ఇది బలశాలికి నైజము కధ
కానక కన్న సంతానమగుట అంజనా కేసరులు ఆంజనేయుని కడు గారాబముగ సాకుచుండిరి. కుమారుని బాల్యక్రీడలు కని ఆ తల్లిదండ్రులు అవధి లేని ఆనంద తరంగాల తేలియాడుచుండిరి. ఒకనాడు ఆంజనేయుడు ఆకలిగొని ప్రాగ్దిశన అపుడే ఉదయించు బాలభానుని గాంచి పండిన పండుగా భ్రమించి దానిని పట్టుకొనుటకై ఒక్క ఉదుటున ఎగిరి వాయువేగ మనోవేగాల అంబరవీధిన సాగిపోవుచుండెను.
సూర్యుని చేరబోవు కుమారుని చూచి వాయుదేవుడు గమనా యాసము కలుగనీయక చల్లగ వీచుచు వెన్నంటి సాగెను. తననే చేరవచ్చు తన మిత్రకుమారునకు తన కిరణాల వేడి తగలనీయ రాదను భావనతో కాబోలు సూర్యుడును చల్లగనే తోచెను.
ఆనాడు సూర్య గ్రహణం. సూర్యగ్రసనమునకై రాహువు వచ్చెను. అంజనా నందనుడు రాహువునే కబళింపబోయెను. రాహువు వెఱగంది భీతచితుడై సరగున శచీనాథుని చేరి తన దీన గాథను విన్నవించెను. ఇంద్రుడు సంభ్రమాశ్చర్యాలతో సింహికా తనయుని వెంటగొని ఐరావతారూఢుడై వచ్చి హనుమంతునితో ఇది తగదని పలికెను. ఇరువురకు పోరు సాగింది. ఆత్మరక్షణార్థం ఇంద్రుడు వజ్రాయుధమును సామీరిపై ప్రయోగించెను. అది బాలుని ఎడమ హనువును తాకింది. పర్వత శిఖరాన పడిపోయినాడు. ఆ దెబ్బకు మూర్ఛితుడై పర్వత శిఖరాన పడిపోయినాడు.
No comments:
Post a Comment