Saturday, 16 September 2023

శ్రీదత్త పురాణము (259)

 


నమస్కారవిధి


జ్ఞాన తపో వయో వృద్ధులకు బ్రహ్మచారి అభివాదన శీలియై ఉండాలి. వేదశాస్త్రాదుల్ని ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించే గురువుకు ముందుగా నమస్కరించాలి. బ్రాహ్మణుడు తన పేరుకి చివర శర్మపదం తగిలించి గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి. క్షత్రియాదులకి ఎప్పుడూ నమస్కరించకూడదు. నాస్తికుడికీ భిన్నమర్యాదుడికీ (బహుశ మతాంతరుడు) కృతఘ్నుడికి గ్రామయాజకుడికీ చోరుడికీ జూదగాడికి (కితపుడు) ఉన్మత్తుడికీ, శర-ధూర్త-పాషండులకీ, అశుచికీ నమస్కరించకూడదు. అభ్యంగనస్నానం చేస్తున్న వాడికీ, జపం చేస్తున్నవాడికీ, నక్షత్రజీవికీ, పరుగెత్తుతున్నవాడికీ, పాపాత్ముడికీ, స్నానం చెయ్యని వాడికీ, సమత్కు శాదులు సేకరిస్తున్నవాడికీ, దండలు గుచ్చుతున్నవాడికి, నీళ్ళకుండ మోసి తెస్తున్నవాడికి, భోజనం చేస్తున్న వాడికి, వివాదశీలికి, దిగంబరుడికీ, వాంతి చేసుకుంటున్న వాడికీ, నీళ్ళమధ్యలో ఉన్నవాడికీ, భిక్షాన్నధారికీ, విద్రిస్తున్న వ్యక్తికీ నమస్కరించకూడదు. భర్తను - చంపిన దానికి, పుష్పవతికీ, జారిణికీ, బాలింతకు, గర్భపాతినికి, కృతఘ్నికీ, చండిక్కీ (కోపిష్ఠి) - నమస్కరించకూడదు. సభలో యజ్ఞశాలలో దేవాలయంలో ఎవరు ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేస్తే చేసినవారి పురాకృత పుణ్యమంతా నశించిపోతుంది.


పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్ధంలో స్వాధ్యాయ సమయంలో ఎవరూ ఎవరికీ ప్రత్యేకంగా నమస్కరించకూడదు. శ్రాద్ధం వ్రతం దానం దేవతాభ్యర్చనం యజ్ఞం తర్పణం వీటిని చేస్తున్న వ్యక్తికి చేస్తున్న వేళ నమస్కరించకూడదు. నువ్వు ఎవరికైనా నమస్కరిస్తే అతడు ప్రతి నమస్కారం చెయ్యకపోతే మరింక ఆ వ్యక్తికి ఎప్పుడూ నమస్కరించకూడదని కఠిన నియమం. కనక నమస్కరించదగిన వారికే అయినా సమయం సందర్భం చూసి మరీ నమస్కరించాలి.


No comments:

Post a Comment