Tuesday 30 November 2021

శ్రీ హనుమద్భాగవతము (88)



వెంటనే హనుమానునిదృష్టి పవిత్రమైన ఒక భవనముపై పడీంది. అచట భగవానుని ఆలయమొకటి శోభిల్లుతున్నది. ఆ భవన కుడ్యములపై నంతట అనేకమైన అవతారముల యొక్క, లీలల యొక్క చిత్రములు, రామనామము అంకితమై ఉన్నాయి. దాని ద్వారముపై రాముని ఆయుధములైన ధనుర్బాణములచిహ్నములు అంకితమై ఉన్నాయి. అచట మణుల వెలుగులలో కుంకుమపువ్వుతో పాటు, ఇతరపుష్పములతో పాటు మడులలో తులసిమొక్కలు స్పష్టముగా కనిపిస్తున్నాయి. దీనిని చూడగానే హనుమంతుడు ఎంతో ఆశ్చర్యము చెందాడు, ధర్మమునకు, వేదపురాణములకు, యజ్ఞయాగములకు, గోవులకు, ద్విజులకు, దేవతలకు, భగవానునకు సహజశత్రువులైన రాక్షసుల పట్టణములలో ఈ ఆలయము౦డుటేమి?


అప్పుడే రావణుని సోదరుడైన విభీషణుడు నిద్ర నుండి లేచి శ్రీరాముని నానుమును స్మరింపసాగాడు. అతని నోటినుండి శ్రీరామనామము వినబడినంతనే నిజంగా ఇతడు భగవద్భక్తుడే అనే నమ్మకము హనుమానునకు కలిగింది. శరణాగత వత్సలుడైన హనుమానుడు వెంటనే బ్రాహ్మణవేషమును ధరించి భగవన్నామమును ఉచ్చరింపసాగాడు. రామనామమును విన్న వెంటనే విభీషణుడు బయటకు వచ్చి బ్రాహ్మణ వేషధారీ, జగత్పావనుడైన పవనపుత్రుని చరణములను ఆదరపూర్వకంగా నమస్కరించి ఇలా - ' బ్రాహ్మణ దేవా! మీరెవరు? మీరు భగవద్భక్తులే అని నా మనస్సు చెప్పుచున్నది. మిమ్ము చూసినంతనే నా మనస్సులో ప్రేమ ఉత్పన్నమవుతున్నది. లేదా మీరు మీ భక్తులకు సుఖమును కలిగించుటకై నన్ను ధన్యునిగా చేయుటకై వచ్చిన నా స్వామియైన శ్రీరాముడవు కావు గదా! దయ యుంచి నాకు మీ విషయమును చెప్పండి.


సంసారభయనాశకుడైన అంజనీనందనుడు పూర్ణమైన మధురవాక్కులను ఇట్లు పలికాడు. ప్రేమ 'నేను మహా పరాక్రమవంతుడైన వాయు దేవుని పుత్రుడను, నా పేరు హనుమానుడు. నేను శ్రీరాముని భార్య, జగజ్జనని అయిన జానకీ దేవీ జాడను తెలుసుకొనుటకై ఆయన ఆదేశాన్ని అనుసరించి ఇచటకు వచ్చాను. నిన్ను చూడగానే నా మనస్సు సంతోషముతో ఉప్పొంగినది. దయయుంచి వివరించండి”.


No comments:

Post a Comment