Wednesday 26 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (3)



ఇంతలో- వీచిన గాలి తాకిడికి చీరకొంగు తొలగినది. వక్ష స్థలమూ- శరీర భాగాలూ కనిపించసాగినై, యతికైనా- మతిపోయే ఆ అందం వాయుదేవుని డెందాన్ని హరించింది, మోహం జనించింది. నిగ్రహం కోల్పోయిన వాయుదేవుడు అంజనను గట్టిగా కౌగిలించుకున్నాడు.


తనను కౌగిలించుకున్నది దేహమే లేని వాయువు కావడం వలన అంజన ఏమి జరుగుతున్నదో గమనించలేక పోయినది. ఐతే తనకేదో జరుగుతున్నదని మాత్రం కొంత వడికి గ్రహించుకున్నది. భయకంపితురాలైనది. పెద్దగ అరచినది. 'నా శీలమును అపహరింప చూస్తున్నదెవరు ?' అంటూ శపించ సిద్ధపడింది.


పరిస్థితిని గ్రహించిన వాయుదేవుడు ప్రత్యక్షమై “అంజనా? 'మాభీః' భయపడవలసినది లేదు. నీ శీలమునకేమి తక్కువలేదు. నేను పవనుడను. నా ఆలింగనము వలన గొప్ప ధైర్యవంతుడూ, నీతికోవిదుడూ, మహా పరాక్రమవంతుడూ, తేజస్వంతుడూ, మహా బలుడూ, ఎగురుటలోనూ- దుముకుటలోనూ- నాతో సమానుడైన ఒకకుమారుడు నీకుజన్మించగలడు" అనిచెప్పి అదృశ్యుడయ్యెను.


కలనైనా ఊహించని యీ హఠాత్సంఘటన అంజనను అనందవార్ధిలో ముంచెత్తినది. పుత్ర జననోత్సాహ వార్తను భర్త కేరిగించినది. కేసరియు, అవధిలేని ఆనందంతో పొంగిపోయినాడు. అంజన గర్భవతియైనది. అచటి పర్వత ప్రాంతాలలో విహరిస్తూ నవమాసాలు నిండగనే- వైశాఖ బహుళ దశమీ పూర్వాభాద్రా నక్షత్ర వైధృతియోగ మధ్యాహ్నవేళ ఒక కుమారుని కన్నది. అతడే ఆంజనేయుడు. అంజనాగర్భ సంభూతుడగుట వలన యీ పేరు వచ్చినది. 


No comments:

Post a Comment