Sunday 23 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (30)



సోదరులు తిన్నగా ఉన్నా వారికి ఉపదేశించడం లేదు. ఆంజనేయునకే, ప్రత్యక్ష శిష్యునకే ఉపదేశించాడు. మిగిలినవారు విన్నారు. అందుకే


అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్త్వం


అనగా ఆంజనేయుడు వినయ భరితుడై వింటున్నాడు. అతనికి తిన్నగా అందిస్తున్నా ఋషులందరూ అతని మనస్సులో ఉన్నారు. అందుకే తత్త్వం మునిభ్యః పరం. అనగా ఋషులకు పరావిద్యనిచ్చాడు.


సీతారామాంజనేయ సంవాదమని తెలుగులో ఒక ప్రత్యేక గ్రంథం ఉంది. ఇందు రాముడే కాదు, సీత కూడా ఉపదేశించినట్లుంది. అద్వైతం గురించి మౌలిక గ్రంథాలు ప్రాంతీయ భాషలలో ఉండవు. అవి సంస్కృత గ్రంథాలకు అనువాదాలే. కాని ఈ గ్రంథం ప్రత్యేకతను సంతరించుకొంది. ఇందు సీత ముందుగా రామతారక మంత్రాన్ని హనుమకు ఉపదేశించినట్లుంది. ప్రాణసమానురాలైన సీత నుండి రామమంత్రం రావడం గొప్ప కదా! తరువాత రాముడు, సాంఖ్యయోగాన్ని, అమనస్కయోగాన్ని ఉపదేశిస్తాడు. అనగా అద్వైతాన్ని. అదంతా విపులంగా ఉంటుంది ఈ గ్రంథంలో.


సీతారాములు హనుమకు ఏదిచ్చినా తృప్తి పడరు. ఆంజనేయుడు కోరేదీ ఏమీ లేదు. వారిని సేవించడంలోనే తృప్తిని పొందుతాడు. కాని సీతారాములకు తృప్తి కలగడం లేదు. అందువల్ల జ్ఞాన సంపదనీయాలను కొన్నారు. అది తరిగే సంపద కాదు. అందువల్ల ఉపదేశమిచ్చారు. వారు జగత్తునకే తల్లిదండ్రులు కదా! ఆంజనేయునకు గురువులైనారు. వారే తల్లి, తండ్రి, గురువు దైవమయ్యారు. వేదానికి శిరోభాగం ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తులలో ముక్తికోపనిషత్తు ఒకటి. ఇందు రాముడు, ఆంజనేయునకు ఉపదేశించినట్లుంది. ఆ పేరే అద్వైత సారం అందిస్తోందని తెలివిడి చేస్తోంది.


ఈ ఉపనిషత్తులో ఋషుల సమక్షంలో ఆంజనేయునకు తిన్నగా ఉపదేశించినట్లుంది. దక్షిణామూర్తి నుండి వినిన సనకాదులందున్నట్లు చెప్పబడింది.


ఇందు ఆంజనేయుడు, ఎన్నో ప్రశ్నలు వేసి జ్ఞాన క్షీరాన్ని పొందినట్లుంది. నీ తత్త్వ స్వరూపం చెప్పు రామా అని అడిగినట్లు ముక్తావస్థను ప్రసాదింపుమని అడిగినట్లుంది.


ఇందులో 108 ఉపనిషత్తుల పేర్లు ఉన్నాయి. ఏ ఉపనిషత్తు, ఏ వేదానికి చెందిందో కూడా ఉంది. ఏ శాంతి మంత్రాన్ని, ఏ ఉపనిషత్తు ముందు పఠించాలో కూడా ఉంది. ఇందు వేద శాఖల ప్రస్తావన ఉంది.


రాముడొక్కడే మర్యాద పురుషోత్తముడు కాడు. ఆంజనేయుడూ అట్టివాడే. అందుకే అతడు సమస్త సద్గుణ సంపన్నుడని తులసీదాసు కీర్తించాడు. సకల గుణ నిధానం అన్నాడు. అన్ని గుణాల కంటే ఉత్తమమైనది జ్ఞానమని అందువల్ల రాముని నుండి ఉపదేశాన్ని పొందాడు. మన జీవితాలలోనూ ధర్మమనే సంపదను సంపాదించాలి. జ్ఞాన సంపదను సంపాదించాలని ఇతని జీవితం, పాఠం చెప్పడం లేదా?


అన్నింటిలో అందరికీ గురుప్రాయుడైన ఆంజనేయుడు, స్వయంగా శిష్యుడై నిరంతరం అభ్యసిస్తూనే ఉన్నాడు. ఇది గుణపాఠం కాదా? గురువు, శిష్యుడై గురువు నుండి జ్ఞానాన్ని పొందిన ఆంజనేయుడు మన అందరికీ ఆదర్శప్రాయుడే. 


ఇక్కడితో కంచి పరమాచార్య స్వామి వరు హనుమంతులవారి పై ఇచ్చిన అమృతవాణి సమాప్తం.  


No comments:

Post a Comment