Wednesday 10 November 2021

శ్రీ హనుమద్భాగవతము (71)



తన ప్రాణప్రియసోదరుడైన జటాయువు ప్రభువు కొఱకు ప్రాణములను అర్పించాడనీ, అతని అంతిమగతి సుఖపూర్ణముగా అయ్యిందని విని సంపాతి ఆనందవిహ్వలుడయ్యాడు. ఇంతే కాదు మహామునియైన చంద్రునివాక్కును అనుసరించి పరమశ్రేయస్సు కలిగే క్షణం ఆసన్నమయ్యిందని ఎఱిగి సంపాతి తన దుఃఖమునంతటిని మరచాడు. అతని శరీరమంతా పరమానందముచే పులకితమయ్యింది.


అంగదస్య వచః శ్రుతా శ్రుత్వా సంపాతి గృష్టమానసః || 

ఉవాచ మత్రియో భ్రాతా ప్లవగేశ్వరాః | 

జటాయుః బహువర్ష సహస్రాంతే భ్రాతృవార్తా శ్రుతా మయా | 

(అ.రా. 4.7.46-47)


'అంగదుని మాటలు విని చిత్తము ప్రసన్నము కాగా సంపాతి ఇలా పలికాడు - కపీశ్వరులారా! జటాయువు నాకు పరమప్రియుడైన సోదరుడు. నేను కొన్ని వేలసంవత్సరముల తరువాత నా సోదరుని గురించి విన్నాను.'


వాఙ్మతిభ్యాం హి సర్వేషాం కరిష్యామి ప్రియం హి వః || 

యద్ధి దాశరథేః కార్యం మమ తచ్చాత్ర సంశయః |


(వా.రా. 4.59.24-25) 


నేను వాక్కు ద్వారా, బుద్ధిద్వారా మీ అందరికి ప్రియమైన పనిని తప్పక చేస్తాను. ఎందుకనగా దశరథనందనుడైన శ్రీరాముని కార్యము నా కార్యమే, ఇందులో సందేహము లేదు.  


సంపాతి ఇంకా ఇలా పలికాడు :- ' మొట్టమొదట మీరు నన్ను నీటి దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అక్కట నేను నా సోదరునకు తర్పణములను ఇవ్వాలి. తర్వాత మీ పని నెరవేరుటకై నేను తగినమార్గమును చెప్పగలను.'


సంపాతి కోరికను విని, మహావీరుడైన హనుమంతుడు అతని ఎత్తుకొని సముద్రతటమునకు తీసుకొనిపోయాడు. అచట సంపాతీ స్నానము చేసి జటాయువునకు తర్పణములను ఇచ్చాడు. పిమ్మట వానరులు అతనిని అతని స్థానమునకు తీసుకుని వెళ్ళారు. అక్కడ శ్రీరామచంద్రుని భక్తులు ఎదుట కూర్చుండగా చూసిన సంపాతి యొక్క సుఖమునకు అంతములేక పోయింది. అతని శారీరక మానసిక కష్టము మొదటనే తొలగిపోయింది. 


No comments:

Post a Comment