Sunday 14 November 2021

శ్రీ హనుమద్భాగవతము (75)



సముద్రోల్లంఘనము : లంకాప్రవేశము


గృధ్రరాజైన సంపాతివలన జనక రాజపుత్రిక వార్తను విని వానరభల్లూక వీరులు హర్షాధిక్యతచే గంతులు వేయసాగారు. వారు సముద్రపు ఒడ్డును చేరుకొని, ఆ సముద్రము యొక్క స్వరూపమును చూసి భయపడ్డారు. 'భయంకరముగా గర్జిల్లు ఉత్తుంగ తరంగయుక్తమైన ఈ అపారసాగరాన్ని ఎలా దాటాలీ అని వానర భల్లూక వీరులందఱు చింతిస్తూ విషాదగ్రస్తులై ఉండటం చూసి యువరాజైన అంగదుడు అనేక విధాల వారికి ధైర్యమును కలుగజేసాడు. మహాసాగరమువలె వీర వానర భల్లూక సైన్యమును సుస్థిరముగా ఉంచుటకు సమర్థులు అంగదుడు హనుమంతుడు ఇరువురే.


వాలికుమారుడైన అంగదుడు వానర భల్లూక వీరులందఱితో ఇలా పలికాడు - 'మిత్రులారా! మీరందఱు సాటి లేని వీరులు, మీ గమనము ఎప్పుడూ ఆగిపోయేది కాదు. జగన్మాతయైన జానకీ దేవి యొక్క జాడను కనుగొనుటకై అపారమైన ఈ సముద్రమును దాటి లంకలోనికి చేరుకొను వీరుడు మీలో ఎవరున్నారు?'


అంగదుని వాక్కులను విని మొదట వానర భల్లూక వీరులందఱు మిన్నకుండి పోయారు. కాని కొంతసేపైన తర్వాత గజనామక వానరుడు 'నేను పదియోజనముల దూరము దూకగలను' అని పలికాడు. ఇదే విధముగా గవాక్షుడు ఇరువది యోజనములు, శరభుడు ముప్పై, ఋషభుడు నలభై, గంధమానుడు యాభై, మైందుడు అఱవై, ద్వివిదుడు డెబ్బై, సుషేణుడు ఎనభై యోజనముల వరకు దూకగలమని చెప్పారు. వయోవృద్ధుడు, ఋక్షరాజైన జాంబవంతుడు ఇట్లా పలికాడు - "పూర్వము యౌవనకాలమున నేను కూడా చాలా దూరము దూకుతుండేవాడను. కాని ఇపుడు ఆ శక్తి నాలో లేదు. అయినా వానర రాజైన సుగ్రీవుని యొక్క, కౌసల్యాంనదుని యొక్క కార్యమును ఉపేక్షించుట సంభవము కాదు. ఈ వృద్ధావస్థలో నేను కేవలము తొంబై యోజలముల దూరము వరకు దూకగలను. పూర్వకాలమున విష్ణువు త్రివిక్రమావతారమున మూడడుగులు కొలుచుకొనేటప్పుడు అంతలో ముల్లోకములను అతిక్రమించి ఉన్న అతని ఆకారమును నేను ప్రదక్షిణముగా ఇరువది యొక్క మార్లు చుట్టివచ్చాను. కాని ఇప్పుడు ఈ మహాసముద్రమును దాటుట నా వలన కాని పని.'


అంగదుడు పలికాడు - నేను సముద్రమును దాటగలను. కాని తిరిగిరాగలనో లేదో చెప్పలేను.


అంగదుని వాక్కులను విని వాక్యకోవిదుడు, వృద్ధుడైన జాంబవంతుడు అతనిని ప్రశంసింస్తూ “అంగదా! నీవీ పనిని చేయుటకు పూర్తిగా సమర్ధుడవై ఉన్నావు. కాని నీవు మాకందఱకు నాయకుడవు. అందువలన నిన్ను పంపుట మాకు తగదు, నీవు ప్రత్యేకముగా కాపాడదగిన వాడవు." అని పలికాడు. 


No comments:

Post a Comment