అంగదుడు దుఃఖితుడై “అలాగైతే సముద్రోల్లంఘనము సంభవము కానట్లు తోస్తున్నది. ఇక మనము ప్రాయోపవేశము చేసి కూర్చుందుముగాక” అని పలికాడు.
“లేదు కుమారా! శ్రీరాముని కార్యము తప్పక నెరవేరుతుంది” అని అంగదుని ఓదార్చుస్తూ జాంబవంతుడు అంజనా నందనుని వైపు చూచాడు. అతడు పూర్తిగా మౌనంగా కూర్చుని ఉన్నాడు. వజ్రకాయుడైన ఈ హనుమంతుడు శాపము వలన భస్మాచ్ఛన్నమగు అగ్నివలె శాంతముగా ఉన్నాడని ఋక్షరాజునకు తెలుసు. ఇతనికి తన అపరిమేయ శక్తినిగూర్చి తెలియదు. లేకపోతే ఇతడు తన ప్రభువు సుగ్రీవుడు సంకటగ్రస్తుడై ఉండుట చూసీ ఎలా ఊరుకొని ఉండగలడు? ఇతడు నిజముగా వాలిని శిక్షించి ఉండేవాడే. జాంబవంతుడు హనుమంతునకు అతని శక్తిని గుర్తు చేస్తూ ఇలా పలికాడు- “ శ్రీ రామునకు ఆనన్య భక్తుడవు, వజ్రకాయుడవు అయిన హనుమఁతుడా! శ్రీ రాముని కార్యార్థమై నీవు అవతరించావు. ఎందుకు మిన్నకున్నావు? మహావీరా! నీవు పవనపుత్రుడవు, అఁజనా దేవి క్షీరములను త్రాగావు. బాల్య కాలమునందే నీవు సూర్యుని అరుణఫలమని తలంచి అతనిని భక్షించుటకై ఒక్క దూకులో అతని దగ్గఱకు వెళ్ళావు. బ్రహ్మాది దేవతలు నీకు అలౌకికమైన వరములను ఇచ్చారు. మహావీరుడవైన కేసరిపుత్రా! నీవు అపరిమితశక్తిసంపన్నుడవు. నీ గమనము అడ్డులేనిది. విశాలమైన ఈ జలధి నీకొక లెక్కలోనిది కాదు. లెమ్ము, సముద్రమును దాటి లంకలోనికి వెళ్ళు. అచట సీతా దేవిని దర్శించి వెంటనే తిరిగిరమ్ము. మాకు ప్రాణదానం చేసి మమ్ము కాపాడు. వివేకమునకు, జ్ఞానమునకు నిధి అయిన వాయుపుత్రా! చూడు. చింతించుచున్నవారు, విచారగ్రస్తులైన ఈ అసంఖ్యవానర భల్లూక వీరులు నీవైపు చూస్తున్నారు.
జాంబవంతుని మాటలు వినినంతనె భగవత్స్మరణమున నిమగ్నుడై ఉన్న హనుమానునకు తన బలపరాక్రమములు గుర్తుకువచ్చాయి. వెంటనే అతని శరీరము పర్వతాకారమువలె అయ్యింది. అతడు తన లోని అపారశక్తిని గుర్తించి భయానకముగా గర్జించాడు. ఆ గర్జనము వలన భూమ్యాకాశములు, సమస్త దిక్కులు కంపించిపోయాయి.
కనకభూధరాకారుడైన పవన కుమారుడు గర్జిస్తూ ఇలా పలికాడు - "వానరులారా! నేను భగవత్కృపవలన ఆకాశమున సంచరిస్తూ సమస్త గ్రహములు మొదలైన వాటిని అతిక్రమించి ముందుకు పోవుటకు సిద్ధముగనున్నాను. నేను తలచుకొంటే సముద్రమును ఎండింపజేయగలను, పృథివిని చీల్చి వేయగలను, ఎగిరి ఎగిరి పర్వతములను పొడిపొడిగా చేయగలను, తుచ్ఛమైన ఈ సముద్రము నాకొక లెక్కలోనిది కాదు. ఇప్పుడు చెప్పండి, నేనేమి చేయాలి? నేను లంక లోనికి వెళ్ళి దానిని పెకలించి నముద్రములో కలిపివేయాల?
No comments:
Post a Comment