Friday 14 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (21)



చిరంజీవిగా ఉండడం శిక్షగా భావించకుండా గౌరవంగా ఎందుకు భావించాడు? అంతా రామమయమని అద్వైత భావనతో ఉన్నాడు. అద్వైత సుఖానికి మించిన రామనామాన్ని రాముడిచ్చాడు. నిరంతర నామోచ్చారణ వల్ల ఆ నామమే తానయ్యాడు. అతని నుండి భక్తికాంతులు వెలువడ్డాయి. కిరణాలు చీకటిని పోగొట్టినట్లు మనలోని అజ్ఞానం పటాపంచలౌతోంది. భజనలు వింటూ ఉంటే సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు. పరమపదంలో (వైకుంఠం) భజనలున్నా పెద్ద కాంతి ముందు చిన్న దీపం వెలిగించినట్లు వెలవెల బోతుంది. కాని ఈ లోకంలో ఉన్న చీకటిలో దీపం వెలిగిస్తే దీపకాంతి స్పష్టంగా ఉంటుంది. అంటే చీకటిలో దీపకాంతి స్ఫుటంగా ఉంటుంది. నామమనే దీపాన్ని వెలుగునట్లు చేస్తాడు.


పరమపదంలో అతడు చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఉండి అతడు రామదాసుడై రామకార్యానికి తనవంతు సాయం చేస్తాడు. భక్తి ధర్మాలను వ్యాప్తిలోనికి తీసికొని రావడానికే ఉన్నాడు. పొడిగా నున్న ప్రాంతం వర్షాన్ని కోరుతుంది. అట్లాగే ఇక్కడ ఉండడం అనుగ్రహమే అని భావిస్తాడు.


మహాత్ములు తమ కాప్తులు మరణించినా బాధపడరు. ఇదంతా నాటకమని భావించడం వల్ల దుఃఖించరు. నాటకంలో అనేక పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అన్ని పాత్రలూ ఒకేసారి రావు. లంకలో వానరులు చనిపోయారు. వారికై ఇతడు బాధపడలేదు. రామలక్ష్మణులకోసం సంజీవ పర్వతాన్ని తీసికొని వచ్చినపుడు వానరులూ బ్రతికారు. అప్రయత్నంగా వారు బ్రతకడం జరిగింది. బ్రతికారని సంతోషించలేదు.

No comments:

Post a Comment