రాజ్యం ఆకంటకంగా ధనధాన్యసమృద్ధులతో తులతూగుతోంది. ఆ కీర్తి, ఆ భోగాలూ - రెండూ కలిసి లక్ష్మీ మదం గట్టిగా తలకెక్కింది. పాషండుల సలహాలు వింటూ అధర్మాలు అనేకం చేసాను. పూర్వ సంచితాలైన పుణ్యాలన్నింటినీ పోగొట్టుకొన్నాను. కూడనియుక్తులు చెబుతూ వితండవాదాలు చేస్తూ రాజ్యంలో యజ్ఞయాగాది క్రతువులూ సమస్త ధర్మకార్యాలనూ నోములు, వ్రతాలూ, జపాలూ అన్నింటినీ విలుపుదల చేసాను. నేను అధర్మ మార్గం పడితే నా ప్రజలు అంతకన్నా ముందుకు వెళ్ళారు. ఎన్నెన్నో ఘోరాలు చేసారు. వారుచేసిన పాపకృత్యాలలో పరిపాలకుడుగా నా భాగం నాకూ దక్కుతూ వచ్చింది. ఇలా రకరకాలుగా పాపం ప్రోగుచేసుకున్నాను.
ఒకనాడు - పదిమంది స్నేహితులతో కలిసి మృగయా వినోదం కొరకు అడవికి వెళ్ళాను. క్రూరమృగాలను వేటాడి అలసిపోయాను. సాయంకాలం అయ్యేసరికి రేవా నదీతీరం చేరుకున్నాను. అలసి గుర్రాన్ని ఒడ్డున నిలిపి హాయిగా నదిలో స్నానం చేసాను. వేటలో పడి ఉదయం నుండీ ఏమి తినలేదు కనుక నీళ్ళతో కడుపు నింపుకున్నాను. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. నెమ్మదిగా చీకట్లు క్రమ్ముకున్నాయి. సేదతీర్చుకొని జలక్రీడ ముగించి గట్టుకి చేరుకున్నాను. అల్లంత దూరాన మనుజులు అలకిడి అయ్యింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాను. ఎవరో సమీప గ్రామస్థులు రేవానదీతీరంలో గుట్టుగా ఏకాదశీ వ్రతం ఆచరిస్తున్నారు. నేను కూడా వారిలో ఒకడివై కూర్చుండిపోయాను. వారితో పాటు ఆ రాత్రంతా జాగారం చేసాను. గుర్రపు స్వారీ, రోజంతా వేట, తిండీతిప్పలు లేకపోవడం జాగరణం అన్నీ కలసి అలసటలో ప్రాణాలు ఎగిరిపోయాయి.
భీకరా కారులూ యమభటులు ప్రత్యక్షమయ్యారు. నన్ను యమపాశాలతో బంధించి యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడు ఒక్కక్షణం ఆలోచించాడు. ధర్మరాజా ! ఈ ధర్మకీర్తి తొలినాళ్ళల్లో ధర్మాత్ముడు. శ్రీ దత్తాత్రేయ గురువర్యుని దర్శనం, స్పర్శనం, సంభాషణం వల్ల ధర్మశాస్త్రాలన్నీ ఎరిగి ధర్మబద్ధంగా జీవించిన వ్యక్తి. ఆ తర్వాత కొన్నాళ్లకు సాంగత్య దోషాలవల్ల అధర్మాత్ముడుగా మారాడు. ఇతడు చెయ్యని పాపం లేదు. కానీ దత్త స్వామి కృపవల్ల నిన్న ఏకాదశీ వ్రతం ఆచరించాడు. నిరాహారుడై హరిపూజలో పాల్గొన్నాడు. జాగరణం చేసాడు. ప్రాణాలు వదిలేసాడు. తెలిసి చేసినా తెలియకజేసినా పాప ఫలం తప్పనట్లుగానే పుణ్యఫలమూ తప్పదు. కనుక ఈ వ్రతంలో ఇతడి పాప సముద్రాలన్నీ ఇంకిపోయాయి. పుణ్యఫలమే మిగిలివుంది.
చిత్రగుప్తుడు ఇలా చెప్పేసరికి తండ్రీ! యమధర్మరాజు సింహాసనం నుండి దిగివచ్చి నాకు సాష్టాంగపడ్డాడు. షోడశోపచారాలు చేసాడు. యమభటుల్ని అందర్ని పిలచి ఇలా ప్రకటించాడు.
No comments:
Post a Comment