Sunday 28 November 2021

శ్రీ హనుమద్భాగవతము (86)



ఇటు అటు చూస్తూ హనుమానుడు స్ఫటికమణినిర్మితమైన దివ్యమైన ఒక వేదికను చూసాడు. దానిపై రత్న నిర్మితమైన రావణుని పర్యకముండింది. దానికి నలువైవులు చాలా మంది స్త్రీలు నిలువబడి చామరములను ధరించి విసరుచున్నారు. ఉజ్జ్వలమైన ఆ పర్యంకముపై లంకాధిపతియైన రావణుడు సుఖముగా నిద్రించుచున్నాడు; అచట బ్రహ్మచారియైన హనుమానుడు రావణుని పత్నులను కూడా చూసాడు. వారాతని చరణములకు అటు నిటు నిద్రించుచున్నారు. సమీపమునందే అతనికి సంతోషమును గలుగ జేసే వీణావాదినులైన సుందరీమణులు గాఢనిద్రలో పడి ఉన్నారు. ఇంకా కొందఱి వక్షఃస్థలముపై వీణులు పడియే ఉన్నాయి. కోమలమైన వారివేళ్ళు వీణాతంత్రులను స్పృశించుచునే ఉన్నాయి. 


వారందఱికంటె వేఱుగా ఎంతో సుందరమైన శయ్యపై పరుండి ఉన్న అనుపమ రూపలావణ్యసంపన్నయైన ఒక యువతిని హనుమానుడు చూసాడు. కోమలములు, సుందరమైన ఆమె అవయవములపై ముత్యములతోనూ మణులతోనూ కూడిన వివిధమైన ఆభూషణాలు విరాజిల్లుచున్నాయి. ఆమె శరీరకాంతి సువర్ణమువలె మెఱయు చుండింది. అనుపమ రూపవతియైన ఆమె రావణుని భార్యయైన మండోదరి. ఆమెను చూసినంతనె హనుమానునకు 'ఈమె సీతా దేవియా' అనే అనుమానము కలిగింది. అతని సంతోషమునకు ఎంతు లేకపోయింది. హర్షిన్మత్తుడై ఆయన తన తోకను నేలపై కొడుతూ ముద్దిడు కొనసాగాడు. వానరుల ప్రకృతిని అనుసరించి ఆయన ఇటు అటు పరుగిడసాగాడు. ఆయన ఒక మారు స్తంభముల ఎక్కుతూ, వెంటనే మఱల క్రిందకు దూకాడు.


సద్గుణములకు నిలయమైన పవనకుమారునకు వెంటనే మఱియొక ఊహ తట్టెను - “పరమపతివ్రతయైన సీతా దేవి ప్రభువైన శ్రీరాముని వియోగమున ఎప్పుడూ అలంకరించుకొని వస్త్రాభరణములను ధరించదు. ఆమె భోజనము చేయదు, సుఖముగా శయనించదు, మద్యపానము స్వప్నమునందైనా చేయదు. శ్రీరామునితో సాటివచ్చు సౌందర్యవంతులు దేవ దానవనాగకిన్నరులలోగాని ఈ భూమిపై గల మానవులలో గాని ఎవ్వరునూ లేరు. ఇక సీత వంటి పతివ్రతా స్త్రీ పరపురుషునికడకు ఎలా వెళుతుంది? అందువలన ఈమె సీతా దేవి ఏ మాత్రమును గాదు”.


No comments:

Post a Comment