ఇక రాఘవుడు పరావిద్యనుబోధిస్తున్నాడు. ఇంతకు మందు ఆంజనేయుడు సూర్యుని నుండి నేర్చుకొన్నది అపరావిద్య. విష్ణువైన రాముడే సూర్యభగవానునకు పరావిద్యను బోధించినట్లు గీతలో ఉంది.
ఇమంవైవస్వతం యోగం ప్రోక్తవానహం అవ్యయం
అనగానేను నీకందించబోయే ఉపదేశాన్ని ఏనాడో సూర్యునకిచ్చానని అన్నాడు అర్జునునితో కృష్ణుడు.
ఆవు ఎందరికో పాలనిస్తుంది. పాలు చేపడానికి ముందు దూడ ఉండాలి. కదా! అట్టిదే ఉపదేశమనే క్షీరం. ఉపదేశం పొందడానికి అర్హులైన వారెందరో ఉన్నా ఉపదేశాన్ని శిష్యునకే అందిస్తాడు. గీతలో ధ్యాన శ్లోకం ఇట్లానే చెబుతుంది. గోపాలుడైన కృష్ణుడు ఉపనిషత్తులనే గోవును పిదికి గీతామృతాన్ని అందించాడు. అర్హులైన వారు దానిని త్రాగవచ్చు. వారి ప్రతినిధిగా అర్జునుని దూడగా గ్రహించాడని ఉంది.
సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందనః
పార్థోవత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్.
కృష్ణుడు జ్ఞానాచార్యుడు కాగా అర్జునుడు శిష్యుడయ్యాడు. రామునకు హనుమయే శిష్యుడు. ఆ హనుమయే అర్జునుని పతాకంపై ఉన్నవాడు. అట్లా ఉండడం వల్ల అర్జునుడు విజయుడైనాడు.
దక్షిణామూర్తి మాదిరిగా రాముడు చిన్ముద్రనుపట్టాడు. ఒక కాలును మడిచి మరొక కాలిపై వేసుకొని ఒకటి వ్రేలాడుతూ ఉండగా అనగా వీరాసనంలో ఉండి ఉపదేశించాడు. ధ్యాన శ్లోకం చూడండి:
కాలాంభోధరకాంతి కాంతమనిశం వీరాసనాధ్యాసినం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరం హస్తాంబుజం జానుని
అనగా వర్షాన్ని కురిపించే మేఘం యొక్క రంగుతో వీరాసనంలో ఉండి, చిన్ముద్ర ధరించినవాడై ఒకచేతిని మోకాలిపై ఉంచినవాడై యున్నాడు.
మరొక ధ్యాన శ్లోకమూ ఉంది. దీనిని రామాయణ పారాయణానికి ముందు చదువుతారు. ఇందూ వీరాసనంలో ఉన్నట్లుంది. ఇందు చిన్ముద్ర ప్రస్తావన లేదు. ఇందు ఋషుల సమక్షంలో ఆంజనేయునకు ఉపదేశించినట్లుంది:
వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం
అగ్రేవాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజేశ్యామలం
దక్షిణామూర్తిలా వీరాసనంలో కూర్చొని యున్నా వేదాంతోపదేశం చేస్తున్నా దక్షిణామూర్తిలా ఒక్కడేలేదు. రాముడు రాజు, ఋషి కూడా. అనగా కర్మయోగాన్ని, జ్ఞాన యోగాన్ని కలిగిన వాడు. అతడు బంగారు మంటంపై భార్యతో కూడియున్నాడు. అందువల్ల వైదేహీ సహితం. విదేహరాజ్యంలో జన్మించింది. కనుక వైదేహి. రాముడిక్కడ జ్ఞానాచార్యునిగా ఉన్నాడు కనుక అతని భార్యను సీతయని గాని, జానకియనిగాని అనలేదు. వైదేహి అనే ఉంది. అనగా శరీర భావన లేనిది. ఆత్మస్వరూపురాలన్నమాట. కనుక ఆమె తత్త్వరూపిణియే. అట్టి స్త్రీ తన ఎడమ ప్రక్కన ఉండగా ఉపదేశిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆమె తత్త్వాన్నే ఉపదేశిస్తున్నాడు. ప్రక్కన భరతాదులున్నారు. భరతాదిభిః పరివృతం రామంభజే శ్యామలం, అని ఉంది.