Friday 26 November 2021

శ్రీ హనుమద్భాగవతము (85)



మరల ఆయన రావణుని భవనము కడకు వేగముగా వెళ్ళాడు. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు లంఘించి రావణుని భవనములోనికి ప్రవేశించాడు. అచ్చట ఆయన శూలములు, ముద్గరములు, శక్తి, గదలు, పట్టిసములు, కోదండములు, ముసలములు, పరిఘలు, భిందిపాలములు, బల్లెములు, పాశములు, తోమరములు మున్నగు శస్త్రాస్త్రమములను ధరించి ఉన్న అసంఖ్యాకులైన రాక్షసులను, రాక్షసస్త్రీలను చూసాడు. వారందఱు విశాలకాయులు, వీరులు, అపారశక్తి సంపన్నులు. వారి దృష్టిలో పడకుండా పింగళకేశుడైన హనుమానుడు సూక్ష్మరూపముతో రావణుని భవనములోని ప్రతికక్ష్యును జాగ్రత్తగా చూస్తూ వెళ్ళుచున్నాడు. అచట ఆయన బంగారము వంటి కాంతిగలది, అనేకములైన రత్నములచే నిండినది, వివిధములైన వృక్షముల పుష్పములచే ఆచ్ఛాదితమైనది, అనుపమమైనదైన పుష్పకవిమానమును చూసాడు. అది తన దివ్యమైన కాంతిచే ప్రజ్వలితమగుచున్నట్లుంది. అద్భుతము, పరమమనోహరమైన విమానమును చూసి హనుమానుడు ఎంతో విస్మితుడయ్యాడు. కాని నలువైపులు తిరిగి చూసినా పూజనీయురాలైన సీతాదేవి కనబడకపోవుటచే అతడు చింతితుడయ్యాడు.


చింతితుడైన హనుమానుడు సీతాన్వేషణమునకై శస్త్రాస్త్రసంపన్నులైన రాక్షసవీరుల నుండి తప్పించుకొంటూ, రాక్షసరాజైన రావణుడు నివసించు ప్రదేశమునకు చేరాడు. అచట రాక్షసజాతీయపత్నులు, హరించి తెచ్చిన వేలకొలది రాజకన్యలు ఉన్నారు. అచట వరుసగా సువర్ణమయమైన దీపాలు ప్రజ్వరిల్లుచున్నాయి. అచటి నేల స్ఫటిక మణి నిర్మితము, సోపానములు మణిమయములు, వాతాయనములు సువర్ణ నిర్మితములు. 'రావణుని ఆ నివాసము స్వర్గముకంటెను ఎంతో గొప్పగా ఉన్నట్లు తోచుచున్నది.


సగమురాత్రి గడచింది. ఆ భవనమున పవనకుమారుడు రంగురంగుల వస్త్రమములను పుష్పమాలలను ధరించి అనేకమైన వేషభూషలచే విభూషితలైయున్న వేలకొలది సుందరీమణులను చూసాడు. మద్యపానము చేత, ఎక్కువగా మేలుకొని యుండుట చేత వారు ఆయా ప్రదేశములలో ఆ రాత్రి గాఢ నిద్రాపరవశలై ఉన్నారు. వారి వస్త్రములు అస్తవ్యస్తములై ఉన్నాయి. హనుమానుడు సీతా దేవిని ఇంతకుమునుపు ఎన్నడూ చూసి ఉండలేదు, కాని పతివ్రతయైబ జానకి యొక్క పరమ సాత్త్వికము, తేజస్వంతమైన రూపము గుర్తింపదగినట్లుంది. అందువలన హనుమానుడు ఆ సుందరీమణులను శ్రద్ధగా చుస్తున్నాడు. 

No comments:

Post a Comment