Tuesday 9 November 2021

శ్రీ హనుమద్భాగవతము (70)



భోజనమునకై తహతహలాడుచున్న మహా కాయము కలిగిన సంపాతిని చూసి వానరులు ఎంతో భయపడుతూ ఇలా ఆలోచింపసాగారు — “మనము శ్రీరామునకు ఎట్టి సేవను చేయలేదు, సుగ్రీవుని ఆజ్ఞను పరిపాలించలేదు. ఇపుడు మనము వ్యర్థంగా దీని కడుపులోనికి పోనున్నాము.” తర్వాత వారు ఱెక్కలు లేని అగృధ్రమునకు వినబడునట్లుగా ఈ విధంగా పలికారు -


అహో జటాయుద్ధర్మాత్మా రామస్యార్థే మృతః సుధీః |

మోక్షం ప్రాప దురావాసం యోగినామప్యరింధమ ||


(అ.రా. 4.7.34)


"ఆహా! ధర్మాత్ముడైన జటాయువు ఎంత ధన్యుడు? బుద్ధిమంతుడైన అతడు శ్రీ రాముని కార్యార్థమై తన ప్రాణములను ఒసంగినాడు. చూడు, ఆ శత్రుదమనుడు యోగులకు కూడా దుర్లభమైన మోక్ష పదవిని పొందినాడు".


జటాయువు పేరు విని సంపాతి ఎంతో దుఃఖతుడై అత్యంతాశ్చర్యములో వానరులతో ఇట్లా పలికాడు - కే వా యూయం మమ భ్రాతః కర్ణ పీయూష సన్నిభమ్ ||

జటాయురితి నామాద్య వ్యాహరన్తః పరస్పరమ్ |

ఉచ్యతాం వో భయం మా భూన్మతః ప్లవగసత్తమాః ||

(అ.రా.4-7-36-36)


"వానర శ్రేష్ఠులారా ! మీరెవరు? మీలో మీరు నా కర్ణములకు అమృతమువలె ప్రియాన్ని కలిగించే నా సోదరుడైన జటాయువు నామాన్ని ఉచ్చరిస్తున్నారు. మీరు ఏ మాత్రము భయపడక మీ వృత్తాంతమును నాకు వినిపించండి".


సంపాతి ధైర్యము చెప్పినా వానరయూధపతులు అతనిని నమ్మలేదు. మాంసభోజియైన మహాకాయము కలిగిన ఆ గృధ్రమును వారు అనుమానించారు. దీర్ఘాలోచనానంతరము వానరులు ఆయన వద్దకు వెళ్ళారు.


యువరాజైన అంగదుడు అతనికి శ్రీరాముని జన్మనుండి సీతాహరణము వరకు జరిగిన కథనంతటిని సవిస్తరముగా వినిపించాడు. పిమ్మట జటాయువు సీతా దేవిని రక్షించుటకై రావణునితో యుద్ధము చేసి శ్రీ రాముని ఒడిలో సుఖంగా ప్రాణములను వదలిన విషయాన్ని, పరమకారుణికుడైన శ్రీరాముడు ఆ జటాయువునకు చేసిన అంతిమసంస్కారము గురించి వానరులు చెప్పారు. చివరకు వారు 'మా వానర రాజైన సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి సీతా దేవిని అన్వేషించుటకై ఇచటికి వచ్చాము, కాని ఇంతవరకు ఆమె జాడ తెలియలేదు, అందువలన మేము దుఃఖముతో ధైర్యహీనులము, వ్యాకులరము అవుతున్నాము” అని చెప్పారు.

No comments:

Post a Comment