Saturday, 23 September 2023

శ్రీదత్త పురాణము (266)

 


స్త్రీలకూ ఉపవీతులకూ గంధలేపక్షయావధిగా ఈ శౌదం చెప్పబడింది. మిగతా వ్రతులందరికి యువతులకు మల్లేనే విధవలకు సైతం ఇదే శౌచం. ఇలా శౌచవిధి పూర్తి చేసుకుని తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ ముమ్మారు కూర్చుని ఆచమనం చేయాలి. దుర్గంధమూ నురుగూ లేని నీళ్ళు మాత్రమే ఉపయోగించాలి. రెండుసార్లు చెక్కిళ్ళు పెదవులూ తడిచేత్తో తుడుచుకోవాలి. తర్జన్యంగుష్టాలతో నాసికనూ అంగుష్టానామికాలతో కళ్ళనీ కనిష్టాంగుష్టాలతో నాభిని అరచేత్తో గుండెనీ అంగుష్టాగ్రాలతో శరస్సుని అంగుళీకాగ్రంతో భుజాలనూ స్పృశించాలి. అటుపైన స్నాన-మార్జన-జలతర్పణాలు ఆచరించాలి. ఆ పైది సంధ్యోపాసన. సూర్యుడికి ఆర్ఘ్యప్రధానం. ప్రాతఃసంద్యలో నిలబడి సూర్యదర్శనం అయ్యేదాకా గాయత్రిని జపించాలి. సాయంసంధ్యలో కూర్చుని నక్షత్ర దర్శనమయ్యేదాకా గాయత్రిని జపించాలి.


మధ్యాహ్నం కూడా సంధ్యోపాసన చేసి ఆర్ఘ్యం విడిచిపెట్టాలి. కూర్చుని కానీ నిల్చునికానీ గాయత్రిని జపించాలి. ప్రాతర్మధ్యాహ్నాలలో గృహస్థు స్నానం చెయ్యాలి. దర్భలు చేతబట్టి బ్రహ్మయజ్ఞం చేయాలి. ఏదైనా ఇబ్బంది కలిగి లేదా ప్రమాదవశాత్తు ఈ వేదోక్త కర్మల్ని సకాలంలో చెయ్యలేకపోతే రాత్రి తొలిజాములో ఆరంభించి యధాక్రమంగా అన్నీ చేసుకోవాలి. ఏ ఇబ్బందీలేకపోయినా సంధ్యవార్చని విప్రుడు పాషండుడుగా పరిగణింపబడతాడు. వాడు సర్వధర్మ బహిష్కృతుడు. కూట యుక్తి విశారదుడై సంధ్యాది సత్కర్మాచరణాన్ని పరిత్యజించినవాడు మహాపాతకుల్లో కెల్లా మహాపాతకి. నేను సంద్యాది సత్కర్మల్ని విడిచిపెట్టానోచ్- అని ప్రకటించుకొనే ద్విజుడు ఆ చంద్రతారకంగా ఘోరనరకాలు అనుభవిస్తాడు.


సంధ్యోపాసన అయ్యాక దేవతార్చనం వైశ్వదేవం యధావిధిగా చేసుకోవాలి. ఆ సమయంలో వచ్చిన అతిథుల్ని మధుర వాక్కులతో ఆహ్వానించి కందమూలఫలగృహాన్న దానాలతో సంతృప్తిపరచాలి. వట్టి చేతులతో తిరిగి వెళ్ళే అతిథి తన పాపాన్ని మన ఇంటవదలి మన పుణ్యాలను పట్టుకపోతున్నాడని అర్ధం చేసుకో.


అతడి గోత్ర నామాలు ఏమిటో మనకు తెలియవు. పొరుగూరు నుండి వచ్చాడు. అటువంటివాణ్ని పండితులు అతిథి అన్నారు. విష్ణువులా భావించి అతడ్ని పూజించమన్నారు. స్వగ్రామవాసి, విష్ణుభక్తుడు శ్రోత్రియుడు- దిక్కులేని వాడు- ఇటువంటి విప్రుణ్ని నిత్యమూ అర్చించి అన్నోదకాలతో సంతృప్తిపరిస్తే దేవతలు అనుగ్రహిస్తారు. పితృదేవతలు తరిస్తారు.


No comments:

Post a Comment