ఏకాదశీ వ్రతం
సనత్కుమారా! సర్వపాప వినాశకంగా సర్వపుణ్యదాయకంగా ముల్లోకాలలోనూ ప్రసిద్ధికెక్కిన మరొక వ్రతం మీకు చెబుతున్నాను. దీన్ని చాతుర్వర్ణాల వారూ స్త్రీ పురుషులూ అందరూ చేసుకోవచ్చును. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం, భక్తితో చేస్తే ముక్తి లభించి తీరుతుంది. దీనిపేరు ఏకాదశీవ్రతం, కృష్ణ పక్షంలో గానీ శుక్ల పక్షంలోగానీ ఏకాదశినాడు ఉపవాసం ఉండాలి, భుజించడం మహాపాపం. నరక హేతువు. ఉపవాస ఫలం పూర్తిగా దక్కాలి అంటే దశమినాటి రాత్రి, ఏకాదశి రెండు పూటలూ, ద్వాదశినాటి రాత్రి మొత్తం నాలుగు భోజనాలు మానెయ్యాలి. ఏకాదశినాడు భోజనం చెయ్యడమంటే సర్వపాపాలనూ కావాలని ఏరికోరి భుజించడమన్నమాట. అంచేత ఏకాదశినాడు రెండుపూటలా నిరాహారులై ఉండాలి. బ్రహ్మహత్యమహాపాతకంతో సాటివచ్చే సర్వపాపాలూ ఏకాదశినాడు అన్నాన్ని ఆశ్రయిస్తాయి. అంచేత ఆరోజు భుజించినవాడికి అవి సంక్రమిస్తాయి. ఇక అతడికి నిష్కృతి ఎలా చెప్పు ?
పాపాలు చేసిన వారుగానీ చెయ్యని వారుగానీ ఏకాదశినాడు నిరాహారులుగా ఉంటే పరమపదం చేరుకుంటారు. ఈ తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం కనక భవబంధాలను తెగతెంచుకోవాలనుకునేవారు తప్పకుండా ఏకాదశీ వ్రతం ఆచరించాలి. దశమిరోజున తెల్లవారు జామునే లేచి దంతధావనాదులు ముగించి తలారా స్నానం చేసి నియతేంద్రియుడై భక్తి ప్రపత్తులతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఆ రాత్రికి నారాయణ సన్నిధిలోనే నిద్రించాలి. ఏకాదశి నాటి ఉదయమూ అల్లాగే లేచి స్నానాదికం ముగించుకుని జనార్ధనుణ్ని గంధపుష్పాదులతో షోడశోపచార విధి పూర్వకంగా అర్చించాలి అటుపైని ఇలా చెప్పుకోవాలి పుండరీకాక్షా! ఏకాదశినాడు ఉపవాసం ఉండి మర్నాడు భోజనం చేస్తాను, అచ్యుతాశరణు శరణు.
ఈ మంత్రం పఠించి దేవదేవుడైన చక్రిపట్ల భక్తిభావంతో సంతుష్టాత్ముడై ఉపవాసం స్వామివారికి సమర్పించాలి. ఆ రాత్రి స్వామి సన్నిధిలోనే జాగరణం ఉండాలి. గీతవాద్యనృత్య పురాణ శ్రవణాదులతో కాలక్షేపం చెయ్యాలి, గీతం - వాద్యం నృత్యం పురాణపఠనం వేదపఠనం ధూపం దీపం - నైవేద్యం - పుష్ప గంధానులేపనం ఫలం - అర్ఘ్యం ప్రదక్షిణం సాష్టాంగ నమస్కారం- ఆర్తకం - వీటిని భక్తిశ్రద్ధలతో ఇంద్రియ - - నిగ్రహంతో త్రికరణశుద్ధిగా జాగరూకుడై ఆ రాత్రి జాముజాముకీ ఆచరించాలి. ఉపవాసం ఎంతముఖ్యమో జాగారం అంత ముఖ్యం. విష్ణుమూర్తికి షడ్వింశతి గుణాధికంగా సంతృప్తి కలిగిస్తుంది. ఈ రెండింటినీ భక్తితో చేసిన వారికి మరి పునర్జన్మలేదు. ఈ వ్రతంలో విత్తకార్యం ఎంతమాత్రమూ పనికిరాదు. ధనవంతుడు లోభించి క్లుప్తంగా ఈ వ్రతం చేస్తే ఆ దురాత్ముడు విష్ణుమూర్తిని మోసగించినట్టు, దానికి తగిన శాస్తి జరుగుతుంది. కలిభుజంగ దుష్టులై మాయాపాశవిమోహితులై కొందరు పాపాత్ములు ఏకాదశినాడు నిద్రిస్తారు. వాళ్ళు ఏమి నష్టపోతున్నారో ఎంత నష్టపోతున్నారో తేల్చిచెప్పడం కష్టం. జీవితం ఆధ్రువం కాబట్టి ఒకసారి జారవిడుచుకున్న ఏకాదశిని కూడదీసుకోవడం అసంభవం. పౌరాణికుడు దొరక్కపోతే గీతానృత్యాదులతో జాగారం చెయ్యాలి. దొరికితే పురాణ పఠనం చెయ్యడమే అత్యుత్తమం. ఇలా జాగరణం చేసిన హరిభక్తుల పితృదేవతలు వైకుంఠవాసులవుతారు. జన్మాంతంలో తామూ వైకుంఠధామం చేరుకుంటారు. షష్ఠి సహస్రవర్షాలు ఆశ్వేతద్వీపంలోనే నివసిస్తారు. తాను కాళ్ళతో రేపిన దుమ్ములో ఎన్ని కణాలుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఏకాదశీ జాగరికి వైకుంఠవాసమనీ కనకనే ఆ రోజున ఎంతదూరమైనా నడిచి మాధవాలయానికి వెళ్ళాలనీ పెద్దలు చెబుతారు.
No comments:
Post a Comment