Saturday 13 November 2021

శ్రీ హనుమద్భాగవతము (74)



'సీతా దేవి విలాపాన్ని విని ఆమెనుండి ఎడబాటు గలిగిన రామలక్ష్మణుల పరిచయమును పొంది, దశరథ మహారాజుతో నాకు గల స్నేహమును గుర్తుకు తెచ్చుకొని, నాపుత్రుడు సీతా దేవిని కాపాడలేదు. తన ఈ ప్రవర్తనచే అతడు నన్ను సంతోష పెట్టలేకపోయాడు. అనగా నాకు ఇష్టమైన పనిని జరుగనీయలేదు'.


గొప్ప అదృష్టవంతుడైన సంపాతి వానరులకు తన కథ చెబుతుండగానే అతని రెండు టెక్కలు తిరిగి ఉత్పన్నమయ్యెను. అతనికి యౌవనకాలము నాటి బలము కూడా కలిగింది. మహర్షి యైన చంద్రుని వాణిని స్మరించి అతడు ఎంతో సంతోషించి వానరులతో ఇలా పలికాడు :


సర్వథా క్రియతాం యత్నః సీతామధిగమిష్యథ || 

పక్షలాభో మమాయం వః సిద్ధిప్రత్యయకారకః | (వా. రా. 4.68–12–13)


వానరులారా ! మీరన్ని విధముల ప్రయత్నించండి. తప్పక మీకు సీతా దేవిదర్శనము కలుగుతుంది. నాకు ఱెక్కలు మొలచుట మీ కార్యసిద్ధికి సూచన’. 


తరువాత అతడు మంగళమయమైన శ్రీ రామచంద్రుని నామముయొక్క గొప్పతనమును గురించి వర్ణిస్తూ సముద్రోల్లంఘనము మీకు ఎంతో సులభ కార్యమని చెప్పి వారితో సంపాతి ఇట్లా పలికాడు ;


యన్నామస్మృతిమాత్రతో ఽపరిమితం సంసార వారానిధిం 

తీర్త్వా గచ్ఛతి దుర్జనోఽపి పరమం విష్ణోః పదం శాశ్వతమ్ | 

తస్యైవ స్థితి కారిణస్త్రిజగతాం రామస్య భక్తాః ప్రియా 

యూయం కిం న సముద్రమాత్రతరణే శక్తాః కథం వానరాః || 

(అ. రా. 4-8-55) 


‘వానరులారా ! ఎవని నామస్మరణము చేతనే దుష్టజనులు కూడా ఈ అపారసంసార సాగరాన్ని దాటి విష్ణుభగవానుని సనాతన పరమపదమును పొందుతున్నారో, మీరు ముల్లోకములను కాపాడే ఆ శ్రీరామచంద్రునకు ప్రియభక్తులు. ఇక క్షుద్రమైన ఈ సముద్రమును దాటుటకు మీఎందుకు సమర్థులు కారు?


వినీతాత్ముడు, మహాపరాక్రమశాలియైన పవనకుమారుడు అదృష్టశాలియైన సంపాతి పలికిన ఒక్కొక్క మాటను ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. సీతా దేవి యొక్క స్పష్టమైన జాడ తెలిసింది. పిమ్మట అతని సంతోషమునకు అవధులు లేకపోయాయి. అతని రోమరోమము పులకించిపోయింది.


అప్పుడు పక్షి శ్రేష్ఠుడైన సంపాతి ఆ పర్వతశిఖరము నుండి ఎగిరి వెళ్ళిపోయాడు. 


----------***********------------


No comments:

Post a Comment