కృతయుగం ప్రారంభమైన కార్తిక శుద్ధనవమి, త్రేతాయుగారంభం వైశాఖ శుక్ల తృతీయ, ద్వాపరారంభం మాఘపూర్ణిమ, కలియుగాది భాద్రపద బహుళ త్రయోదశి - ఇవ్వి అనధ్యయనాలు, ఇలాగే స్వాయంభువమన్వాది దివసాలు కూడా అనధ్యయనాలు. అవి ఏవి అంటే- కార్తిక శుద్ధ ద్వాదశి (స్వాయంభువ మనువు), ఆశ్వయుజ శుద్ధ నవమి (స్వారోచిష మనువు), చైత్ర శుద్ధ తృతీయ (ఉత్తమ మనువు), భాద్రపద శుద్ధ తృతీయ (తామసమనువు), పుష్యశుద్ధ ఏకాదశి (రైవత మనువు), ఆషాఢ శుద్ధ దశమి ( చాక్షుశమనువు), మాఘశుద్ధ సప్తమి (వైవస్వత మనువు), మాఘమావాస్య (సూర్యసావర్ణ మనువు), కార్తిక కృష్ణాష్టమి (ఇంద్రసావర్ణి), ఫాల్గుణామావాస్య (బ్రహ్మసావర్ణి), శ్రావణామావాస్య (అగ్నిసావర్ణి), ఆషాఢ పూర్ణిమ (రుద్రసావర్ణి), చైత్ర పూర్ణిమ (రౌచ్యమనువు), జ్యేష్ట పూర్ణిను (భౌచ్యమనువు) ఈ తిథులు అనధ్యయనాలు. ఈ యుగాదుల్లో మన్నాదుల్లో విప్రులు శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. ఇవికాక ఇంకా కొన్ని అనధ్యయ దివసాలు ఉన్నాయి. శ్రాద్ధ భోక్తగా నియంత్రితుడైనప్పుడు, సూర్యచంద్ర గ్రహణాల్లోనూ ఉత్తరాయన దక్షిణాయన దివసాల్లోనూ శవయాత్రలో పాల్గొన్న రోజున, జాతాశావంగానీ మృతాశౌచంగానీ వచ్చిన రోజుల్లోనూ, సర్పాదులు కనిపించిన రోజున, భూకంపం వచ్చినప్పుడు - వేదాధ్యయనం చెయ్యకూడదు. అనధ్యయన దివసాల్లో అధ్యయనం చేస్తే అతడి ప్రజ్ఞనూ యశస్సునూ సంపదనూ ఆయుష్షునూ బలాన్ని ఆరోగ్యాన్ని అన్నింటినీ యముడు స్వయంగా కత్తిరిస్తాడు. పైగా బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది. అటువంటివాణ్ని అందరూ వెలివెయ్యాలి, పలకరించకూడదు.
కుండగోళకులకి జడులకీ వారి సంతతికి ఉపనయనం జరిపించవచ్చునని కొందరి మతం, సరే. ఉపనయనం అయ్యాక వేదాధ్యయనమునకు ఉపక్రమించాలి. వేదం చెప్పుకోకుండా ఏ శాస్త్రాలు చదివినా వ్యర్ధమనీ నరకపాత హేతువనీ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అతడి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వేదాన్ని అభ్యసించని విప్రుల సర్వకర్మలూ వ్యర్ధాలే. వేదము అంటే శబ్దబ్రహ్మమయుడైన విష్ణు స్వరూపం. అందుకని విప్రుడు వేదాధ్యయనం చేసి తీరాలి. వేదాధ్యాయికి సకలాభీష్టాలు తమంతతాముగా సిద్ధిస్తాయి.
No comments:
Post a Comment