Friday, 19 November 2021

శ్రీ హనుమద్భాగవతము (80)



అంజనానందనుడిట్లా సమాధానం ఇచ్చాడు - “తల్లీ ! సురసా! నా నమస్కారములను స్వీకరించు. నేను ఆర్త త్రాణపరాయణుడైన రఘునాథుని కార్యమునకై లంకకు వెళుతున్నాను. ఇపుడు సీతా దేవిజాడను తెలిసికొనుటకై నీవు నన్ను పోనిమ్ము. అచట నుండి వెంటనే తిరిగివచ్చి రామునకు సీతా దేవి క్షేమసమాచారములను తెలియ జెప్పి నేను నీనోటిలోనికి ప్రవేశింపగలను” .


కాని శ్రీరామదూతయొక్క బలబుద్ధులను పరీక్షించుటకై వచ్చిన సురస ఆయనను ఏ విధముగా కూడా ముందుకు పోనీయకపోయింది. అపుడు హనుమంతుడు ఆమెతో 'మంచిది నీవు నన్ను భక్షించుము' అని పలికాడు. 


సురస తన నోటిని ఒక యోజనము వెడల్పు తెరిచింది. వాయునందనుడు వెంటనే తన శరీరమును ఎనిమిది యోజనముల వెడల్పు చేసాడు. ఆమె తన నోటిని పదహారు యోజనములు పెంచగా పవనకుమారుడు వెంటనే ముప్పై రెండు యోజనములు పెరిగాడు. సురస ఎంతగా తన భయంకరమైన నోటిని తెరుస్తోందో బృహత్కాయుడైన హనుమానుడు దానికి రెట్టింపుగా తన శరీరమును పెంచుచున్నాడు. సురస తన నోటిని నూఱు యోజనములు పెంచగా వాయుపుత్రుడు అంగుష్ఠమాత్ర ప్రమాణుడై ఆమె నోటిలోనికి ప్రవేశించాడు.


సురస తన నోటిని మూసికొనపోవుచుండగా మహామతియైన ఆంజనేయుడు ఆమె నోటి నుండి బయటకు వచ్చి వినయముగా తల్లీ ! నేను నీ నోటిలోనికి వెళ్ళి బయటకు వచ్చాను. నీ మాట పూర్తియైనది. ఇప్పుడు నన్ను నా స్వామి కార్యమును తీర్చుటకు పోనిమ్ము’.


సురస శ్రీరామదూతను పరీక్షించుటకే వచ్చినది. ఆమె ఇలా పలికింది :- వాయునందనా ! నీవు జ్ఞాననిధివి. దేవతలు నిన్ను పరీక్షించుటకై నన్ను పంపారు. నేను నీ బలబుద్ధులరహస్యము నెఱింగాను. ఇప్పుడు నీవు వెళ్ళి శ్రీరాముని కార్యమును నెరవేర్చు. నీకు తప్పక సాఫల్యము కలుగుతుంది. నేను హృదయపూర్వకముగా నిన్ను ఆశీర్వదించుచున్నాను”.


No comments:

Post a Comment