మతిమంతుడైన హనుమానుడు రావణుని ఆ విశాల భవనమునంతటిని తిరిగి నిదురిస్తున్న వేలకొలది సుందరీమణులను శ్రద్ధగా చూసాడు. వెంటనే అతని మనస్సులో ఒక ఆలోచన వచ్చింది - 'నేను బాల బ్రహ్మచారిని, శ్రీరామునిదూతను, లోకమాతను వెదకుటకు వచ్చాను. కాని ఇచట నేను గాఢ నిద్రాముద్రితలై ఉన్న పరస్త్రీలను చూసాను, నాకిది తగదు. నా దృష్టి ఇంతవఱకెప్పుడూ నా తల్లిని విడచి మరియే స్త్రీ మీదను పడలేదు, కాని నేడు నేను ధర్మమునుండి చ్యుతుడనైతిని.
ధర్మమూర్తియు, వీరకర్ముడైన హనుమానుడు ధర్మ భయముచే శంకితుడయ్యాడు, కాని మనస్సులోను, ప్రాణములోను ఆయన శరీరములోను, సర్వాంతర్యామియైన శ్రీరాముడే విరాజిల్లుచున్నాడు. అందువలన మరుసటి క్షణములోనే అతని మనస్సునకు సమాధానము తట్టినది. ఆయన ఇట్లా ఆలోచింపసాగాడు -- ‘రావణుని స్త్రీలు సందేహము లేనివారై నిద్రించుచున్నారు. ఆ అవస్థలో వారిని నేను జాగ్రత్తగా చూసాను. కాని నా మనస్సులో ఎట్టి వికారమును కలుగలేదు. శుభాశుభములకు ప్రేరకము మనస్సు, నా ఈ మనస్సు సంపూర్ణముగా శాంతముగానూ, స్థిరముగానూ ఉన్నది. దానికి రాగముగాని ద్వేషముగాని లేదు. అందువలన నా ఈ స్త్రీ దర్శనమువలన ధర్మమునకు ఎట్టి లోపము కలిగియుండక పోవచ్చు. నేను కావాలని వారిని చూడలేదు. జానకిని అన్వేషించుటకు, గుర్తించుటకు వారిపై దృష్టిను ఉంచాను, స్త్రీ అగుట వలన సీతా దేవిని స్త్రీలలోనే వెదుకవలసివచ్చినది. ఆమెను నేను పరిశుద్ధమైన మనస్సుతోనే అన్వేషించాను, కనుక నేను పూర్తిగా దోషరహితుడనే.”
కామవిజేతయైన హనుమంతుడు జానకీ దేవిని అన్యస్థలములలో కూడా వెతికాడు. ఆయన లంకలో మిగిలిన గృహములను, వనములను, ఉపవనములను, వాటికలను, వాపీకూపములను, మందిరములను, పశుశాలలను, సభాభవనములను, సైనిక స్థావరములను, రహస్యస్థావరములను చూసాడు. ఇట్లాయన సావధానముగా రాత్రియంతా సీతను అన్వేషిస్తూనే ఉన్నాడు. కాని ఆమె జాడ ఎక్కడ తెలియరాలేదు. అతడు విచారగ్రస్తుడగుచున్నాడు. రాత్రి గడచుచున్నాడు. బ్రాహ్మముహూర్తము సమీపించుచున్నది.
No comments:
Post a Comment