Thursday 11 November 2021

శ్రీ హనుమద్భాగవతము (72)



అతడు నలువైపుల తన దృష్టిని ప్రసరింపజేసి ప్రభువుయొక్క ప్రియభక్తులతో ఆదరముగా ఇలా పలికాడు :


త్రికూటపర్వతముపై లంకానగరమున్నది. అక్కట రావణుడు సహజముగానే శంకారహితుడై ఉన్నాడు. అచట అశోకం అనే ఒక ఉద్యానవనమున్నది. అక్కడ సీతా దేవి శోకమగ్నమై కూర్చుండి ఉన్నది. నేను అంతా చూస్తున్నాను. మీకు కనబడుటలేదు. ఎందుకనగా గృధ్రదృష్టి అపారమైనది అనగా చాలా దూరమువరకు వెళుతుంది. నేను వృద్ధుడనైయ్యాను, లేకపోతే మీకు చాలా సహాయం చేసి ఉండే వాడను'.


ఇంకా వారిని ప్రోత్సాహపరుస్తూ సంపాతి ఇట్లా పలికాడు -


తద్భవన్తో మతి శ్రేష్ఠ బలవన్తో మనస్వినః ||

ప్రహితాః కపిరాజేన దేవైరపి దురాసదాః | (వా.రా. 4-59_25 - 26)


మీరు కూడా ఉత్తమబుద్ధియుక్తులు, బలవంతులు, దేవతలకు దుర్జయులై ఉన్నారు. అందువలననే వానర రాజైన 'సుగ్రీవుడు మిమ్ములను కార్యమునకు పంపినాడు.


తదనంతరము అతడు శ్రీరామలక్ష్మణుల తీక్ష్ణశరముల మహిమను గానము చేస్తూ వానర భల్లూకములతో ఇలా పలికాడు 


రామలక్ష్మణబాలాశ్చ విహితాః కంకపత్రిణః ||

త్రయాణామపి లోకానాం పర్యాప్తాస్త్రాణనిగ్రహే |

కామంఖలు దశగ్రీవ స్తేజోబలసమన్వితః | 

భవతాం తు సమర్ధానాం న కించిదపి దుష్కరమ్ |


(వా.రా.4.59-26-27)


కంకపత్రములతో కూడిన శ్రీ రామలక్ష్మణుల బాణములు సాత్తుగా విధాతచే నిర్మితములైనట్టివి. అవి ముల్లోకములను సంరక్షించుటయందు, నిగ్రహించుటయందు సమర్థము లైనట్టివి. మీకు శత్రువైన రావణుడు తేజస్వి మరియు బలవంతుడైనా మీ వంటివీరులు అతనిని ఓడించుట దుష్కరముకాదు. 


ప్రోత్సహించిన తర్వాత సంపాతి ఇలా పలికాడు - "మీరు ఏదో విధముగా సముద్రాన్ని దటడానికి ప్రయత్నించండి. రాక్షసరాజైన రావణుని వీరవరుడైన శ్రీరామచంద్రుడు సంహరించగలడు. సముద్రమును దాటి లంకలోనికి వెళ్ళి, సీతా దేవిని దర్శించి, ఆమెతో మాటలాడి మరల సముద్రమును దాటివచ్చే వీరుడు మీలో ఎవడున్నాడో ఒకసారి ఆలోచించండీ.


1 comment: