Monday, 8 November 2021

ఉమాంగమలజ వరద వినాయక చవితి



ఓం ఉమాంగ మలజాయ నమః 


గాణాపత్యంలో ప్రతి చవితికి ఒక విశేషం ఉందని ఇంతకముందు చెప్పుకున్నాము గదా. ఈరోజు కార్తిక శుద్ధ చవితి. దీన్ని గణపతి ఆగమలు ఉమాంగమలజ వరద వినాయక చవితి అని, మలజాత వరద వినాయక చవితి అని అంటాయి.


ఉమా అంటే పార్వతీదేవి. మల అంటే ఆమె శరీరం పైనున్న మట్టి. జా అనగా దాన్ని నుండి అవతరించిన వాడు. పార్వతీదేవి స్నానం చేసే ముందు తన శరీరానికి నలుగు పిండి రాసుకుంది. దాన్ని నలచగా వచ్చిన వ్యర్ధంతో ఒక బాలుడిని చేసి ప్రాణం పోసిందని మనం వినాయకచవితికి కధ చదువుతాము గదా. అది జరిగినది కార్తిక శుక్ల చవితి నాడే. అందుకే దీనికి ఉమాంగమలజ వరద వినాయక చవితి అని పేరు.


అలాగే గణపతి శివగణాలతో  పోరాడి అందరినీ ఓడించింది, శివునితో జరిగిన యుద్ధంలో నరముఖం కోల్పోయి గజవదనంతో తిరిగి లోకాన్ని అనుగ్రహించింది కూడా ఈరోజే. 


భగవానుడు అమలుడు, విమలుడు (అనగా లేశమాత్రమైన మలం (దోషం) కూడా తనయందు లేనివాడు). కానీ అద్వైతంలో సర్వమూ ఈశ్వరుడే అని నిరూపించుట కొఱకు  పూర్ణబ్రహ్మమైన గణనాథుడు పార్వతీదేవి మలం నుంచి ఆవిర్భవించాడు. అయినప్పటికీ అక్కడ అమ్మవారిని ఉమా అన్నారు. సర్వ ఉపనిషత్తుల సారమే ఉమా అనే పదం. అ ఉ మ కలిస్తే ఓం అనే అక్షరం ఏర్పడింది. అందులో ఉ అనే అక్షరంతో మొదలులెట్టి చదివితే ఉ మ అ (ఉమా) అవుతుంది. అనగా ఓంకారం నుంచి ఉద్భవించవాడు, ఓంకారస్వరూపుడు ఆయనే.


ఈ రోజు గణపతి ప్రీతికొరకు గాణాపత్యులు మరియు గణేశభక్తులు దీపదానం చేస్తారు. అలగే గణపతి యొక్క 12 అవతారలకు సూచనగా 12 ఆవునేతి దీపాలను గణపతి ముందు వెలిగిస్తారు.  ఈ రోజు చేసే మఱొక ముఖ్యమైన విధి - గణపతికి నారికేళబలి ఇవ్వడం, అనగా గణపతి ముందు కొబ్బరికాయ కొట్టడం. ఇదే రోజున గణపతికి రుద్రుడు కొబ్బరికాయ సమర్పించాడట. 


భాద్రపద శుక్ల చవితి (వినాయక చవితి )ఎంత విశేషమో, ఈ కార్తిక శుద్ధ చవితి అంత విశేషం. అమాటకు వస్తే స్వామి భక్తులకు ప్రతి పక్షంలో వచ్చే చవితి ప్రత్యేకమే.


ఓం గణేశాయ నమః

ఓం ఉమాంగ మలజాయ నమః 

No comments:

Post a Comment