సీతా దేవిని ఇచటకు తీసికొనిరావాలా? లేక రావణునితో పాటు లంకనంతటిని తగులబెట్టి బూడిద చేయాలా? లేక రాక్షసరాజైన రావణుని కంఠమున తాడును తగిలించి అతడిని లాగుతూ ఇక్కడకు తెచ్చి శ్రీ రామచంద్రుని పాదముల దగ్గఱ పడవేయలా? లేక జగన్మాతయైన జానకిని చూసే తిరిగి రావాల? ఏమి చేయాలో చెప్పు. "
పరమశక్తిశాలియైన పవనకుమారుని వాక్కులను విని జాంబవంతుడు ప్రసన్నుడై ఇలా పలికాడు:- “నాయనా! నీవు సర్వసమర్థుడవు. కాని నీవు భగవానుని దూతవు, నీవు కేవలము సీతాదేవిని దర్శించి ఆమె సమాచారమును తీసికొనిరా, దీని తరువాత శ్రీరాముడు అక్కడికి వెళ్ళి అసుర కులమును ఉద్ధరింపగలడు, ఆయన పవిత్రికీర్తి విస్తరింపగలడు, మనమందఱము ప్రభువు కార్యమున సహాయకులమై ధన్యులవుదుము, మన వానర భల్లూక వీరుల ప్రాణములు నీ ఆధీనములో ఉన్నివి, మేమందఱము ఆతురతతో నీకై ఎదురు చూస్తుంటాము, నీవు త్వరగా వెళ్ళము, ఆకాశమార్గము ద్వారా వెళ్ళే నీకు శుభమగుగాక”!
వృద్ధులైన వానర భల్లూక వీరుల ఆశీర్వాదములచే ప్రసన్నుడై మహాపరాక్రముడు, శత్రుమర్దనుడు, శ్రీరామదూత అయిన హనుమానుడు ఎగిరి మహేంద్రగిరి పర్వత శిఖరము పైకి ఎక్కాడు. అతని చరణముల ఒత్తిడితో పర్వతము క్రిందకు కూరుకొనిపోసాగింది. వృక్షములతోపాటు పర్వతశృంగము
విరిగి క్రిందపడసాగింది. అప్పుడు సర్వప్రాణులకు వాయుపుత్రుడు, మహాత్ముడు అయిన హనుమానుడు మహాపర్వతమువలె విశాల కాయముగలవాడుగాను, సువర్ణవర్ణుడైన బాలసూర్యుని వలె మనోహరమైన ముఖము గలవాడుగాను, సర్పరాజువంటి దీర్ఘములైన భుజములు గలవాడుగాను కనబడసాగాడు.
(మహానగేన్ద్ర ప్రతిమో మహాత్మా సువర్ణ వర్ణోఽరుణ చారువక్త్రః
మహాఫణీంద్రాభ సుదీర్ఘ బాహుర్వాతాత్మజోఽదృశ్యత సర్వభూతైః। (అ.రా.4.9-29)
సముద్రమును దాటుటకు సిద్ధముగానున్న ఆంజనేయుడు పూర్వాభిముఖుడై తన తండ్రియైన వాయుదేవునకు నమస్కరించి, పిమ్మట శ్రీరామచంద్రుని స్మరించి వానరభల్లూక వీరులతో పలికాడు - "వానరులారా! నేను పరమప్రభువైన శ్రీరామునికృప చేత, అమోఘమైన ఆయన వాక్కును అనుసరించి లంకలోనికి వెళ్ళి జగజ్జననిని దర్శించి మరల తిరిగివస్తాను. ప్రాణాంతకాలమున ప్రభువుయొక్క నామమును స్మరించి మానవుడు సంసార సాగరమును దాటుతాడు, నేను ఆయన దూతను, దివ్యమైన ఆయన అంగుళీయకము నా దగ్గర ఉన్నది. నా హృదయమున ఆయనమూర్తి, వాక్కున ఆయన నామము విరాజిల్లుతున్నవి. నేను ఈ తుచ్ఛసముద్రమును దాటి కృతకృత్యుడ నవుతాను. ఇందులో గొప్ప విషయమేమి ఉన్నది? మీరు నేను తిరిగివచ్చునంతవఱకు కందమూలములను ఆహారముగా తింటూ ఇక్కడనే నాకై ఎదురు చూస్తూ ఉండండి”.
No comments:
Post a Comment