విద్యావంతుడు బుద్ధిమంతుడు ఆచారపరుడు అయిన వరుణ్ని పిలిచి కన్యాదాత నూతన వస్త్రాదుల్ని అలంకరించి పూజించి పిల్లనిచ్చి పెళ్ళిచేస్తే అది బ్రాహ్మవివాహం. జ్యోతిష్టోమాది యజ్ఞాలను యధావిధిగా చేయించిన ఋత్విక్కుకి కన్యాదానం చేస్తే అది దైవవివాహం. ధర్మార్థంగా వరుడి నుంచి రెండు గోవుల్ని పుచ్చుకుని కన్యనిచ్చి పెళ్ళిచేస్తే అది అర్హవివాహం. మీరిద్దరూ కలిసి గృహస్థ ధర్మాలు నిర్వహించండి అని ఒడబరిచి వధూవరులకు వివాహం జరిపిస్తే అది ప్రాజాపత్య వివాహం. ధనం ఇచ్చి కన్యను (కొనుక్కుని) వివాహమాడితే అది అసురం, వధూవరులు తమంతతాముగా చేసుకొనే వివాహం - గాంధర్వ వివాహం. బలాత్కారంగా కన్యను అపహరించి తీసుకుపోయి వివాహమాడితే అది రాక్షస వివాహం. నిద్రపోతున్న కన్యనో మధ్యపాన వివశగా ఉన్నదానినో కేవల సంభోగేచ్ఛతో స్వాధీనం చేసుకోవడం పైశాచ వివాహం. ఇది అన్నింటిలోకీ అధమాధమ పద్ధతి అని మహర్షులు నిరసించారు.
గృహస్థాచారం
గృహస్థు కనీసం రెండు యజ్ఞోపవీతాలు ధరించాలి. ఉత్తరీయం వదలకూడదు. సువర్ణకుండలాలు ధౌత వస్త్రద్వయం ధరించాలి. పరిమళద్రవ్యాల అనులేపనం పుష్పమాలికల ధారణ ఉండాలి. కేశాలనూ నఖాలనూ అందంగా కత్తిరించుకుని శుచిగా ఉండాలి. వేణుదండం ఉదకంతో కూడిన కమండలువు, తలపాగా గొడుగు పాదుకలు చెప్పులు ఉపయోగించాలి. అలంకరించుకుని ప్రియదర్శనుడుగా ఉండాలి. నిత్యం స్వాధ్యాయం అధ్యాపనం ఏమరకూడదు. స్వాచారం విడువకూడదు. పరాన్నం భుజించకూడదు. పరివాదాలకు దిగకూడదు. పాదం మీద పాదం వేసి తోముకోకూడదు. ఉచ్చిష్టాన్ని దాటకూడదు. ఒకేసారి రెండు చేతులతోనూ బుర్రబరుక్కోకూడదు. దేవాలయాల్లోకి అపసవ్యంగా ప్రవేశింపకూడదు. దేవతార్చన ఆచమనం స్నానం వ్రతం శ్రాద్ధంలాంటి కర్మల్ని ఆచరిస్తునప్పుడు ముక్తకేశడూ ఏకవస్త్రధారీకాకూడదు. దుష్ప్రయానాలను అధిరోహించకూడదు. శుష్క వాదాలు చెయ్యకూడదు. పరకాంతలను స్పృశించరాదు. ఆశించరాదు. పొందరాదు. పిసినారితనం పనికిరాదు. కొండేలు చెప్పే బుద్ధి ఉండకూడదు. చతుష్పథంలో విప్రులకూ రావిచెట్టులకూ అపసవ్యంగా వెళ్ళకూడదు. అసూయనూ పగటి నిద్రనూ వదిలెయ్యాలి. ఇతరుల పాపాలను ప్రస్తావిచండంగానీ సొంతపుణ్యకార్యాలను ప్రశంసించడంగానీ చెయ్యకూడదు. తన ఆయుర్ధాయాన్నీ నక్షత్రాన్నీ మానాన్నీ గోప్యంగా ఉంచుకోవాలి. దుర్జనులతో జతకట్టకూడదు. అశాస్త్రం వినకూడదు. ఆసవ ద్యూత - గీతాదుల పట్ల ఆసక్తిని చంపుకోవాలి. రక్తంతో తడిగా ఉన్న ఎముకనూ, మద్యాన్ని, ఉచ్చిష్టాన్ని, పతితుడైన మనిషినీ, సర్పాన్ని, వైద్యుణ్ణి తాకినట్టయితే సచేలస్నానం చెయ్యాలి. చితినీ చితకాష్టాన్నీ (బలిపశువుని కట్టిన) యూప స్తంభాన్నీ చండాలుణ్నీ దేవలుణ్ని తాకితే సచేలస్నానం చెయ్యాలి. దీపపు నీడ, మంచంమీద, కేశవస్త్ర నఖోదకం, అజం మార్జాలం రేణువు - ఇవి మన పూర్వసంచిత పుణ్యాలను నశింపచేస్తాయి.
No comments:
Post a Comment