులు - పరివాదం- ఉపతాపం - విప్రలాపం - అంజనం- పాషండ జన సంయోగం - శూద్ర సంగం - వీటిని పరిహరించాలి.
No comments:
Post a Comment